ETV Bharat / city

పెచ్చరిల్లుతున్న సైబర్‌ నేరాలు.. కట్టడి చేయకపోతే అంతే సంగతులు

author img

By

Published : Jul 13, 2022, 9:43 AM IST

పెచ్చరిల్లుతున్న సైబర్‌ నేరాలు
పెచ్చరిల్లుతున్న సైబర్‌ నేరాలు

cyber crime increased: పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సైబర్​ నేరగాళ్ల చేతిలో చిక్కుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజూ ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినా జనాల్లో మార్పు రావడం లేదు. చదువుకున్న వారు, విద్యావంతులూ ఇందుకు మినహాయింపేమీ కాదు. తాజాగా దేశంలో సైబర్​ నేరాలు ఐదు రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

cyber crime increased: భారతదేశంలో 2018-2021 మధ్య కాలంలో సైబర్‌ నేరాలు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వ ‘భారత కంప్యూటర్‌ ఆత్యయిక స్పందన దళం (సెర్ట్‌-ఇన్‌)’ ధ్రువీకరించింది. ఈ సంగతి గత ఏప్రిల్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొవిడ్‌ కాలంలో సైబర్‌ నేరగాళ్లు విజృంభించారు. లాక్‌డౌన్​ల వల్ల ఇంటి నుంచి పనిచేయడం ఎక్కువ కావడాన్ని నేరగాళ్లు అదనుగా భావించారు. డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయడం ఎక్కువైంది. ఫిషింగ్‌, మెయిల్‌ స్పామ్‌, ర్యాన్సమ్‌ వేర్‌ దాడుల వంటివి తరచుగా చోటుచేసుకున్నాయి. 2022లోనూ ఇవి కొనసాగుతున్నాయి.

సమాజంలో అన్ని వర్గాలవారూ సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు ఆన్‌లైన్‌ సైబర్‌ నేరగాళ్ల మోసానికి క్షణాల్లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు చెప్పి డబ్బు కాజేయడానికి సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నించడమూ ఎక్కువైంది. ఫోన్‌లో బ్యాంకు పేరు చెప్పి కేవైసీ వివరాలను ఆరా తీసి ఖాతాదారులకు టోపీ పెట్టే ఘటనలు పెరిగిపోయాయి. ఫైనాన్షియల్‌ సేవల డిజిటలీకరణను ఉపయోగించుకుని సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నందు వల్ల ప్రజలు పెద్ద ఎత్తున సొమ్ము పోగొట్టుకుంటున్నారు. కనీసం పాఠశాల చదువైనా పూర్తి చేయనివాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడటం, వారి చేతిలో జనం మోసపోవడం- నిర్ఘాంతపరచే పరిణామాలు.

ఆటంకాలెన్నో...
శిక్షార్హమైన నేరం జరిగినప్పుడు పోలీసులు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలి. కానీ, ఇప్పటికే సాధారణ కేసుల భారం అలవికాని స్థాయికి పెరిగిపోయిందని పోలీసులు చెబుతుంటారు. పని భారం ఎక్కువైందనో, తమ ఇలాకాలో శాంతిభద్రతలు దివ్యంగా ఉన్నాయని చెప్పుకోవడానికో సైబర్‌ నేరాలను రిజిస్టర్‌ చేసుకోవడానికి పోలీసు సిబ్బంది వెనకాడటం నేరగాళ్లకు కలిసి వస్తోంది. దీనివల్ల దేశంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు నిఘా వేసి శీఘ్రంగా సరైన విధంగా స్పందించడానికి వీల్లేకుండా పోతోంది. నేరగాళ్ల యంత్రాంగాలను ఛేదించడమూ కష్టమవుతోంది. నిజానికి స్థానికంగా జరిగే సైబర్‌ నేరాలు తక్కువే. దేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో చేసే మోసాలే ఎక్కువ కాబట్టి పోలీసులకు పని భారం పెరిగిపోతుందనే భయం అక్కర్లేదు. దేశంలోని పోలీసు స్టేషన్లన్నీ సైబర్‌ నేరాలను కచ్చితంగా నమోదు చేసుకుని ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలను దర్యాప్తునకు వినియోగించాలి.

.

దేశంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి రాష్ట్రాల పోలీసు శాఖలతో కలిసి పనిచేయడానికి కేంద్ర హోంశాఖ 2018లో భారతీయ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) ప్రారంభించింది. సైబర్‌ నేరాలపై ఫిర్యాదులు నమోదు చేయడానికి 2019లో ప్రత్యేక పోర్టల్‌ ‘సైబర్‌ క్రైమ్‌.జీఓవీ.ఐఎన్‌’ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్‌ మోసం జరిగినప్పుడు పౌరులు నేరుగా ఈ పోర్టల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 1930 నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్‌కు పంపుతారు. ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసానికి గురైన వెంటనే పౌరులు ‘ఆర్థిక సైబర్‌ నేరాల రిపోర్టింగ్‌, నిర్వహణ వ్యవస్థ’కు ఫిర్యాదు చేస్తే డబ్బు మోసగాళ్ల చేతిలో పడకుండా నిరోధించవచ్చు. మోసం లేదా నేరం జరిగినప్పుడు పౌరులు ఫిర్యాదు చేయడానికి వీలుగా 100, 1930 నంబర్లను అనుసంధానిస్తే బాగుంటుంది. నానాటికీ పెరిగిపోతున్న డిజిటల్‌ చెల్లింపులు భద్రంగా సాగేట్లు చూడటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి ‘సైబర్‌ సేఫ్‌ పోర్టల్‌’ను రూపొందించాయి. సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలతో ఒక డేటా బేస్‌ ఈ పోర్టల్‌కు అందుబాటులో ఉంది. ఎప్పుడు సైబర్‌ నేరం జరిగినా ఆ వివరాలు పోర్టల్‌ డేటాబేస్‌లోకి చేరిపోతాయి.

సైబర్‌ నేరాలపై దర్యాప్తునకు పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)తో కలిసి ఐ4సీ సైట్రైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. స్థానిక సైబర్‌ మోసగాళ్ల జాబితాతోపాటు వారికి సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్నవారి జాబితానూ రూపొందించి అరెస్టులు చేయడానికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ నాయకత్వంలో ప్రత్యేక స్థానిక పోర్టల్‌ను ఏర్పరచాలి. జిల్లాలు, రాష్ట్రాలు, దర్యాప్తు సంస్థల మధ్య; పోలీసులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల మధ్య సమన్వయ సహకారాలను పటిష్ఠపరచి సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించాలి.

ప్రత్యేక పథకం అవసరం..
తెలంగాణ ప్రజలు 2021 మధ్య నుంచి ఇప్పటివరకు సైబర్‌ నేరాల్లో దాదాపు రూ.216 కోట్లు పోగొట్టుకున్నారు. బాధితుల్లో గ్రామీణులూ ఉన్నారు. బాధితులకు తోడ్పడటానికి తెలంగాణ సైబర్‌ నేర నిరోధ సమన్వయ కేంద్రం 2021లో ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పింది. సైబర్‌ నేరాల ద్వారా ఆర్జించిన సొమ్ము దేశంలోపల, వెలుపల దేశద్రోహ కార్యకలాపాలకు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు, ఉగ్రవాద శక్తులకు చేరుతుంటే వెంటనే నిరోధ చర్యలు తీసుకోవాలి. దీనికి రిజర్వు బ్యాంకు, ఐబీ, ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌, పోలీసు శాఖలు చేయీచేయీ కలిపి పనిచేయాలి. గతంలో తీవ్రవాదంపై పోరుకు ప్రత్యేక మౌలిక వసతుల పథకాన్ని చేపట్టిన కేంద్రప్రభుత్వం ఇక సైబర్‌ నేరాలపై పోరుకూ అటువంటి పథకాన్ని తీసుకురావాలి. పౌరులకు సైబర్‌ మోసాల నుంచి పకడ్బందీగా రక్షణ కల్పించాలి.

.

రక్షణ విధానమేదీ?

* పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణకు ఇప్పటికీ సరైన విధానం లేదు. పౌరుల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు, వాటిలోని సమాచారాన్ని విక్రయించేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం కష్టమైపోతోంది.

* సెల్‌ఫోన్లలో వినియోగించే సిమ్‌ కార్డులు తేలిగ్గా దొరుకుతుండటంతో నకిలీ పత్రాలతో వాటిని దొరకబుచ్చుకుని సైబర్‌ మోసాలకు ఒడిగట్టేవారు పెరిగిపోతున్నారు.

* సైబర్‌ నేరాలపై అసలు ఎఫ్‌ఐఆర్‌ లే దాఖలు చేయకపోవడం వల్ల దర్యాప్తునకే దిక్కులేకుండా పోతోంది. అలాంటప్పుడు చర్యలు తీసుకోవడమెలా?

* కొన్ని సందర్భాల్లో సైబర్‌ నేరగాళ్లు ఉన్న ప్రాంతంలోకి ప్రవేశిస్తే మతపరమైన ఉద్రిక్తతలకు, శాంతిభద్రతల సమస్యలకు తావిచ్చినట్లవుతుందనే సందేహంతో రాష్ట్ర పోలీసు శాఖలు ముందుకు కదలలేకపోతున్నాయి. దీన్ని ఎంతమాత్రం సాగనివ్వరాదు.

* ప్రజాస్వామ్య భారతంలో న్యాయ పాలనే సర్వోన్నతం, దానికి ఎటువంటి మినహాయింపులూ లేవు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.