ETV Bharat / city

నిరుద్యోగులకో కబురు.. నేడు అసెంబ్లీలో ప్రకటన.. పది గంటలకు టీవీ చూడండి !

author img

By

Published : Mar 9, 2022, 4:15 AM IST

CM KCR On Jobs Notification: "ఈమధ్య దేశంలో గోల్‌మాల్‌ చేసేవాళ్లు మోపయ్యారు. దేశాన్ని ఆగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కుల, మత పిచ్చి లేపి దేశాన్ని, రాజకీయాలను మంట గలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి అరాచకం నా తెలంగాణలో రానివ్వను. ప్రజలందరూ కూడా ఈ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ మాదిరే దేశాన్ని కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి భగవంతుడు ఇచ్చిన యుక్తిని, శక్తిని వినియోగించడానికి మీరంతా వెళ్లమని దీవిస్తున్నారు కాబట్టి మడమ తిప్పకుండా ముందుకు సాగుతా. బంగారు తెలంగాణలాంటి బంగారు భారతదేశాన్ని తయారు చేయడానికి పురోగమిస్తా." - వనపర్తి సభలో కేసీఆర్‌, తెలంగాణ సీఎం

CM KCR On Jobs Notification
CM KCR

నిరుద్యోగులకో కబురు.. నేడు అసెంబ్లీలో ప్రకటన

TELANGANA CM KCR: ‘నిరుద్యోగ యువత కోసం బుధవారం పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేస్తున్నా. పది గంటలకు అందరూ టీవీలు చూడండి.. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో, ఏం ప్రకటన చేయబోతున్నానో తెలుసుకోడానికి నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు సిద్ధంగా ఉండాలి’ అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వనపర్తిలో మంగళవారం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అణువణువునా తెలంగాణను జీర్ణించుకున్న శరీరంతో ఈ ప్రాంత ప్రగతి కోసమే చివరి రక్తం బొట్టు దాకా ప్రయత్నిస్తానన్నారు. ‘కులం, మతం, జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి. రాష్ట్రం రాకముందు నేను తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పా. నన్ను అవమానపరిచారు. తెలంగాణ వచ్చాక ప్రగతి చూపించాను. ఇదే ప్రగతి, ఇదే పద్ధతి భారతదేశం అంతా రావాలి. దేశం కోసం కూడా పోరాటానికి ముందుకు పోవాలి’ అని అన్నారు. ‘పోదామా దేశం కోసం పోరాటానికి’ అంటూ సభికులను పలుమార్లు ప్రశ్నించగా ప్రజలు ‘పోదాం’ అంటూ సమాధానమిచ్చారు. ‘చివరి వరకు కొట్లాడుదామా’ అని ప్రశ్నించగా ‘వెళదాం’ అంటూ పిడికిలి బిగించారు. ‘దేశ్‌ కీ నేత కేసీఆర్‌’ అంటూ నినాదాలు చేశారు. ‘‘తెలంగాణ కోసం కొట్లాడినట్లే.. దేశంలో శాంతిని, సామరస్యాన్ని కాపాడటానికి అవసరమైతే ప్రాణం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. మతపరంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టడం మంచి పద్ధతి కాదు. చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని బలి పెట్టే విషపు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మేధావులు ఈ ప్రయత్నాలు తిప్పికొట్టాలి. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని పంపితే మోదీ దానిని ముందుకు తీసుకెళ్లలేదు. వాల్మీకి బోయలు ఎన్నోరోజుల నుంచి కొట్లాడుతున్నారు.. వారి గురించి కూడా కేంద్రానికి పంపితే బేఖాతరు చేస్తోంది.

మూర్ఖపు పద్ధతిలో వ్యవహరిస్తోంది..

కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లు తెలియవు.. మూర్ఖపు పద్ధతిలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మతపిచ్చి ఉన్నవాళ్లను కూకటివేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో విసిరేయాలి. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాకు, భాజపాకు బుద్ధి చెప్పాలి. - వనపర్తి సభలో సీఎం కేసీఆర్‌

వలసలు, ఆత్మహత్యలు లేవు..

ఈరోజు తెలంగాణలో ఆకలి చావులు లేవు.. ఆత్మహత్యలు లేవు.. కరవులు రావు.. వలసలు ఉండవు.. ఒక్క పాలమూరు నుంచే 15 లక్షల మంది వరకు వలస వెళ్లేవారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. ఇప్పుడు రాయచూరు, కర్నూలు నుంచి కూలీలు పాలమూరుకు వలస వస్తున్నారు. ఎక్కడా లేనట్లు దళిత బిడ్డల కోసం రూ. 10 లక్షలు ఇస్తున్నాం. మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు.. నచ్చిన పని చేసుకుని బ్రహ్మాండంగా ముందుకుపోవాలి. దళిత బిడ్డలు కూడా పైకిరావాలి. దేశమే మన వద్ద నేర్చుకోవాలి. పేదింటి ఆడ బిడ్డలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అవన్నీ గ్రామాల్లో మీ కళ్ల ముందు ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన తరవాత ఎవరెన్ని చెప్పినా కచ్చితంగా ఉద్యమ జెండా పరిపాలనలోనే న్యాయం జరుగుతుందని ప్రజలు దీవించి అధికారం ఇచ్చారు. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదు. ఇప్పుడు 5 వచ్చాయి. ఆ మధ్య హైదరాబాద్‌ నుంచి గద్వాల వరకు బస్సులో వస్తుంటే ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు. పంటలు కోసే హార్వెస్టర్లు, ధాన్యం తరలించే డీసీఎంలు కనిపించాయి. సంతోషం పట్టలేక బస్సు దిగి పొలాల్లోకి వెళ్లి చూశాను. అద్భుతమైన పంటలతో పాలమూరు జిల్లా పాలుగారుతోంది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై హరిత ట్రైబున్యల్‌ వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తి చేస్తే మహబూబ్‌నగర్‌ జిల్లా వజ్రపు తునకలా తయారవుతుంది.

కవితా గానం..

‘వలసలతో వలవలా విలపించిన కరవు జిల్లా.. పెండింగ్‌ ప్రాజెక్టులనే వడివడిగా పూర్తి చేసింది.. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకొంది.’ అంటూ కేసీఆర్‌ కవితను వినిపించారు. అనంతరం ప్రసంగం కొనసాగిస్తూ ‘ఏ నడిగడ్డలో, ఏ పాలమూరులో ఆచార్య జయశంకర్‌తో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నానో ఈ ప్రాంతం పచ్చబడింది. కేంద్రం ప్రగతి సాధించిన 10 గ్రామాల లెక్కతీస్తే వాటిలో ఏడు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ వచ్చాక సంభవించిన మార్పు ఇది. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పచ్చని చెట్టు ఉన్నాయి. 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్రం తలసరి ఆదాయం పెరుగుతోంది. దేశంలో మొదటి స్థానంలో నిలుస్తున్నాం. నిరంజన్‌రెడ్డిలాంటి మిత్రుడు ఉండటం నా అదృష్టం. ఒకప్పుడు ఎకరా రూ. 30 వేలకు అమ్ముకున్న వనపర్తిలో నేడు రూ.3 కోట్లు పలుకుతోంది. భూముల ధరలు, 24 గంటల కరెంటు, సాగునీళ్లు, తాగునీళ్లు ఎంత అద్భుతం. పట్టుబడితే, జట్టు కడితే, పిడిగిలి బిగిస్తే, న్యాయం కోసం పురోగమిస్తే ఈ తెలంగాణ తయారయింది. ఈ రోజు తెలంగాణ ఏ విధంగా కనబడుతోందో దేశం మొత్తం కూడా అలా కావాలి’’ అని ప్రసంగం ముగించారు.

‘మన ఊరు-మన బడి’ ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని వనపర్తిలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తామంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే పైకి వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు ఏర్పాటు అవుతాయని, నర్సరీ నుంచే ఇంగ్లిషు మీడియం ఉంటుందన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులంతా వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.