ETV Bharat / city

KishanReddy: తొలిరోజు విజయవంతంగా కిషన్​రెడ్డి యాత్ర.. రెట్టింపు ఉత్సాహంతో రెండో రోజు..

author img

By

Published : Aug 20, 2021, 7:17 AM IST

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. తొలి రోజు విజయవంతంగా ముగిసింది. జన ఆశీర్వాద యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. తెలంగాణలోని కోదాడ, సూర్యాపేటలో సాగిన యాత్రలో... కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూనే కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొలిరోజు యాత్రను ముగించుకున్న కిషన్‌రెడ్డి.. సూర్యాపేటలోనే బస చేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.

kishan
kishan

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి... జన ఆశీర్వాద యాత్ర.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అట్టహాసంగా సాగింది. కోదాడ, సూర్యాపేటలో... కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందని... కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోదీ పాలన చేస్తుంటే.. ఏడేళ్లుగా కేసీఆర్ అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో ఓ ట్విట్టర్ నాయకుడు ఉన్నారని.. కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయన ట్విట్టర్‌లోనే మాట్లాడుతారంటూ.... ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు... కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి... కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు...

భాజపాలో మాత్రమే కష్టపడ్డ వాళ్లకు పదవులు వస్తాయని చెప్పడానికి కిషన్ రెడ్డే నిదర్శనమని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నిర్ణయాల్లో కిషన్‌రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. భాజపా పోరాటానికి భయపడే... కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లి... బంధవిముక్తి కోసం పార్టీ కార్యకర్తలు పని చేయాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

సూర్యాపేట నుంచి యాదాద్రికి...

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నేడు సూర్యాపేటలో యాత్ర తిరిగి ప్రారంభమై మహబూబాబాద్ జిల్లాలోని... దంతాలపల్లి, తొర్రూరు మీదగా రాయపర్తి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశించి... వర్ధన్నపేట మీదుగా వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకుంటుంది. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలో పూజలు చేసి... జనగామ మీదుగా యాదాద్రి చేరుకుని.. రాత్రి అక్కడే కిషన్‌రెడ్డి బస చేయనున్నారు. రేపు ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ మీదుగా.. నగరంలోకి యాత్ర ప్రవేశించనుంది. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభతో..... యాత్ర ముగియనుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.