ETV Bharat / city

వివేకా హత్య కేసులో వాళ్లు కుమ్మక్కయ్యారు: సీబీఐ

author img

By

Published : Oct 17, 2022, 5:17 PM IST

Updated : Oct 17, 2022, 7:23 PM IST

CBI APPEAL TO SUPREME COURT
CBI APPEAL TO SUPREME COURT

CBI APPEAL TO SUPREME COURT: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి జైలు బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని.. వారిని రక్షించుకోవాలంటే.. బెయిల్‌ రద్దు చేయాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది.

CBI ON GANGIREDDY BAIL: వివేకా హత్య కేసులో కీలక నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ.. సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సీబీఐ.. సుప్రీంకోర్టుకు పలు విషయాలను వెల్లడించింది. వివేకా హత్య కేసులో.. మొదట్లో పోలీసులు నేరగాళ్లతో కుమ్మక్కై.. ఛార్జిషీట్‌ దాఖలు చేయలేదని.. ఆ తర్వాత కేసు దర్యాప్తును తమకు అప్పగించారని పేర్కొంది. సుదీర్ఘ విచారణ తర్వాత ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.

సాక్షుల ప్రాణాలకు ప్రమాదం: ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి.. మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హెకోర్టు సమర్థించి.. తాము దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిందని.. సీబీఐ పేర్కొంది. స్థానిక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. సీబీఐ పలు విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ప్రమాదముందని.. సాక్షులు బయటి ప్రపంచంలోకి రావాలంటే భయపడుతున్నారని పేర్కొంది. కేసులో ప్రధాన సాక్షిని రక్షించుకోవాలంటే.. ఎర్ర గంగిరెడ్డి జైలులోనే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనానికి.. సీబీఐ విజ్ఞప్తి చేసింది.

హైకోర్టు విముఖత : వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి అన్ని విధాలా దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేశారని.. సాక్షులను బెదిరిస్తున్నారనే విషయాలను ఛార్జిషీట్‌లో పొందుపరిచినట్లు.. సీబీఐ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డికి స్థానిక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను తిరస్కరించేందుకు హైకోర్టు విముఖత చూపిందని.. నిందితుడు ఇంకా బయట ఉంటే ప్రమాదమని.. సీబీఐ, సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ ముందుకు సాగడం కష్టతరమవుతుందని వివరించింది. సాక్షులకు రక్షణ ఉండాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. వారు చెప్పాలనుకున్న విషయాలను నిర్భయంగా వెల్లడించాలంటే.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరింది. ఇదే పిటిషన్లలో తాము లేవనెత్తిన అనేక విషయాలను హైకోర్టు పట్టించుకోలేదని.. సాక్షులు నిర్భయంగా ఉండాలంటే బెయిల్‌ రద్దు చేయాల్సిందేనని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

దర్యాప్తులో వెలుగులోకి పలు అంశాలు : రాష్ట్ర పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయని కారణంగా.. ఎర్రగంగిరెడ్డికి బెయిల్‌ మంజూరయిందని.. పేర్కొన్నారు. నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారన్న సీబీఐ వాదనను.. సునీత తరఫు న్యాయవాది సమర్థించారు. ఇద్దరూ కలిసి.. ఛార్జిషీట్‌ దాఖలు చేయకుండా ఆలస్యం చేశారని.. అందుకే ఎర్ర గంగిరెడ్డికి 90 రోజుల తర్వాత బెయిల్ రావడంతో.. బయటకు వచ్చారని పేర్కొన్నారు. కేసు తమ చేతికి రాకముందే.. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరయిందని.. సీబీఐ న్యాయవాదులు.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

దర్యాప్తు సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని.. వాటిని ఛార్జిషీట్‌లో పొందుపరిచినట్లు.. సీబీఐ.. సుప్రీంకోర్టుకు తెలిపింది. ఛార్జిషీట్ దాఖలుకు ముందు ఎర్రగంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్‌ వెంటనే రద్దు చేయాలని దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్న జస్టిస్ M.R.షా, జస్టిస్ సుందరేషన్‌తో కూడిన ధర్మాసనం.. ఎర్రగంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ.. నవంబర్ 14న చేపడతామని.. ఆలోగా సమాధానం ఇవ్వాలని.. ఎర్ర గంగిరెడ్డిని ఆదేశించింది.

ఇవీ చదవండి:

Last Updated :Oct 17, 2022, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.