ETV Bharat / city

Amaravathi Construction: హైకోర్టు తీర్పు తర్వాత.. అమరావతి నిర్మాణాల్లో కదలిక

author img

By

Published : Apr 27, 2022, 9:29 AM IST

Amaravathi construction: రాజధాని నిర్మాణాల్లో కదలిక వచ్చింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా అమరావతిలో అసంపూర్తిగా వదిలేసిన కట్టడాలను పూర్తి చేసేందుకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. అయితే కేవలం మొక్కుబడిగా కాకుండా అన్నిచోట్ల మిగిలిపోయిన పనుల్ని చేపట్టాలని రాజధాని రైతులు కోరుతున్నారు.

Amaravati reconstruction works after High Court judgment
హైకోర్టు తీర్పు తర్వాత రాజధాని అమరావతి నిర్మాణాల్లో కదలిక

హైకోర్టు తీర్పు తర్వాత రాజధాని అమరావతి నిర్మాణాల్లో కదలిక

Amaravathi Construction: హైకోర్టు ధర్మాసనం తీర్పు అమలు చేసే క్రమంలో అమరావతి నిర్మాణ ప్రక్రియను.. సీఆర్డీఏ అధికారులు పునఃప్రారంభించారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అఖిలభారత సర్వీసు అధికారుల గృహ సముదాయాల పనులు చేపట్టారు. ఈ పనులను గతంలో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టింది. ఇప్పటికే 65శాతం మేర పనులు పూర్తయ్యాయి. మొత్తం 18 టవర్లు ఇక్కడ నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.645కోట్లు. ప్రస్తుతం రూ.42కోట్లు నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఆ నిధులతోనే పనులు చేస్తున్నారు. భవనాల నిర్మాణాన్ని గతంలోనే పూర్తిచేయగా.. ఇప్పుడు అంతర్గత పనులు చేయాల్సి ఉంది. సీఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థతో ఈనెల 23న సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది చివరిలోగా పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. 24వ తేది నుంచి డిజైనింగ్ పనులు మొదలుపెట్టారు.

రెండు వందల మందికిపైగా కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ వారంలో మరో 200 మంది వరకు వీరికి జత కానున్నారు. గోడల డిజైనింగ్, రంగులు, విద్యుత్, లిఫ్ట్‌, టైల్స్ పనులు పూర్తికావాల్సి ఉంది. ఈ పనులన్నీ నిర్వహించేందుకు మే నెలలో 12వందల మంది కార్మికులు వస్తారని చెబుతున్నారు. దాదాపు మూడేళ్లుగా పనులు నిలిచిపోవటంతో భవనాల వద్ద పనులకు అనువైన వాతావరణం లేదు. పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. విద్యుత్ సరఫరా ఆపేశారు. ఇప్పుడు పనులు జరగాలంటే కరెంటు తప్పనిసరి. నిర్మాణాలు జరిపే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యల్ని త్వరగా పరిష్కరించి అన్నిచోట్లా పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాజధాని రైతులు కోరుతున్నారు.

ఉద్యోగుల క్వార్టర్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. న్యాయమూర్తులు, మంత్రుల నివాస సముదాయాల పనులు వివిద దశల్లో ఉన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు మాత్రమే 90శాతం మేర పూర్తయింది. దీనికి మధ్యలో రెండుచోట్ల ఆటంకాలున్నాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది. డ్రైనేజీ కోసం తెప్పించిన పెద్దపెద్ద పైపులు రోడ్ల పక్కన ఉండిపోయాయి. వేర్వేరు నిర్మాణ సంస్థలు ఈ పనుల్ని నిర్వహిస్తున్నాయి. ఈ పనులు ప్రారంభించలేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. వాటి చెల్లింపుల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఆయా సంస్థలు పనులు చేపట్టలేదని సమాచారం.

రాజధాని ప్రాంతంలో చాలాచోట్ల నిర్మాణ సామగ్రి చోరీకి గురైంది. దానికి సంబంధించి నిర్మాణ సంస్థలు ఫిర్యాదు చేశాయి. అలాగే రహదారుల నిర్మాణానికి తెచ్చిన కంకర, ఇసుక దొంగలు ఎత్తుకెళ్లారు. మళ్లీ అవన్నీ సేకరించాల్సి ఉంది.


ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.