ETV Bharat / city

టిడ్కో గృహాలపై గూడుకట్టిన నిర్లక్ష్యం.. సర్కార్​పై లబ్ధిదారుల విమర్శలు

author img

By

Published : Apr 27, 2022, 4:54 AM IST

సకల సౌకర్యాలతో కూడిన టిడ్కో లోగిళ్లను అందించడంలో పిల్లిమొగ్గలు ఎందుకు? అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా అదిగో.. ఇదిగో అంటూ కప్పదాట్లు వేయడం తప్ప ఇళ్లను మాత్రం అందజేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో పేదల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వానికి.. టిడ్కో గృహాలు కనిపించలేదా? వాటి కోసం కనీసం రూ. 1500 కోట్లు ఖర్చు చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

ycp neglected on tidco house
టిడ్కో గృహాలపై గూడుకట్టిన నిర్లక్ష్యం

మూడేళ్లలో రూ. 1.40 లక్షల కోట్లు పేదల సంక్షేమానికి ఖర్చు చేశాం..’ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సలహాదారుల వరకు పదేపదే చెబుతున్న మాట ఇది. మరి ఇంత పెద్ద మొత్తం పేదల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వానికి టిడ్కో గృహాలు కనిపించలేదా? వాటి కోసం కనీసం రూ. 1500 కోట్లు ఖర్చు చేయలేదా? ఆ మాత్రం వెచ్చిస్తే ఇప్పటికే పూర్తయిన 1.50 లక్షల ఇళ్లను మూడు నెలల్లోనే పేదలకు ఇచ్చేయొచ్చు.

అలాంటిది మూడేళ్లుగా ఎడతెగని జాప్యం ఎందుకు? పేదలకు గూడు కల్పన సంక్షేమం కోవలోకి రాదా? వేల కోట్లు ఖర్చు చేసి గత ప్రభుత్వ హయాంలోనే 90 శాతానికి పైగా పూర్తయిన వేల గృహాలను పాడుబెట్టడం ఎందుకు? వాటిని పేదలకు అప్పగిస్తే.. ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఏడాదికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లించలేక అవస్థలు పడుతున్నవారికి ఆ మొత్తం మిగులుతుంది కదా? ఇరుకు గదుల్లో మగ్గుతున్న పేదలకు రూ. 6 నుంచి రూ. 8 లక్షలు వెచ్చించి కట్టిన ఇళ్లను ఇస్తే.. స్థలం విలువతో కలిపి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆస్తిని అందించినట్లు కాదా? సకల సౌకర్యాలతో కూడిన టిడ్కో లోగిళ్లను అందించడంలో పిల్లిమొగ్గలు ఎందుకు? అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా అదిగో.. ఇదిగో అంటూ కప్పదాట్లు వేయడం తప్ప ఇళ్లను మాత్రం అందజేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి.

నాలుగు వాయిదాల్లోనే ఎలా కడతారు? : మొత్తం 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 10,000 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులోలబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలుగా రూ. 4,000 కోట్లు టిడ్కోకు అందాలి. మిగతా రూ. 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని టిడ్కోకు స్పష్టం చేసింది. అంటే రుణంతోనే టిడ్కో గృహాల్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వ యోచన అని తెలుస్తోంది. కానీ ఏడాదిగా అధికారులు ప్రయత్నిస్తున్నా ఒక్క ఆర్థిక సంస్థ కూడా రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. లబ్ధిదారుల పేరు మీద రుణం ఇచ్చేందుకూ చాలా బ్యాంకులు కొర్రీలు వేస్తున్నాయి. ఏడాదిగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు రూ.800 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. బ్యాంకులు మొరాయిస్తుండటంతో ‘స్వచ్ఛందం’ పేరుతో రుణమొత్తాన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారులు చెల్లించేలా అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.

.

లబ్ధిదారుల పేరిట వచ్చే రుణమే దిక్కు..: గుత్తేదారులకు రూ. 700 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. అవి చెల్లిస్తే తప్ప నిర్మాణాలు చేపట్టలేమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 1000 కోట్లు కేటాయించింది. దాన్ని బకాయిల చెల్లింపులకు వినియోగించాలా? ఇళ్ల నిర్మాణానికా? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. చేసేదేమీ లేక లబ్ధిదారుల పేరు మీద వచ్చే రుణంతోనే చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు. ఏడాదిగా ఇదే పరిస్థితి. గృహ సముదాయాల్లో సామగ్రి దొంగల పాలవుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారు.

మూడేళ్లలో ఇచ్చినవి 3,488 ఇళ్లే : టిడ్కో ఇళ్లపై ఉన్న బకాయిలు సహా నిర్మాణాలు పూర్తి చేసేందుకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, ఏటా కొన్ని చొప్పున లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని 2020 డిసెంబరులో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇళ్ల పంపిణీపై ప్రకటించిన తేదీలూ గడిచిపోయాయి. చివరికీ ఆ మంత్రే మారిపోయినా ఇళ్లు మాత్రం పేదలకు అందలేదు. రెండున్నరేళ్లలోనూ ఆయన హయాంలో 2,62,216 ఇళ్లకుగాను 3,488 (1.32 %) మాత్రం ఇచ్చారు. అవి కూడా గత ప్రభుత్వ హయాంలో అన్ని వసతులు సమకూరిన గృహ సముదాయాల్లోని ఇళ్లే. ప్రస్తుత ప్రభుత్వం పెద్దగా అక్కడ ఖర్చు చేసిందేమీ లేదు. జూన్‌ నాటికి 1.34 లక్షల ఇళ్లు, డిసెంబరు నెలాఖరు నాటికి మిగతావన్నీ లబ్ధిదారులకు అప్పగించేస్తామని వెల్లడించారు. అంటే 8 నెలల్లోనే 2.62 లక్షలు గృహాలు అందించే అవకాశమున్నా మూడేళ్లుగా ఎందుకు కాలయాపన చేశారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

నాడు పదే పదే ప్రశ్నించి..: ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతిపక్షనేతగా జగన్‌.. టిడ్కో ఇళ్లపై చేసే అప్పును ప్రతి నెల రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు పేదలు ఎలా కడతారని అప్పటి ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించారు. మరి నెల వాయిదా రూ.3 వేలు కట్టేందుకే ఇబ్బందిపడే పేదలు.. ఇళ్లు అప్పగించే నాటికి 4వాయిదాల్లోనే రూ. 3.65 లక్షలు/రూ. 4.65 లక్షలు ఎలా కడతారనేదే ఇప్పుడు ప్రధాన సందేహం. 4వాయిదాల్లో అంత మొత్తం కట్టే శక్తే ఉంటే ఇన్నాళ్లూ ఇరుకు గదుల్లో ఎందుకు మగ్గుతారు? అధికారుల ఒత్తిడితో ఇళ్లు అందవేమోననే భయంతో వడ్డీలకు తెచ్చి కడితే అప్పులపాలు కారా? పేదలను అప్పుల్లో కూరుకుపోయేలా చేయడమేనా సంక్షేమమంటే? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: Arrest: తిరుపతి 'రుయా ఘటన'లో ఆరుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.