ETV Bharat / city

భారత్​ బంద్​లో అమరావతి రైతులు..రాజధాని గ్రామాల్లో నిరసనలు

author img

By

Published : Dec 8, 2020, 5:02 PM IST

Amaravati farmers
Amaravati farmers

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్​కు అమరావతి రైతులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలంటూ... రాజధాని గ్రామాల్లో నిరసనలు చేపట్టారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ఇద్దరూ రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తున్నారని విమర్శించారు. రైతులకు నష్టం చేసే చర్యలు వద్దని హితవు పలికారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు రాజధాని ప్రాంతంలో నిర్వహించిన బంద్​లో పాల్గొన్నాయి.

భారత్​ బంద్​లో అమరావతి రైతులు.. రాజధాని గ్రామాల్లో నిరసనలు

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్​తో ఉద్యమం చేస్తున్న రైతులు... ఇవాళ్టి భారత్ బంద్​లోనూ పాల్గొన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు అమరావతి రైతు ఐకాస సంఘీభావం ప్రకటించింది. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. వెలగపూడిలో మానవహారంగా ఏర్పడ్డారు. జై అమరావతితో పాటు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు నష్టం చేసేలా ఎవరు వ్యవహరించినా అంగీకరించబోమని స్పష్టం చేశారు.

కేంద్రం పట్టించుకోవడం లేదు

ప్రజలకు మేలు చేసేలా పరిపాలన ఉండాలే తప్ప... వారిని ఇబ్బంది పెట్టేలా ఉండరాదని రైతులు అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే... వ్యవసాయ చట్టాలు తప్పకుండా వారికి నష్టం చేకూర్చేవేనని వ్యాఖ్యానించారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని... ఇప్పుడు జగన్ రాజధానిని ఇక్కడినుంచి తరలిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం కనీసం చర్చలు జరుపుతోందని... అమరావతిలో మాత్రం 357 రోజులుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​, వామపక్షాలు నిరసనలు

వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో ఆందోళనలు నిర్వహించారు. రైతులకు తీవ్రంగా నష్టం చేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్కాపురం కూడలిలో ధర్నా చేపట్టాయి. సచివాలయానికి వెళ్లే మార్గం కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే వాహనాలు వెళ్లేందుకు దారి వదలటంతో పోలీసులు వారి ఆందోళనకు అనుమతించారు. రహదారిపైనే భోజనాలు చేశారు. రైతుల మెడకు ఉరితాడు బిగించే నల్లచట్టాలను రద్దు చేయాలని తాడికొండ కాంగ్రెస్ ఇన్​ఛార్జి చిలకా రాజేష్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లులకు మద్దతిచ్చిన వైకాపా... ఏపీలో మాత్రం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పటాన్ని ద్వంద్వవైఖరిగా అభివర్ణించారు.

అమరావతిలో జరిగే ఆందోళనలపై నిత్యం ఆంక్షలు విధించే పోలీసులు... ఇవాళ రైతులు రోడ్లపైకి వచ్చినా మౌనంగా ఉండటం విశేషం.

ఇదీ చదవండి : 'వైకాపా...దిల్లీలో ఓ డ్రామా.. గల్లీలో మరో డ్రామా ఆడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.