ETV Bharat / city

రెట్టించిన ఉత్సాహంతో.. అమరావతి రైతుల మలివిడత పాదయాత్ర

author img

By

Published : Sep 11, 2022, 7:29 PM IST

Updated : Sep 12, 2022, 6:39 AM IST

Capital Farmers Padayatra: రాజధాని అమరావతికి మరణశాసనం లిఖించేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమన నీతిపై... రైతులు ఉద్యమ బావుటా ఎగరేసి నేటికి సరిగ్గా వెయ్యి రోజులు. 2019 డిసెంబర్ 17న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా... ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ అణచివేతల్ని, నిర్బంధాల్ని, అవమానాల్ని, అక్రమ కేసుల్ని తట్టుకుని... విరామం లేకుండా రాజధాని రైతులు ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. తెలుగుజాతి తోడుగా వెనక్కి తగ్గేదేలేదంటూ... అమరావతి నుంచి అరసవల్లికి నేడు రెండో విడత మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

padayatra1
అమరావతి రైతుల మలివిడత పాదయాత్ర

Amaravati Farmers Padayatra: అమరావతిపై అధికార పెద్దల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, రాజధాని ఆవశ్యకతను చాటేందుకు... రైతులు రెండో విడత మహాపాదయాత్ర చేపట్టారు. రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలందరికీ ఫలాలు అందుతాయనే విషయాన్ని... ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అమరావతి అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధిస్తుందని వివరించనున్నారు. దాదాపు ఏడాది కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు చేసిన మొదటివిడత పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే... అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కానీ మొండి వైఖరి వీడని వైకాపా ప్రభుత్వం... ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతోంది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా, అఫిడవిట్‌లతో కాలయాపన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘బిల్డ్‌ అమరావతి- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంతో అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో మహాపాదయాత్ర చేస్తున్నారు. నేడు అమరావతిలో మొదలై వెయ్యి కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర... నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యభగవానుడి చెంతకు చేరనుంది. మొత్తం 12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా వెళ్లే యాత్రలో... మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను రైతులు దర్శించుకోనున్నారు. ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా... పల్లెలు, పట్టణాల మీదుగా నడిచేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. 60 రోజుల పాటు జరిగే పాదయాత్రలో 9 సెలవు దినాలు ఉంటాయి.

పాదయాత్ర దిగ్విజయంగా సాగాలంటూ... వేకువజామున 5 గంటలకు వెంకటపాలెంలోని తి.తి.దే ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అమరావతి ఐకాస నేతలు, రైతులు పూజలు చేశారు. ఆ తర్వాత 6 గంటల 3 నిమిషాలకు ఆలయం వెలుపల ఉన్న శ్రీవారి రథాన్ని ముందుకు లాగి... పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం వెంకటపాలెం గ్రామంలోకి రథాన్ని తీసుకెళ్లారు. 9 గంటలకు జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదుగా సాయంత్రానికి మంగళగిరికి యాత్ర చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. మొదటిరోజు దాదాపు 15 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాలవారు విడతలవారీగా ఈ యాత్రలో మమేకం కానున్నారు.

పాదయాత్రలో పాల్గొని ఉద్యమానికి మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాస నేతలు... వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలసి ఆహ్వానించారు. అన్ని పార్టీల నేతలు పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలుగుదేశం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రానున్నారు. భాజపా తరఫున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, పార్టీ నాయకులు సత్యకుమార్‌, వల్లూరి జయప్రకాశ్‌, కాంగ్రెస్‌ తరఫున కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, శైలజానాథ్‌, తులసిరెడ్డి హాజరవుతారు. జనసేన నుంచి పోతిన మహేష్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, సీపీఎం నుంచి శ్రీనివాసరావు, చిగురుపాటి బాబూరావు, సీపీఐ నుంచి నారాయణ, రామకృష్ణ పాలుపంచుకోనున్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోకి పాదయాత్ర చేరుకునే సమయంలో రైతులకు స్వాగతం పలకనున్న లోకేశ్‌... వారితో కలిసి నడవనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌... ఏదో ఒక జిల్లాలో పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం.

ఈసారి పాదయాత్రలో గతానికంటే రెట్టింపు సంఖ్యలో పాల్గొంటున్నందున... భోజనం, రాత్రి బస కోసం పక్కాగా ఏర్పాట్లుచేస్తున్నారు. మార్గం మధ్యలో ఎక్కడెక్కడ విడిది చేయాలనేది ఇప్పటికే ఐకాస నేతలు ఖరారు చేశారు. ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ స్థలాన్నీ ఎంపిక చేశారు. దాదాపు 600 మందికి అన్నిచోట్లా అల్పాహారం, భోజనాల కోసం ప్రణాళిక రూపొందించారు. భోజన వసతి సమకూరుస్తామని పలు ప్రాంతాల్లో చాలామంది ముందుకు వస్తున్నారు. వీరితో అమరావతి పరిరక్షణ సమితి సమన్వయం చేసుకుంటోంది. పాదయాత్ర సాగే మార్గం ఆసాంతం నిర్దేశిత వాహన శ్రేణి ఉంటుంది. మొదటి వరుసలో శ్రీవారి రథం, తర్వాత సెక్యూరిటీ వాహనం, పాదయాత్రలో సామగ్రి భద్రపర్చుకునే వాహనం, మీడియా వాహనం, బయో టాయిలెట్స్‌, డీజిల్‌ వాహనం, నడకలో అస్వస్థతకు గురయ్యే వారికి చికిత్స కోసం ఓ అంబులెన్స్‌ ఉంటాయి. యాత్రలో పాలుపంచుకునే వారి సామగ్రిని తీసుకెళ్లడానికి రెండు లగేజి వాహనాలను ఉంచారు. మహాపాదయాత్ర 2.0లో ఎల్​ఈడీ వాహనానికి అనుమతించారు. ఇందులోని తెరలపై అమరావతి ఉద్యమ దృశ్యాలను ప్రదర్శించనున్నారు.

వెయ్యి కిలోమీటర్ల దూరం సాగే పాదయాత్రలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రణాళిక ప్రకారం సాగేలా... 50 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటుచేశారు. పాదయాత్రలో పాల్గొనేందుకు అన్ని జిల్లాలకు చెందిన ప్రముఖులను కలసి ఆహ్వానించడం ఆహ్వాన కమిటీ బాధ్యత. పాదయాత్రల్లో పాల్గొన్న వారికి సమయానికి అల్పాహారం, భోజనాలు అందేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. యాత్రలో పాల్గొనేవారికి అర కిలోమీటరుకు ఒకసారి తాగునీరు అందించేందుకు వాటర్‌ కమిటీని ఏర్పాటుచేశారు. ఆయా జిల్లాల్లో యాత్ర సాగే మార్గాల్లో ఐకాసకు విరాళాలను సేకరించడం, లెక్కల కోసం ఆర్థిక కమిటీ పని చేస్తుంది.

రెండో విడత పాదయాత్రకు సిద్ధంచేసిన శ్రీవారి రథం ఆకృతిని గతానికంటే మార్చారు. ఈసారి యాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యభగవానుడి ఆలయం వరకు సాగుతుండడంతో... సూర్యుడి రథం ఆకృతిని తీసుకుని ప్రత్యేకంగా తయారు చేయించారు. రథాన్ని ఏడుగుర్రాలు లాగుతున్నట్లు తీర్చిదిద్దారు. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి విగ్రహాలను ఉంచారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 12, 2022, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.