ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​ : బొప్పాయి బోరుమనిపిస్తుంది

author img

By

Published : Jul 1, 2020, 7:30 PM IST

Updated : Jul 1, 2020, 8:27 PM IST

కరోనా ఎఫెక్ట్​ : బొప్పాయి బోరు మనిపిస్తుంది
కరోనా ఎఫెక్ట్​ : బొప్పాయి బోరు మనిపిస్తుంది

లాభసాటిగా ఉంటుందని బొప్పాయి సాగు చేశాడు ఓ రైతు. అంతా బాగుంది.. కాపు విరగకాసింది, పండు మంచి రంగులో ఉంది. ఈసారైనా అప్పులు తీరుతాయని ఆశపడ్డాడు. అంతలోనే ఆశ అడియాశైంది. కరోనా ప్రభావంతో ధరలు అమాంతం పడిపోయాయి. ధరలు లేక ఎగుమతి ఆగిపోయింది. కళ్ల ముందే పంట కుళ్లిపోతుంటే...ఏం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ రైతు. ఇది అమరావతి ప్రాంతంలో బొప్పాయి రైతుల పరిస్థితి.

కరోనా ఎఫెక్ట్​ : బొప్పాయి బోరుమనిపిస్తుంది

బొప్పాయి రైతులను ధరఘాతం వెన్నాడుతుంది. ఆశాజనకంగా పండిన పంటకు ధర లభించక రైతులు ఆవేదన చెందుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఇబ్బందులు కొన్నాళ్లు.. ఆ తర్వాత మార్కెట్‌కు సరకు తరలింపులో అవరోధాలు తొలగినా ధర రాక... వ్యాపారులు అడిగిన మొత్తానికి విక్రయించలేక సాగుదారులు సతమతమవుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెంలో ఒక రైతు సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేశారు. ఇందులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో తైవాన్‌ గోల్డ్‌ రకం బొప్పాయిని పండించారు. మార్కెట్‌లో ఈ రకానికి మంచి ఆదరణ ఉండడం... ఎగుమతులకు అనువైనది కావడంతో తొలిసారిగా ఈ పంట సాగు చేశారు.

ఎకరాకు లక్షన్నర పెట్టుబడి

ఇప్పటివరకూ ఇతర వాణిజ్య పంటలు పండించే రైతు సాల్మన్‌రాజు తొలిసారి బొప్పాయి సాగుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఎకరానికి లక్షన్నర రూపాయల పెట్టుబడితో బొప్పాయి సాగుచేశారు. నర్సరీ నుంచి 18 రూపాయలకు ఒక్కో బొప్పాయి మొక్కను కొనుగోలు చేసి వేశారు. కాపు బాగా ఉండడం... వాతావరణం అనుకూలిస్తుండడంతో మంచి ధరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని భావించారు.

స్థానికంగా విజయవాడ, గుంటూరు మార్కెట్‌లకు సరకును తరలించడంతోపాటు, ఇతర రాష్ట్రాలకు పంపేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. పంట దిగుబడి ప్రారంభమైన తరుణంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది. లాక్‌డౌన్‌తో ఎగుమతి ఆగిపోయింది. స్థానిక మార్కెట్‌లు సైతం అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తుండడంతో ఇంటింటికి తిరిగి పండ్లు విక్రయించారు. బొప్పాయితోపాటు నాందేడ్‌ రకం అరటి కూడా సాగు చేశారు ఈ రైతు. ఈ పంట కోసం ఎకరానికి ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం లక్ష 18 వేల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చిందని వాపోతున్నారు.

కొనేవారు లేక కుళ్లిపోతున్న బొప్పాయి

రంజాన్‌ మాసంలో పండ్లకు గిరాకీ ఉంటుందనే భావనతో వేసిన బొప్పాయి, పచ్చ అరటికి కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాకపోవడంతో రైతు నిరాశ చెందుతున్నారు. అరటి తోటను పూర్తిగా తొలగించారు. కేజీ 10, 15, 20 రూపాయలకు మించి బొప్పాయికి ధర రాకపోవడంతో వచ్చిన కొనుగోలుదారులను వెనక్కి పంపించలేక ఎంతో కొంత మొత్తాన్ని విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ఎవరూ కొనక సుమారు 10 నుంచి 15 టన్నుల బొప్పాయిని పొలంలోనే వదిలేశారు. పండిన పళ్లు నేలరాలి కుళ్లిపోతున్నాయి.

కరోనా బొప్పాయి రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. కాపు కాసినా కొనేవాళ్లు లేక రైతులు కష్టాలు పడుతున్నారు.

ఇదీ చదవండి : విక్రమ్​ హత్యలో సీఐ భాగస్వామి- డీజీపీకి తెదేపా నేతల ఫిర్యాదు

Last Updated :Jul 1, 2020, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.