WPI Index 2022: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో నాలుగు నెలల గరిష్ఠానికి చేరి 14.55గా నమోదైంది. ముడి చమురు, వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. వరుసగా 12వ నెలలోనూ టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండు అంకెలు దాటింది. ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 13.11 శాతంకాగా.. గత ఏడాది మార్చిలో ఇది 7.89 శాతం మాత్రమే. సోమవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఆహార వస్తువుల ధరలు 8.19 శాతం నుంచి 8.06 శాతానికి, కూరగాయాల ధరలు 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చాయి. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు, సహజ వాయువు, మినరల్ ఆయిల్స్, లోహాల ధరల పెరిగి ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. ఫిబ్రవరిలో పెట్రోల్ ధరల పెరుగుదల 55.17 శాతం కాగా.. మార్చిలో అది 83.56 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మార్చిలో 6.95 శాతంగా నమోదైంది. ఆర్బీఐ విధించిన వినియోగధరల సూచీ పరిమితిని దాటి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి.
ఇదీ చూడండి : కుప్పకూలిన దేశీయ సూచీలు.. రూ.3.39లక్షల కోట్ల సంపద ఆవిరి