SrinivasGoud Counter On Botsa Comments : తెలంగాణ విద్యా విధానం, టీఎస్‌పీఎస్సీపై.. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే బొత్స వ్యాఖ్యల పట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శలు గుప్పించారు. బొత్స సత్యనారాయణ పరీక్షలో చూసి రాసి పాస్ అయ్యారని... అందుకే అలా అనుకుంటున్నారని ఆరోపించారు. తాను తెలంగాణలోనే చదువుకుంటానని.. ఏపీకి చెందిన విద్యార్థి కోర్టుకు కూడా వెళ్లారని శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక బొత్స మాట్లాడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. ఏపీ రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే.. సమాధానం చెప్పే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మీ హయాంలో ఏపీపీఎస్సీలో స్కాములు జరిగేవని .. ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎలా అని బొత్సను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బదిలీల కోసం మీ హయాంలో సూట్‌కేసులు పట్టుకొని లాడ్జ్‌ల్లో ఉండేవారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
SrinivasGoud On Botsa : మీ హయాంలో కోళ్ల ఫారాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ఉంటే... నాణ్యత లేదని తాము వాటిని రద్దు చేశామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ క్రమంలోనే తమ దగ్గర వోక్స్ వ్యాగన్ స్కాములు లేవని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరావతికి వెళ్లి మరీ చెప్పి వచ్చారని గుర్తుచేశారు. మరోవైపు బొత్స పిల్లలు కూడా ఇక్కడే చదివి ఉంటారని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
బాధ, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడారా? లేక రాజకీయంగా ఉపయోగపడుతుందని మాట్లాడారా? అని బొత్స సత్యనారాయణను శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మరోవైపు కరెంట్ లేకపోతే ఇన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయా? అని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని.. మీ విశ్వవిద్యాలయాల తరహాలో కాదని తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న చర్యలను హర్షించాలని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
SrinivasGoud On Botsa Satyanarayana Comments : మీ హయాంలో లాగా దందాలు ఇక్కడ లేవని.. బొత్సను ఉద్దేశించి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. గతంలో తెలంగాణ వారిని అన్యాయం చేశారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఎక్కడి విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నవాళ్లను అడగండి ఎలా ఉందో చెబుతారని వివరించారు. తమ రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించబోమని.. తమ ఆత్మగౌరవం తమకు ముఖ్యమని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఈ క్రమంలోనే అవమానాలు, సూటి పోటీ మాటలు మాట్లాడినందుకే పోరాడి సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నామని శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. బొత్స సత్యనారాయణతో ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఇందులో భాగంగానే ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరిస్తామని.. అక్కడి ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణ తరహాలో ఏపీని అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
"మీ హయాంలో కోళ్ల ఫారాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ఉంటే... నాణ్యత లేదని తాము వాటిని రద్దు చేశాం. మా దగ్గర వోక్స్ వ్యాగన్ స్కాములు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉంది. రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరావతికి వెళ్లి మరీ చెప్పి వచ్చారు." - శ్రీనివాస్‌గౌడ్, మంత్రి
ఇవీ చదవండి: Minister Botsa Comments on Telangana: "తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు"
Gangula Counter Attack : 'బొత్స కామెంట్స్ వెనుక జగన్ లేకపోతే.. వెంటనే బర్తరఫ్ చేయాలి'