ETV Bharat / bharat

'కేంద్రం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం'.. రైల్వే మంత్రి రాజీనామాకు విపక్షాల డిమాండ్

author img

By

Published : Jun 3, 2023, 5:12 PM IST

tejaswi yadav slams modi govt
RJD DEMANDS railway minister's resign

ఒడిశా రైలు ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ రాజీనామా చేయాలని ఆర్​జేడీ డిమాండ్​ చేసింది.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దుర్ఘటనకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విరుచుకుపడ్డాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.

KAVACHలోనూ కుంభకోణం జరిగింది: ఆర్​జేడీ
ఆటోమేటిక్​ ట్రైన్​ ప్రొటెక్షన్​ సిస్టమ్​ 'కవచ్​'లో కూడా కుంభకోణం దాగి ఉందని ఆర్​జేడీ ట్విట్టర్​ వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

"మోదీ ప్రభుత్వం కేవలం వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లలోనే ప్రజలు ప్రయాణించాలని ఆశిస్తోంది. ఇది సిగ్గు చేటు. రైల్వే మంత్రికి కాస్త నైతికత, ఆత్మ గౌరవం ఉంటే ఇన్ని కుటుంబాలను నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి."
- ఆర్​జేడీ

బిహార్​ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్​ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాదం తనను మానసికంగా తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'కవచ్' వ్యవస్థ విఫలం కావడం కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆయన ఆరోపించారు.

చాలా ప్రశ్నలు ఉన్నాయ్​!
కాంగ్రెస్​ పార్టీ ఒడిశా రైలు దుర్ఘటనపై ​విభిన్నంగా స్పందించింది. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీని, రైల్వే మంత్రిని నిలదీయడానికి మా వద్ద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. కానీ ప్రస్తుతం బాధితులను రక్షించడానికి, వారికి సహాయం అందించడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపింది. కాంగ్రెస్​ పార్టీ నాయకులు కూడా బాధితులకు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ డిమాండ్​ చేశారు. భవిష్యత్​లో ఇలాంటి దుర్ఘటనలు మరలా సంభవించకుండా ఒడిశా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సిగ్నలింగ్​ వ్యవస్థ వైఫల్యమే కారణం:
ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్​ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధరించింది. లూప్​లైన్​లో ఆగి ఉన్న గూడ్స్​ రైలును మెయిన్​ లైన్​పై వెళ్లాల్సిన కోరమాండల్​ పొరపాటున ఢీకొట్టిందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఒడిశా రైలు ప్రమాదంలో సుమారు 278 మంది మరణించగా, దాదాపుగా 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

మోదీ పర్యటన :
ఘటన తీవ్రత దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఒడిశాలో పర్యటించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారిని అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.