ETV Bharat / state

గ్రీన్​ ఛానెల్​లో నిధులిస్తున్నా జాప్యం ఎందుకు? : వరంగల్ ఆస్పత్రి నిర్మాణ పనులపై సీఎం ఆగ్రహం

గ్రీన్ ఛానల్‌లో నిధులు ఇస్తున్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగంగా ఎందుకు జరగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Warangal Super Speciality Hospital
వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 22, 2026 at 7:19 AM IST

2 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy on Warangal Super Specialty Hospital : గ్రీన్ ఛానల్​లో నిధులు మంజూరు చేస్తున్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో జాప్యం జరగడంపై సీఎం రేవంత్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, సంబంధిత జిల్లా కలెక్టర్‌ రోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వరంగల్‌ నగర అభివృద్దిపైనా సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌ రెడ్డి, భారీ వ్యయంతో నిర్మిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను అత్యంత జాగ్రత్తగా నిర్మించాలని సూచించారు.

ఎందుకు వేగం లేదు?

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే 30 రోజులు 24 గంటల పాటు పని జరగాలని, వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలోని బోధి పెవిలియన్‌లో వైద్యారోగ్య, పురపాలక శాఖల అధికారులతో ఆసుపత్రి నిర్మాణ పనులపై సమీక్ష చేశారు. ఆసుపత్రి భవనం పనుల్లో జాప్యానికి గల కారణాలను ఆరా తీశారు. గ్రీన్‌ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తున్నా ఎందుకు వేగం లేదంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

కలెక్టర్‌ రోజూ ఆసుపత్రి పనులను పర్యవేక్షించాలి

సీఎంవో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షలు చేయాలని సూచించారు. అధికారులు ఒక వర్క్‌ షెడ్యూల్‌ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని సీఎం ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇకపై వరంగల్​ కలెక్టర్‌ రోజూ ఆసుపత్రి పనులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ తరహాలో ఓపీ సేవలను వరంగల్‌లోనూ వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. టిమ్స్​ మాదిరి వరంగల్‌లో కూడా సిబ్బందికి నివాస గృహాలు నిర్మించాలని అన్నారు. తక్షణమే స్టాఫ్‌ క్వార్టర్స్‌ పనులు ప్రారంభం కావాలని, ఆసుపత్రి నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

భారీ నిధులతో డ్రైనేజీ పనులు

వరంగల్‌ నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులపైనా సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్​ అధికారులను ఆరా తీశారు. వరంగల్‌ కాస్మోపాలిటన్‌ సిటీగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నగర సమగ్రాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. భారీ నిధులతో డ్రైనేజీ పనులు చేపడుతున్నందున పకడ్బందీగా పూర్తి చేయాలని, వరంగల్‌ బాహ్య వలయ రహదారిపై కూడా దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లను కలుపుతూ రహదారుల కనెక్టివిటీ చేయాలన్నారు.

భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది

వరంగల్‌ ఎయిర్​పోర్టు ప్రారంభమయ్యే నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ను వేగంగా అభివృద్ధి చేయాలన్నారు. ఆలయాలు, అటవీ సంబంధిత పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు వివరించారు. విమానాశ్రయం ప్రారంభమైతే భద్రకాళి దేవాలయం, రామప్ప ఆలయాలకు భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. అన్ని సౌకర్యాలతో భారీ బస్‌ టెర్మినల్‌ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించాలన్న రేవంత్‌ రెడ్డి - రెండు పేర్లను సూచించిన సందీప్​రెడ్డి వంగా

హైదరాబాద్​లో హార్వర్డ్​ కోర్సులు డిసెంబర్​ నుంచి ప్రారంభం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన