రేపటి నుంచే రంజాన్ ప్రారంభం - ఈ మాసంలో టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే!
- రంజాన్ నెలలో తప్పక రుచి చూడాల్సిన ఆహార పదార్థాలు - ఓ పట్టు పట్టండి!

Published : February 18, 2026 at 4:43 PM IST
Famous Foods to Taste in Ramadan 2026: ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో రంజాన్ అత్యంత ప్రధానమైనది. నెల రోజుల పాటు నిష్టతో ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు ఉంటారు. ఈ సంవత్సరం రంజాన్‌కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో రంజాన్ ఉపవాసాలు మొదలుకాగా.. తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక రంజాన్ నెల అంటే ఘుమఘుమలాడే వంటలకు కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా హలీమ్ అయితే ప్రత్యేకం. కాగా కేవలం హలీమ్ మాత్రమే కాకుండా ఈ మాసంలో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ మరికొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హలీమ్ : పవిత్ర రంజాన్ మాసంలో పరిచయం అక్కర్లేని రెసిపీ హలీమ్. ఈ సమయంలో భాగ్యనగరంలో ఏ గల్లీలో చూసినా హలీమ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తాయి. ముస్లిం సోదరులు మాత్రమే కాకుండా నార్మల్‌గా కూడా చాలా మంది దీనిని టేస్ట్ చేస్తుంటారు. మాంసం, గోధుమలు, పప్పు దినుసులు, మసాలాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ను గంటల పాటు కట్టెల పొయ్యి మీద ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి అందిస్తారు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది.
పత్తర్ కా గోష్ : రంజాన్ సమయంలో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్‌లో ఇదీ ఒకటి. నిప్పు మీద వేడి చేసిన రాతి బండపై మటన్ ముక్కలను కాలుస్తారు. మాంసం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికిస్తారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసి సర్వ్ చేస్తుంటారు. ఈ నెలలో చాలా హోటల్స్‌లో ఈ ప్రత్యేకమైన వంటకం అందుబాటులో ఉంటుంది.
నిహారి - కుల్చా : రంజాన్ మాసంలో హలీమ్‌తో పాటు తప్పక తినాల్సిన ఫుడ్ ఐటమ్ నిహారి. మరీ ముఖ్యంగా హైదరాబాదీలు ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటుంటారు. బీఫ్ లేదా మటన్ లేదా చికెన్‌ను ఎక్కువ సేపు ఉడికించి ప్రిపేర్ చేస్తారు. సాధారణంగా దీనిని కుల్చా లేదా రోటీతో కలిపి తింటారు. దీని టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇరానీ హోటళ్లలో లభిస్తుంది.
షీర్ ఖుర్మా : రంజాన్ నెలలో హలీమ్‌తో పాటు ఎక్కువగా వినిపించే పేరు షీర్ ఖుర్మా. సన్న సేమియా, పాలు, డ్రైఫ్రూట్స్, పంచదారతో ప్రిపేర్ చేసే ఈ వంటకం రంజాన్‌లో చాలా ప్రసిద్ధి కూడా. పండగ నాడు దీనిని కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. స్వీట్ అంటే ఇష్టపడే వారిని షీర్ ఖుర్మా చాలా బాగా ఆకట్టుకుంటుంది.
దహీ వడ : రంజాన్ మాసంలో ఎక్కువ మంది ఈ రెసిపీని తింటుంటారు. రంజాన్ స్పెషల్ వంటకంగా దీనికి పేరు. పెరుగులో వడను నానబెట్టి ప్రిపేర్ చేస్తారు. ఆపై తరిగిన కొత్తిమీర, దానిమ్మ, ఆమ్చూర్(నేల మామిడి) పౌడర్‌తో గార్నిష్ చేసి వడ్డిస్తారు. ఈ ఐటెమ్ కూడా చాలా హోటల్స్,రెస్టారెంట్లలో లభిస్తుంది.
షాహి తుక్డా : రంజాన్ నెలలో రుచి చూడాల్సిన మరో ఫుడ్ ఐటమ్ షాహి తుక్డా. ఈ ఫుడ్ ఇఫ్తార్ విందుకు బెస్ట్ ఆప్షన్ కూడా. పాలు, చక్కెర, యాలకుల పొడి, బాదం, పిస్తా అన్ని వేసి మరిగిస్తారు. ఆ మిశ్రమం దగ్గరకు వచ్చాక అందులో నెయ్యిలో వేయించిన బ్రెడ్ ముక్కలు వేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇది లభిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా కబాబ్, మటన్ తహారీ, ఖుబానీ కా మీఠా, పాయా, ఖీమ సమోసా వంటివి కూడా రంజాన్ నెలలో టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్.
రంజాన్ స్పెషల్ "హలీమ్" చరిత్ర తెలుసా? - మొదట ఎవరు తయారు చేశారంటే?
రంజాన్‌లో ఖర్జూరం ఎందుకు తింటారో తెలుసా? వీటి వల్ల కలిగే ప్రయోజనాలివే!

