ఏసీబీ వలలో కొండాపురం ఎస్సై - పెట్రోల్‌ బంకు నుంచి బ్యాంకు ఖాతాకు రూ. లక్షల్లో లావాదేవీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 5:07 PM IST

thumbnail

SI Caught By ACB While Taking Bribe In Nellore District : నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. ఎస్సై ఖాజావలి అట్రాసిటీ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇస్తానని, మరో కేసులో భార్యతో రాజీ చేస్తానని చెప్పి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని గరిమెనపెంట పంచాయతీ ఎర్రబొట్లపల్లిలో నివసిస్తున్న చిన హజరత్‌పై గత ఏడాది జూన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అదే ఏడాది ఆగస్టులో తనను వేధిస్తున్నాడంటూ భార్య ఫిర్యాదు చేయడంతో మరో సారి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అట్రాసిటీ కేసు విషయంలో డీఎస్పీ విచారణ లేకుండా స్టేషన్‌ బెయిల్‌ ఇస్తానని, భార్యతో రాజీ చేస్తానని ఎస్సై ఖాజావలి చిన హజరత్‌కు చెప్పారు. అందుకు తనకు రూ. 30వేలు లంచం ఇవ్వాలని  డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు తన మిత్రుడి సాయంతో అనిశాకు ఫిర్యాదు చేశారు. 

ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారమే చిన హజరత్ బుధవారం ఎస్సైకు రూ. 25వేలు ఇచ్చేందుకు స్టేషన్‌కు వెళ్లారు. ఎస్సై కొండాపురంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేసే మహిళ పేరు చెప్పి ఆమెకు అందజేయాలని తెలిపారు. ఆ మేరకు అక్కడికి వెళ్లిన చిన హజరత్‌ ఆమెకు అందజేశారు. అనంతరం ఆమె ద్వారా ఎస్సైకు ఫోన్‌లో చెప్పించారు. అక్కడే ఉన్న అనిశా అధికారులు ఆమె వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా పెట్రోల్‌ బంకు నుంచి ఎస్సై బ్యాంకు ఖాతాకు రూ. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం రూ. 5 లక్షల వరకు తేలిందని, దీనిపై విచారిస్తున్నామని తెలిపారు. ఎస్సైని అరెస్టు చేసి అనిశా కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.