అనంతపురం జిల్లాలో నక్క దాడి - 8 మందికి గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 12:25 PM IST

thumbnail

Fox Attack Several People Injured: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో వేకువజామున నక్క దాడిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. గ్రామ సమీపంలోని చెరువు వైపు చీకట్లో బహిర్భూమికి వెళ్లిన గ్రామ ప్రజలపై నక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. 

సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో నక్క ఆహారం కోసం జనావాసాల వైపు వచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గత రెండు రోజులుగా బొమ్మక్కపల్లిలో గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బంధువులు, మిత్రులు తరలిరావడంతో మాంసాహార భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. వాసనకు పసిగట్టిన నక్క గ్రామంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. 

అదే విధంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల అటవీ జంతువులకు కావలసిన ఆహారం, నీరు అందకపోవడంతో గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. రెండు రోజుల క్రితం రాయదుర్గం పట్టణంలోకి ఎలుగుబంట్లు చొరబడి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాయి. అడవి శాఖ అధికారులు ఎలుగుబంట్లను అడవిలోకి తరిమేశారు. బొమ్మక్కపల్లి గ్రామంలోకి వచ్చి ప్రజలపై దాడి చేసిన నక్కను స్థానికులు కొట్టి చంపి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.