ETV Bharat / technology

ఓపెన్ AI మరో సంచలనం- మ్యాటర్ ఇస్తే వీడియో రెడీ- ఎలా పనిచేస్తుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 10:11 AM IST

Open AI Sora Videos : చాట్‌జీపీటీ ద్వారా ఇప్పటికే ప్రజలకు చేరువైన ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా టెక్స్ట్‌-టు- వీడియో జనరేటర్‌ 'సోరా'ను ఆవిష్కరించింది. యూజర్‌ ఇచ్చిన ప్రాంప్ట్‌కు అనుగుణంగా ఇది ఒక నిమిషం నిడివిగల వీడియోను జనరేట్‌ చేయగలదు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Open AI Sora Videos
Open AI Sora Videos

Open AI Sora Videos : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ, టెక్స్ట్-టు-వీడియో జనరేషన్ మోడల్ SORAను పరిచయం చేసింది. దీని ద్వారా మీరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోను సృష్టించవచ్చు. ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పటికే చాట్ జీపీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ఈ సోరా ద్వారా మల్టీ మీడియా రంగంలో కూడా సరికొత్త విప్లవం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సోరా ద్వారా 60 సెకన్ల వరకు మనం వీడియోలను సృష్టించవచ్చు. కేవలం టెక్స్ట్ కమాండ్స్ ఉపయోగించి నిమిషం నిడివి గల వీడియోను రూపొందించవచ్చు. సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ కొత్త ఏఐ జనరేటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి Open AI Sora అంటే ఏమిటి ? ఎలా ఉపయోగించాలి? అందరికీ అందుబాటులోకి వచ్చిందా? సేఫేనా? వంటి వివరాలు చూద్దాం పదండి.

Open AI Sora అంటే ఏమిటి?
ఓపెన్​ ఏఐ సంస్థ ఈ సోరా ప్లాట్ ఫామ్​ను సృష్టించింది. ఇది తమ యూజర్లకు టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా హై క్వాలిటీ కలిగిన ఒక నిమిషం వీడియోలను రూపొందిస్తుంది. యూజర్లు ప్రాంప్ట్‌ ద్వారా రాసిన వివరాలకు దగ్గరగా సరిపోలే వీడియోలను జనరేట్ చేస్తుంది. కెమెరా మోషన్లతో సహా వివిధ క్యారెక్టర్లను కూడా ఇది రూపొందిస్తుంది. గూగుల్‌ లూమియర్‌, రన్‌వే ఏఐ, పికా 1.0 వంటివి ఇప్పటికే టెక్ట్స్‌-టు-వీడియో జనరేటర్లను తీసుకొచ్చాయి. అయితే, ఇవేవీ 5 సెకన్లకు మించి వీడియోలను జనరేట్‌ చేయలేవు. వాటితో పోలిస్తే ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన జనరేటర్‌ దాదాపు 10 రెట్లు అధిక నిడివి కలిగిన వీడియోను జనరేట్‌ చేస్తుండడం గమనార్హం.

ఈ వీడియో జనరేషన్ యాప్ ఎలా ఉపయోగించాలి ?
సోరా ద్వారా మీరు ఊహించిన వీడియోకు సంబంధించిన వివరాలను టెక్స్ట్​ రూపంలో రాసి ఇన్‌పుట్ ఇవ్వాలి. మీరు ప్రాంప్ట్ చేసిన కమాండ్లకు అనుగుణంగా వీడియో క్లిప్‌ గా సోరా మారుస్తుంది. అదనంగా మీరు దీన్ని వీడియోగా మార్చడానికి మరింత వివరంగా ప్రాంప్ట్‌ కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రూపొందించిన వీడియోల లెంగ్త్​ను కూడా పెంచగలదు.

అందరికీ అందుబాటులోకి వచ్చిందా?
ఓపెన్​ ఏఈ ఈ సోరాను పబ్లిక్ రిలీజ్ కోసం టైమ్‌లైన్‌ను ప్రకటించలేదు. సెక్యూరిటీ ఫీచర్లను టెస్టింగ్ చేసిన తర్వాత ఈ యాప్​ను అందుబాటులోకి తేవాలని సంస్థ భావిస్తోంది. ఎందుకంటే ఈ ఫీచర్​ను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్లను రూపొందించాలని కూడా కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా కంటెంట్ విషయంలో దుర్వినియోగం కాకుండా రూపొందించాలని ఓపెన్ ఏఐ భావిస్తోంది.

ఎవరు ఉపయోగించగలరు?
ఈ యాప్ పనితీరును అంచనా వేయడానికి రెడ్ టీమర్‌లకు (సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు) సోరాను అందుబాటులోకి తెస్తామని చెబుతోంది ఓపెన్ ఏఐ సంస్థ. రెడ్ టీమర్లతోపాటు, విజువల్ ఆర్టిస్టులు, ఫిల్మ్‌మేకర్లకు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని టెక్నికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని టెక్ పండితులు చెబుతున్నారు. మీ ఊహాశక్తికి తగ్గట్టుగా కమాండ్ ఇచ్చినట్లయితే చాలు, అద్భుతమైన వీడియోలను సోరా సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ఎంటర్​టైన్​మెంట్​ రంగంతో పాటు, ఇంజనీరింగ్ రంగంలో కూడా ఈ టూల్ ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సోరా సేఫ్​ ఏనా?
సోరా ద్వారా డీప్‌ఫేక్‌ వీడియోలను రూపొందించడానికి వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. తప్పుదోవ పట్టించే వీడియోలను రూపొందించడానికి వీల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. అందుకే ప్రస్తుతానికి రెడ్‌టీమర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఓపెన్‌ ఏఐ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి తీసుకొచ్చే ముందు భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని కంపెనీ పేర్కొంది.

కొన్ని వీడియోలు రెడీ!
సోరా జనరేట్‌ చేసిన కొన్ని వీడియోలను ఓపెన్‌ఏఐ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. పలువురు యూజర్లు ఇచ్చిన ప్రాంప్ట్‌, దానికి సోరా రూపొందించిన వీడియోలను కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ షేర్ చేశారు. స్టిల్‌ ఇమేజ్‌ పోస్ట్‌ చేసినా దాన్నుంచి వీడియో రూపొందించగలదని ఓపెన్‌ఏఐ పేర్కొంది. ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని ఆ సంస్థే స్వయంగా అంగీకరించింది. కొన్ని సందర్భాలను ఈ వీడియో జనరేటర్‌ సరిగా అర్థం చేసుకోలేకపోతోందని పేర్కొంది. సోరాకు భాషపై లోతైన అవగాహన ఉందని, పరిమితులు ఉన్నాయని ఓపెన్‌ఏఐ పేర్కొంది.

సోరా లానే కొన్ని టెక్స్ట్ టు వీడియో యాప్​లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. Veed.io, Synthesia, రన్‌వే, Pika, Penaki యాప్​లు ఇప్పటికే ఫేమస్ అయ్యాయి. సాధారణ ప్రజలకు నేరుగా అందుబాటులో రానున్న టెక్స్ట్ టు వీడియా యాప్ మాత్రం సోరా అని చెప్పవచ్చు. మొత్తానికి ఓపెన్ ఏఈ ఇప్పటికే ఉన్న యాప్​లను సోరాతో అధిగమించనున్నట్లు కనిపిస్తోంది.

మరణం ఎప్పుడో చెప్పే ఏఐ టూల్! 78% పర్ఫెక్ట్​ ప్రిడిక్షన్! ఎలా పనిచేస్తుందంటే?

అర్జెంట్​గా డబ్బులు కావాలని ఫ్రెండ్​ కాల్​ చేశాడా?.. అది డీప్​ ఫేక్ స్కామ్ కావచ్చు! జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.