ETV Bharat / state

ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం - ఊరూరా వైఎస్సార్సీపీ నేతల అరాచకం - YCP Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 12:24 PM IST

YCP leaders Irregularities in Prakasam District : రామాయణంలో రావణుడొక్కడే. అయిదేళ్ల అధికార పార్టీ పాలనలో మాత్రం ఊరూరా అసురులు తయారయ్యారు. సహజ వనరులను ఇష్టారీతిన చెరబట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అందిన కాడికి మింగేశారు. శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తూ అరాచక రాజ్యానికి తామే పునాది రాళ్లయ్యారు. అధికారం మాదంటూ అడ్డగోలుగా వ్యవహరించారు.

cm_jagan_system
cm_jagan_system

YCP Leaders Irregularities in Prakasam District : ప్రకాశం జిల్లాలో ఎటు చూసినా అరాచకం, అవినీతి రాజ్యమేలించారు. తప్పును ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారు. మాకు అన్యాయం జరిగిందని పోలీసులు ఆశ్రయిస్తే తిరిగి బాధితుల పైనే అక్రమ కేసులు బనాయించి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పడం పరిపాటిగా మార్చారు. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని విధ్వంసం చేశారు. అధినేత అండగా దోపిడీ పర్వాన్ని నిరాటంకంగా సాగించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దళితులపై సీఎం జగన్​ ఎక్కడి లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఊళ్లలో దాడులు చేస్తున్నారు. భూములను యమదర్జాగా కాజేశారు. కొండలు, గుట్టలు, కాలువగట్లు, జల వనరులు ఇలా వేటినీ విడిచి పెట్టకుండా ఆక్రమించారు.

'ముఖ్య'నేత సోదరుడి కనుసన్నల్లో అక్రమ ఇసుక దందా - అడ్డుకోని ఉన్నతాధికారులు - YSRCP Leaders Illegal Sand Mining

ఏది మాది, అంతా వారిది : ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతంతో పాటు పలు మండలాల్లో ఇసుకాసురులదే పెత్తనం. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులే భూబకాసరుల అవతారమెత్తారు. నకిలీ పత్రాలతో భూ కుంభకోణాల దగ్గర నుంచి ఉంటున్న ఇళ్లు, సాగు చేసుకుంటున్న పొలాలు, భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసుకున్న స్థలాలపై రాబందుల్లా వాలిపోతున్నారు. మావి అనుకున్నవేమీ కాకుండా చేస్తున్నారు. చివరికి ఆన్​లైన్​ కూడా పేర్లు మార్చేస్తున్నారు. ఒంగోలులో పేదలకు చెందిన పలు భూములను ఆక్రమించేందుకు ఓ నాయకుడు చక్రం తిప్పాడు. మార్కాపురం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లోనూ వందలాది ఎకరాల భూములను అధికార అసుర గణం కబంధ హస్తాల్లో బందీ అయ్యాయి.

సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్‌- అయిదేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం - Cm Ys Jagan Cheating Poor People

ఎక్కడుంది ప్రభూ ధర్మం : రాముడి పేరు చెబితే ప్రజలకు ధర్మమే గుర్తుకొస్తోంది. అందుకే ఇప్పటికీ రామరాజ్యం అనే జపిస్తుంటారు. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. ఇటీవల ఒంగోలులోని సమతానగర్, రిమ్స్ చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. వైసీపీ నాయకుల అల్లరి మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ నేతలను కొట్టి మళ్లీ వారి పైనే పోలీసు స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టారు.

గత ఏడాది మార్చిలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానూ ఇదే తీరు. ఒంగోలు నగరంలోని సెయింట్ థెరెసా ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతల అల్లరి మూకలు దాడి చేశాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు, స్థానిక మహిళల పైనా దౌర్జన్యానికి దిగారు. వైసీపీ అల్లరిమూకలు కళ్లలో కారం చల్లి భయభ్రాంతులకు గురి చేశారు. వారి చర్యలకు న్యాయం చేయాలని రెండో పట్టణ పోలీసులను బాధితులు ఆశ్రయిస్తే తిరిగి వారి పైనే అక్రమ కేసులు బనాయించారు.

ప్రజారోగ్యానికి జగనోరా వైరస్‌! - Jagan Negligence On People Health

అక్రమార్కుల చేతిలో జనం బందీ : ఆనాడు రావణుడి చెరలో సీతమ్మ ఒక్కరే ఉన్నారు. గత అయిదేళ్లుగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇసుక, గ్రావెల్, మైనింగ్ మాఫియా చేతుల్లో జనం బందీలుగానే ఉన్నారు. జగనన్న లేఅవుట్ల పేరిట చేపట్టిన భూ సేకరణలో ఎకరా పొలం స్థానికంగా రూ.10 లక్షలుంటే, వాటిని రూ.30 లక్షలు చొప్పున వైసీపీ నాయకులు కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారు. ఈ అక్రమాల పర్వం ప్రకాశం జిల్లా అంతా సాగింది.

భక్షకులుగా మారిన పాలకులు : ఆనాడు ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఏ పాదమూ కనిపించడం లేదు. వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ప్రజలను రక్షించాల్సిన పాలకులు భక్షకులయ్యారు. గ్రామ వార్డు స్థాయి సభ్యులు నుంచి మంత్రుల వరకు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. దొరికింది దొరికినట్లు దోచుకుంటున్నారు. తమ కష్టాలను అధికారులకు చెప్పుకొందాం అంటే రెవెన్యూ, పోలీసు, పంచాయతీ తదితర వ్యవస్థలన్నీ నామమాత్రంగా మారాయి. అంతటా అధికార పక్ష మనుషులే హల్ చల్ చేస్తున్నారు. వ్యతిరేకంగా చిన్న ఫిర్యాదు చేసినా జులం ప్రదర్శిస్తున్నారు. తమ బలంతో నిజాయతీ అధికారుల నోరు నొక్కేస్తున్నారు.

దుష్టత్వంపై పోరాటం: శ్రీరాముని కల్యాణ ఘడియల సందర్భగా ప్రతిన బూనుతాం. వ్యవస్థల విధ్వంసం నుంచి మమ్మల్ని మేము రక్షించుకునేలా ఓటనే వజ్రాయుధాన్ని సంధిస్తాం. శ్రీరామని కల్యాణ శుభ సమయంలో ఈ దిశగా వాగ్దానం చేద్దాం. ప్రలోభాలకు లొంగి ఓటును అమ్ముకోం. దుష్ట శక్తులను తరిమి కొడతాం. సమాజ అభివృద్ధికి నీతి నిజాయతీగా పాటుపడే వారినే పాలకులుగా ఎన్నుకుంటాం.

జగనన్న విద్యా దీవెన ఇస్తాడని అప్పులు చేశాం - రోడ్డున పడ్డాం - Jagan Vidya Deevena Problems

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.