ETV Bharat / state

సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్‌- అయిదేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం - cm ys jagan cheating poor people

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 4:00 PM IST

CM YS Jagan Cheating Poor people: ఉచిత ఇసుక తీసేశారు! కంకర, గ్రావెల్‌, గ్రానైట్‌ సీనరేజీ పెంచేశారు. సిమెంట్‌ ధర నియంత్రించకుండా చేతులెత్తేశారు! ఇలా జగన్ బాదుడుకు ఇంటి నిర్మాణ సామాగ్రి వ్యయం తడిసిమోపెడైంది. చిన్న ఇల్లు కట్టుబడికి అయ్యే ఖర్చు వైసీపీ ఏలుబడిలో నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ పెరిగింది! తాను ప్యాలెస్‌ల్లో సేదతీరుతూ సామాన్యుల సొంతింటి కలల్ని నేలమట్టం చేశారు జగన్‌!

CM_YS_Jagan_Cheating_Poor_people
CM_YS_Jagan_Cheating_Poor_people

CM YS Jagan Cheating Poor people: జీవితకాలంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలనేది సాధారణ, మధ్య తరగతి కుటుంబాల కల! జగన్‌ బండ బాదుడుకు అదో తీరని కలగా మారింది. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా మైనింగ్‌ ఫీజులన్నీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచడంతో ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు రెట్టింపయ్యాయి. ఇసుక లేకుండా ఇల్లు కట్టలేం. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తెచ్చింది. కేవలం రీచ్‌లో లోడింగ్‌కు, రవాణాకు కలిపి టన్నుకి 300 వెచ్చిస్తే ఇసుక ఇంటికి వచ్చేది.

జగన్‌ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుకకు మంగళం పాడారు. ప్రస్తుతం టన్ను ఇసుకకు రీచ్‌లోనే 475 రూపాయలు వసూలుచేస్తున్నారు! దీనికి రవాణా ఛార్జీలు కూడా కలిపి టన్ను ఇసుకకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు ఇసుక రీచ్‌ల్ని గుప్పిటపట్టి తోచినరేటు కడుతున్నారు. ఇది ఇంటి నిర్మాణంపై జగన్‌ వేసిన మొదటి భారం.

నియంత్రించే ప్రయత్నమే చేయలేదు: సిమెంట్‌ ధరల్ని జగన్‌ నియంత్రించే ప్రయత్నమే చేయలేదు. గతంలో 200 నుంచి 220 రూపాయలుగా ఉన్న 50 కిలోల సిమెంట్‌ బస్తా ఇప్పుడు 350 రూపాయలకు పెరిగింది. ఇనుమేమో టన్ను 50 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయలకు ఎగబాకింది. చిన్న ఇల్లుకట్టుకోవాలన్నా, 20 వేల ఇటుకలు కావాలి. ఐదేళ్ల క్రితం 5 రూపాయలుగా ఉన్న ఒక్కో ఇటుక ధర ఇప్పుడు 10 రూపాయలైంది.

నగరవాసులపై ఎడాపెడా పన్నుల మోత- 'ఎన్నికల్లో జగన్ సర్కార్​కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక'

లీజు ధరల్ని ఎడాపెడా పెంచేసి: జగన్‌ అధికారంలోకొచ్చాక మైనింగ్‌ లీజు ధరల్ని ఎడాపెడా పెంచేశారు. లీజుదారులు తమపై పడిన భారాన్ని నిర్మాణదారులపైనే వేస్తున్నారు. వెయ్యి చదరపు అడుగుల్లో నిర్మించే ఇంటికి పిల్లర్లు, స్లాబ్‌ కోసం సగటున 70 టన్నుల వరకూ కంకర అవసరం. ఐదేళ్ల క్రితం టన్ను కంకర ధర 300 రూపాయలుంటే, ఇప్పుడది 500 రూపాయలకు పెరిగింది. గత ప్రభుత్వంలో కంకరకు సీనరేజ్‌ ఫీజు టన్నుకు 50 రూపాయలు. దీనికి జిల్లా ఖనిజ నిధి 30%, ఖనిజాన్వేషణ ట్రస్టు నిధి 2% కలిపి లీజుదారుడు టన్నుకు 66 రూపాయల చొప్పున గనుల శాఖకు చెల్లించేవారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే టన్ను కంకరకు సీనరేజ్‌ ఫీజును 60 రూపాయలకు పెంచారు. దీనికి అనుగుణంగానే జిల్లా ఖనిజ నిధి, ఖనిజాన్వేషణ ట్రస్టు నిధి ఛార్జీలు కూడా కలిపితే టన్ను కంకర ధర 79రూపాయల 20పైసలకు చేరింది.

లీజుదారుల గగ్గోలు: ఇక ఇంటి పునాదులు నిర్మించాక అందులో నింపేందుకు కావాల్సిన గ్రావెల్‌ గతంలో టన్ను వంద రూపాయలుండేది. ఇప్పుడు ఏకంగా 400 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గ్రావెల్‌కు టన్ను సీనరేజ్‌ ఫీజు 20 రూపాయలుంటే దాన్ని 30 రూపాయలు చేశారు. జిల్లా ఖనిజ నిధి, ఖనిజాన్వేషణ ట్రస్టు నిధి ఛార్జీలు కూడా కలిపితే గ్రావెల్ సీనరేజ్ టన్నుకు 40 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది! కరోనా రెండు దశల ప్రభావంతో 2021 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం కొత్తగా కన్సిడరేషన్‌ అమౌంట్‌ అనే సుంకాన్ని తెచ్చింది. దాని ప్రకారం టన్ను కంకరకు సీనరేజ్ ఫీజు 60 రూపాయలు ఉంటే ప్రీమియం అమౌంట్‌ సుంకంగా మరో 60 రూపాయలు చెల్లించాలనే నిబంధన తెచ్చారు. కొవిడ్‌ పరిస్థితులు తొలగిపోయినందున కన్సిడరేషన్‌ అమౌంట్‌ సుంకం తొలగించాలని లీజుదారులు గగ్గోలుపెడుతున్నా ప్రభుత్వం ఆలకించడంలేదు.

'ఆస్తి మూరెడు పన్ను బారెడు'- ప్రజల నడ్డివిరుస్తున్న జగన్ ప్రభుత్వం

సగటున 4 నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ భారం: ఇక గత ప్రభుత్వంలో కంకర క్వారీలకు ఏడాదికి డెడ్‌రెంట్‌ హెక్టారుకు 50 వేల రూపాయలండేది. జగన్‌ వచ్చాక దాన్ని 65 వేల రూపాయలకు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద మూడురెట్ల వార్షిక డెడ్‌రెంట్‌ చెల్లించాలనే నిబంధన కొత్తగా తెచ్చారు. కొత్త లీజులు, పాత లీజుల రెన్యువల్‌ కోసం పది రెట్ల వార్షిక డెడ్‌రెంట్‌ చెల్లించాలనేది మరో నిబంధన. అంటే ఒక హెక్టారులో కొత్త కంకర లీజు పొందాలన్నా, పాత లీజు రెన్యువల్‌ చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఆరున్నర లక్షల రూపాయల వరకూ ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది! కంకర క్వారీలకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ అనుమతులు తీసుకోవాలి.

వాటి ఫీజులు గతంలో టర్నోవర్‌ ఆధారంగా నామమాత్రంగా ఉండేవి. జగన్‌ ప్రభుత్వం వాటిని భారీగా పెంచేసింది. లీజు విస్తీర్ణం, ఉత్పత్తి చొప్పున ఫీజులు వసూలు చేసే విధానం తెచ్చింది! ఇవన్నీ అంతిమంగా సొంతింటి నిర్మాణానికి గుదిబండగా మారాయి! వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఐదేళ్ల క్రితం 13 నుంచి 15 లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు 18 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తోంది. సగటున 4 నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ భారం పెరిగింది! ఇలా అన్నివిధాలా పెరిగిన ధరలతో ఇల్లు నిర్మించుకోవాలనే వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితుల్లోకి జగన్‌ ప్రభుత్వం నెట్టేసింది.

జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్​!

సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్‌ - అయిదేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.