CEO Vikas Raj On Lok sabha Polls : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లుగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వికాస్‌రాజ్, రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైందని పేర్కొన్నారు. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తామని తెలిపారు. ఇవాళ వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని వివరించారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామన్నారు.
రూ.330 కొట్ల సొత్తు స్వాధీనం : ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వందల కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఈవీఎంలు తెల్లవారుజాము వరకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరతాయని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతం రేపు మధ్యాహ్నం వరకు తెలుస్తుందన్నారు. పోలింగ్‌పై మంగళవారం స్క్రూటినీ ఉంటుందని, ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే రేపు తెలుస్తుందని వివరించారు.
Polling Ended Peacefully In Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు. క్యూలో నిలబడిన వారు పూర్తయ్యే వరకు పొలింగ్ కొనసాగింది. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఈవీఎంలను సీజ్ చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఎన్నికలు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు.
" లోక్‌సభ ఎన్నికలకు మంచి స్పందన వచ్చింది. వాతావరణం కూడా సహకరించింది. ఎక్కడైనా ఈవీఎంలో సమస్య తలెత్తిత్తే వెంటనే మార్చాము. నేషనల్ గ్రివెన్స్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం. ఈ రోజు 38 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈవీఎమ్లన్నింటిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియ జరుగుతోంది" - వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో యువత, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహాంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. మావోయిస్టు ప్రాభల్యమున్న ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
ఓటర్లందరూ తప్పనిసరిగా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలి : సీఈవో వికాస్‌రాజ్ - CEO Vikas Raj Interview