ETV Bharat / state

జగన్‌ కేసుల విచారణలో జాప్యం ఎందుకు?- అఫిడవిట్‌ వేయాలంటూ సీబీఐకు సుప్రీం ఆదేశాలు - SC on CM Jagan Illegal Assets Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 7:36 AM IST

Updated : Apr 2, 2024, 9:14 AM IST

SC_on_CM_Jagan_Illegal_Assets_Case
SC_on_CM_Jagan_Illegal_Assets_Case

SC on CM Jagan Illegal Assets Case: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో 4 వారాల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

జగన్‌ కేసుల విచారణలో జాప్యం ఎందుకు?- అఫిడవిట్‌ వేయాలంటూ సీబీఐకు సుప్రీం ఆదేశాలు

SC on CM Jagan Illegal Assets Case: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. కారణాలేంటో చెబుతూ అఫిడవిట్‌ వేయాలని గత విచారణలోనే చెప్పినా ఎందుకు స్పందించలేదని సీబీఐ తరఫు న్యాయవాదిని నిలదీసింది. నాలుగు వారాల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌ కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం జరుగుతున్నందున వాటిని వేరే రాష్ట్రానికి బదిలీచేయాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచారణపై ప్రభావం చూపుతున్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌దత్తలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ వాదనలు వినిపించారు. ట్రయల్‌ కోర్టులో ప్రతివాదులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై వెంటనే నిర్ణయం వెలువరించాలని ధర్మాసనం ఆదేశించిన విషయం గుర్తుచేశారు. అయితే ఈ కేసులో గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించినా ఇంత వరకూ పురోగతి కనిపించలేదన్నారు.

ఎన్నికల ప్రచారంలో అభివాదాలే తప్ప నోరువిప్పని జగన్‌- సీఎం తీరుపై విమర్శల వెల్లువ - CM Jagan Election Campaign

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్లను తాము ఒకదాని తర్వాత మరొకటి పరిశీలిస్తామన్నారు. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలు చేసిన కేసు మనుగడ సాగించడానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఉందని న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ బదులిచ్చారు. కింది కోర్టులో ట్రయల్‌ జరగడం లేదన్న ఉద్దేశంతోనే ఇందులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు.

ఒకవేళ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసినా ఆ పరిస్థితి తలెత్తవచ్చు కదా అని న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. ఇదివరకు రాజకీయ సమీకరణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు అవి అయిపోయాయని పేర్కొంటూ సమీపంలో ఎన్నికలు ఉన్నందున దానికి అనుగుణంగా తాము ఈ కేసు విచారణ తేదీ ఖరారు చేస్తామని చెప్పారు.

జగన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కేసులనూ హైకోర్టు పర్యవేక్షిస్తున్నట్లు వాదించారు. జస్టిస్‌ ఖన్నా జోక్యం చేసుకుంటూ మీరు ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలని రోహత్గీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బెయిల్‌ రద్దు పిటిషన్‌ను తాము ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌తో కలిపి విచారిస్తామని చెప్పారు. పిటిషనర్‌ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై ఏప్రిల్‌ 30లోపు నిర్ణయం వెలువరించాలని తెలంగాణ హైకోర్టు ట్రయల్‌ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసిందని, అందువల్ల ఈ నెలాఖరులోపు దీనిపై నిర్ణయం వెలువడుతుందని రోహత్గీ చెప్పారు.

ప్రచారాన్ని ముమ్మరం చేసిన తెలుగుదేశం నేతలు - TDP leaders Election campaign

జగన్‌ కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని గత విచారణ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికి ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజును జస్టిస్‌ ఖన్నా ప్రశ్నించారు. విచారణ తగినంత వేగంగా జరుగుతోందని చెప్పడానికి వీల్లేదన్నారు.

విచారణ జాప్యానికి కారణాలు చెప్పాల్సింది సీబీఐ తప్ప హైకోర్టు కాదన్నారు. డిశ్ఛార్జి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విచారణ ముగియాల్సి ఉందని ఎస్‌.వి.రాజు బదులిచ్చారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు జాప్యానికి కారణాలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. ఈ కేసులో నిందితుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటంతోపాటు, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారన్న కారణంగానే జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారని, అందువల్ల మీరు స్పష్టమైన కారణాలు చెప్పాలని న్యాయమూర్తి ఆయన్ను ఆదేశించారు.

సెక్షన్‌ 207లోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతుందని రాజు చెప్పినా న్యాయమూర్తి ఖన్నా ఏకీభవించలేదు. అలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని, ఏదేమైనా విచారణ జాప్యానికి కారణాలు చెప్పాలని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ కింద జగన్‌ మినహాయింపులు కోరకూడదన్న ఎస్‌.వి.రాజు వాదనతో జస్టిస్‌ ఖన్నా ఏకీభవించారు. విచారణలో జాప్యానికి కారణాలతో సీబీఐ 4 వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేశారు. ఈ కేసుల్లో కింది కోర్టులో ట్రయల్‌ సాధ్యమైనంత వేగంగా జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని సీఈవోకు జేడీ విజ్ఞప్తి - JD And Vijayakumar Complaint to EC

Last Updated :Apr 2, 2024, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.