ETV Bharat / state

వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?- నల్లమలను చూసొద్దాం రండి - Nallamala Forest Tourism Packages

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 2:16 PM IST

Updated : May 23, 2024, 2:53 PM IST

Nallamala Forest Tourism Packages: వేసవి సెలవుల్లో పిల్లలను ప్రకృతి అందాలను ఆస్వాదించేలా టూరిజం వెళ్లాలి అనుకున్నవారికి నల్లమల ఫారెస్ట్ చక్కటి ఎంపిక. దూర ప్రాంతాలకు వెళ్లేకంటే మన చెంతనే ఉన్న నల్లమలను సందర్శిస్తే మంచి అనుభవంతోపాటు గుర్తుండిపోయే అనుభూతులు సొంతమవుతాయి.

Nallamala_Forest_Tourism_Packages
Nallamala_Forest_Tourism_Packages (ETV Bharat)

Nallamala Forest Tourism Packages: ఈసారి వేసవి సెలవులు వచ్చినా ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు మరోవైపు ఎన్నికల వేడి వల్ల చాలామంది విహార యాత్రలకు వెళ్లలేకపోయారు. దీంతో పిల్లలు నిరుత్సాహానికి గురయ్యారు. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో మిగిలిన కొద్ది రోజులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు జనం సన్నద్ధం అవుతున్నారు. విహారయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

అలాంటి వారు వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాలకు వెళ్లేకంటే మన చెంతనే ఉన్న నల్లమలను సందర్శిస్తే మంచి అనుభవం, గుర్తుండిపోయే అనుభూతులు సొంతమవుతాయి. అడవంటే ఇంత అందంగా ఉంటుందా అనుకునేలా నల్లమల కనువిందు చేస్తుంది. ఇక్కడున్న జంగిల్‌ సఫారీ, ఎకోటూరిజం, జీవవైవిధ్య కేంద్రాలు పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుతాయి.

నల్లమలను చూసొద్దాం
నల్లమలను చూసొద్దాం (ETV Bharat)

దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యం: దేశంలోని పులుల అభయాణ్యాల్లో నల్లమల అతి పెద్దదిగా ఖ్యాతి గాంచింది. 2022 గణన ప్రకారం నల్లమలలో 75 పులులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌టీఆర్‌(నాగార్జున సాగర్‌- శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌) నిర్ధారించింది. జంగిల్‌ సఫారీకి వెళ్లే పర్యాటకులకు అప్పుడప్పుడు పులులు తారసపడుతుంటాయి.

కుదేలైన మాల్దీవులు టూరిజం- 'దయచేసి మా దేశానికి రండి' అంటూ భారతీయులకు రిక్వెస్ట్​ - Maldives India Tourism

పర్యాటకులకు ప్రత్యేక వసతులు: 2017 నుంచి అటవీ శాఖ నల్లమల సందర్శనకు అవకాశం కల్పించింది. నల్లమలలోని బైర్లూటి, సిరివెళ్ల సమీపంలోని పచ్చర్ల వద్ద ఎకోటూరిజం జంగిల్‌ సఫారీ క్యాంప్‌లు నిర్మించింది. ఇక్కడ ఎడ్యుకేషనల్‌ హబ్‌లు ఏర్పాటు చేసి నల్లమల గురించి వివరిస్తున్నారు. పర్యాటకులు విడిది చేసే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు. అడవిలో గడుపుతూ ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు. చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేందుకు ఎకోవాక్, హెరిటేజ్‌ వాక్, జంగిల్‌ సఫారీ, ట్రెక్కింగ్, బర్డ్స్, బటర్‌ఫ్లై పార్కులు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు సరదాగా గడిపేందుకు అవసరమైన రకరకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు.

నల్లమలను చూసొద్దాం
నల్లమలను చూసొద్దాం (ETV Bharat)

జీవ వైవిధ్యానికి నిలయం: కాలగమనంలో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అలాంటి వాటి గురించి భవిష్యత్తు తరాలకు పరిచయం చేసేందుకు 2001 డిసెంబరు 8న శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ కేంద్రంగా జీవ వైవిధ్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక జీవరాసుల నమూనాలు నిక్షిప్తం చేశారు. నల్లమలలో నివసించే జంతువులు, వాటి జీవన విధానాలు, అరుదైన జీవరాసులను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయడం వంటి పనులు ఈ కేంద్రంలో కొనసాగుతున్నాయి. ఇందులో 303 రకాల క్షీరదాలు, 80 రకాల పాములు, 102 రకాల సీతాకోక చిలుకలు. 55 రకాల చేపలు, 25 లాంబాలు, 18 జాతుల కప్పలు, 54 జాతుల సరీసృపాలు, 57 రకాల మాత్‌లు, 77 రకాల కీటకాల అవశేషాలు భద్రపరిచారు.

నల్లమలను చూసొద్దాం
నల్లమలను చూసొద్దాం (ETV Bharat)

ఎన్నో ప్రత్యేకతలు: వైవిధ్యభరితమైన వాతావరణం కలిగిన నల్లమల పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. వెతికే కొద్దీ కొత్త కొత్త అందాలు, అరుదైన జీవరాసులు కనిపిస్తూనే ఉన్నాయి. నల్లమల కొండలు తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. నల్లమల మొత్తం విస్తీర్ణం 5,947 చ.కి.మీలు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 3,040.74 చ.కి.మీ పరిధిలో రాజీవ్‌గాంధీ(నాగార్జున సాగర్‌-శ్రీశైలం) జాతీయ పులుల అభయారణ్యం విస్తరించి ఉంది.

చెన్నై ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి- విజిటర్స్​ ఫిదా!

ఔషధాల ఖిల్లా: నల్లమల ఔషధాల ఖిల్లాగా పేరుగాంచింది. ఈ అడవి పరిధిలో వేలాది ఔషధ మొక్కలున్నాయి. సున్నిపెంట జీవ వైవిధ్య కేంద్రం పరిధిలో అరుదైన, ఔషధ గుణాలున్న 353 జాతులను గుర్తించారు. రోళ్లపెంట నుంచి పెచ్చెర్వు గూడేనికి వెళ్లే దారిలో వనమూలికల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకేచోట 70- 80 జాతుల ఔషధ మొక్కలు ఉండటం విశేషం.

ఎకలాజికల్‌ నాలెడ్జ్​ పార్క్‌: సున్నిపెంట జీవ వైవిధ్య కేంద్రం ఎదురుగా 8 హెక్టార్లలో ఎకలాజికల్‌ నాలెడ్జ్​ పార్క్‌ ఏర్పాటు చేశారు. డైనోసార్ల కాలం నుంచి భూమి పుట్టుక, జీవ పరిణామ క్రమాన్ని వివరించే చిత్రాలు, బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం నాలుగు ప్రాంతాల్లో భోజనం, విడిది, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.

ఆన్​లైన్ బుకింగ్ వసతి: నల్లమల విహారానికి వచ్చే పర్యాటకులు జంగిల్‌ క్యాంప్‌లో విడిది చేసేందుకు ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌టీఆర్‌.కో.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం బైర్లూటిలో 4 కాటేజెస్, 6 టెంట్‌లు, పచ్చర్లలో 4 కాటేజెస్, 2 టెంట్లు ఏర్పాటు చేశారు. ఒక రోజు విడిదికి కాటేజెస్‌ ధర రూ.6 వేలు, టెంట్‌కు రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు 12 గంటల వరకు ఇక్కడ ఉండవచ్చు. సఫారీ చేసే వారు వాహనానికి(10 మందికి) రూ.3 వేలు చెల్లించాలి. ఎన్‌ఎస్‌టీఆర్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

ప్రయాణం: బైర్లూటి జంగిల్‌ క్యాంప్‌ నుంచి 15 కి.మీలు సఫారీ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో 3 కి.మీలు కలిపి మొత్తం 18 కి.మీలు ప్రయాణం ఉంటుంది.

రుచులు పంచే రెస్టారెంట్లు: నల్లమల సందర్శనకు వచ్చే పర్యాటకులకు రుచికరమైన ఆహారం అందించేందుకు సుందరమైన రెస్టారెంట్‌ను నిర్మించారు. వీటిలో భోజనం, ఫలహారం అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలోనే పర్యాటకులు కోరిన విధంగా శాఖాహారం, మాంసాహారం అందిస్తారు.

Last Updated : May 23, 2024, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.