ETV Bharat / state

ఆత్మగౌరవం కోసం వైసీపీకి రాజీనామా: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 6:59 PM IST

MP Magunta Srinivasulu Reddy Resigned From YSRCP: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ రాజీనామాల పర్వం వెంటాడుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో వ్యతిరేక భావన కలిగించారనే ప్రచారంతో ఆత్మాభిమానం దెబ్బతిందని ఆయన రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

MP Magunta Srinivasulu Reddy Resigned From YSRCP
MP Magunta Srinivasulu Reddy Resigned From YSRCP

ఆత్మగౌరవం కోసం వైసీపీకి రాజీనామా: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

MP Magunta Srinivasulu Reddy Resigned From YSRCP: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్సీపీకీ రాజీనామా చేశారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. కొంతకాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలుకుతూ రాజీనామా ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో దించుతున్నట్లు వెల్లడించారు. సౌమ్యుడిగా పేరున్న మాగుంట ఆవేదనతో పార్టీని వీడటం వైసీపీ రాజకీయ దుర్నీతిని చాటుతోందనే విమర్శలు వస్తున్నాయి. వరుసగా కీలక నేతల రాజీనామాలతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

వైసీపీకి మరో షాక్ - పార్టీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా

ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశా: వైసీపీలో మరో కీలక వికెట్‌ పడిపోయింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పార్టీని వీడుతున్నట్లు ఆయన ఒంగోలులో ప్రకటించారు. వివాద రహితుడుగా పేరున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా తన పని తాను చేసుకుపోవడం, ఇతర పార్టీల నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆయన స్వభావం. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడైన శ్రీనివాసులు రెడ్డి అన్న ఆకస్మిక మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ వాదులైన మాగుంట కుటుంబం మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలు మారుతూ వస్తున్నారు. 1998లో రాజకీయ ప్రవేశం చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తొలిసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు.

రాష్ట్ర విభజన, కాంగ్రెస్ నిర్వీర్యంతో 2014లో తెలుగుదేశంలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. మాగుంట సేవలను గుర్తించి తెలుగుదేశం 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించింది. ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో ప్రాబల్యం పెంచుకుంటున్న వై.వి.సుబ్బారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డే మాగుంటను పార్టీలోకి తీసుకొచ్చారనే వాదన ఉంది. 2019లో వైసీపీ తరఫున ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మాగుంటకు ఆ పార్టీలో అంత గుర్తింపు, గౌరవం గానీ లభించలేదన్నది ఆయన వర్గీయుల ఆరోపణ చేస్తున్నారు.

వైసీపీలో మెుదలైన ముస‌లం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా

ఏ పార్టీలో చేరతారో స్పష్టత లేదు: మాగుంట కుటుంబం తొలి నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తోంది. ప్రకాశం జిల్లాలోనూ ఆ కుటుంబానికి డీస్టీలరీలు ఉన్నాయి. మద్యం విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులతో మాగుంట వ్యాపారాలకు కొంతమేర ఇబ్బంది కలిగింది. దీనికి తోడు దిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట కుమారుడు రాఘవరెడ్డిపై ఆరోపణలు రావడం, అతడు అరెస్టు కావడం వంటి పరిణామాలు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఆయనకు తెచ్చిపెట్టాయి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఏమాత్రం సహకరించలేదని మాగుంట వర్గంలో ఆవేదన వ్యక్తమైంది. అయినా ఎప్పుడూ ఆయన ఆవేదన బయటపెట్టలేదు. ఇటీవల వైసీపీ ఇన్‌ఛార్జీల మార్పులు, చేర్పులు జరుగుతుండగా ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా మాగుంటనే కొనసాగించాలని బాలినేని గట్టిగా ప్రయత్నించారు. పలుమార్లు సీఎం జగన్‌ను కలిసి బాలినేని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించడంతో మాగుంటకు టికెట్‌ లేదన్న విషయం స్పష్టమైంది.

వైసీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు..

ఆత్మాభిమానం దెబ్బతినడంతో రాజీనామా: వైసీపీలోని మిగతా నాయకుల్లా ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడం, జగన్‌ను అదే పనిగా పొగడటం వంటి వాటికి మాగుంట శ్రీనివాసులురెడ్డి దూరంగా ఉంటారు. హుందాగా నడుచుకునే మాగుంట రాజకీయాలపై జగన్‌కు అసహనం కలగడం, పార్టీలో చక్రం తిప్పుతున్న వై.వి.సుబ్బారెడ్డికి ఆయనతో పడకపోవడంతో పార్టీలో వ్యతిరేక భావన కలిగించారనే ప్రచారం సాగింది. ఈ పరిణామాలతో ఆత్మాభిమానం దెబ్బతిందని మాగుంట ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ వారసుడిగా ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏ పార్టీలో చేరతారన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజీనామా ప్రకటన అనంతరం మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంపై ఉన్న వైసీపీ జెండాను కార్యకర్తలు తొలగించారు.

'మా కుటుంబ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటున్నా- వైసీపీకి రాజీనామా చేస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.