ETV Bharat / state

ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి - సీఎం రేవంత్​కు కేటీఆర్ బహిరంగ లేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 7:34 PM IST

Updated : Feb 2, 2024, 10:28 PM IST

KTR Open Letter To CM Revanth Reddy : రాష్ట్ర ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రజావ్యతిరేకిగా మారిపోయిందని విమర్శించారు.

KTR Open Letter On Auto Drivers Issue
KTR Open Letter To CM Revanth Reddy

KTR Open Letter To CM Revanth Reddy : ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని, వారి ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

పదేళ్లు తెలంగాణలో అన్ని వర్గాలవారు సంతోషంగా ఉంటే, కేవలం 55 రోజుల కాంగ్రెస్ పాలనలో అనేక వర్గాలు ఆగమవుతున్నాయన్న ఆయన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని అన్నారు. చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే, పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమవుతోందని అన్నారు.

'సర్పంచ్' పదవికి మాత్రమే విరమణ - ప్రజాసేవకు కాదు : కేటీఆర్

KTR Open Letter On Auto Drivers Issue : కిరాయి ఆటోలు నడిపే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్న ఆయన, అప్పు తెచ్చి ఆటోలు కొని నడుపుతున్న డ్రైవర్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒక గిరిజన ఆటోడ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలోని కమిటీ ఆటో సంఘాలు, డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపామన్న ఆయన, ఇప్పటివరకు స్పందించిన పాపాన పోలేదని ఆక్షేపించారు. అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలోని ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్ల పక్షాన కోరుతున్నట్లు కేటీఆర్ (KTR) లేఖలో పేర్కొన్నారు. ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్ల కుటుంబాలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తేనే 6 గ్యారెంటీల అమలట : కేటీఆర్‌

ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు పది లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆటోలో ప్రయాణిస్తూ డ్రైవర్ల సమస్యలు తనకు తెలుసంటూ ఫొటోలకు ఫోజులిచ్చారని మండిపడ్డ కేటీఆర్, ఆటోడ్రైవర్లతో సమావేశం పేరిట సీఎం రేవంత్ రెడ్డి చూపిన తాపత్రయం, సమస్య పరిష్కారానికి చూపలేదని ఆక్షేపించారు.

మా ప్రభుత్వాన్ని పడగొట్టేది ఎవరు?: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజాభవన్ అని పేరు మారిస్తేనే సరిపోదన్న కేటీఆర్, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పుపెట్టుకున్నా ముఖ్యమంత్రి (CM Revan Reddy) ఇప్పటివరకు స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుక వినిపిస్తున్నామన్న కేటీఆర్ ఆటోడ్రైవర్లను అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆటోడ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వం మెడలు వంచి ఆటోడ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని ప్రకటించారు.

త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

Last Updated : Feb 2, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.