ETV Bharat / state

పీఎస్​లో మహిళ ఫిర్యాదును పట్టించుకోని కరీంనగర్ పోలీసులు - హైకోర్టు సీరియస్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 10:37 PM IST

High Court on Police Action to Woman Register Complaint : ఓ మహిళ ఫిర్యాదును పట్టించుకోకుండా, పోలీస్​ స్టేషన్​లో రోజంతా నిలబెట్టిన అంశాన్ని తప్పు పడుతూ తెలంగాణ హైకోర్టు సంబంధిత పోలీసులపై చర్యలకు ఆదేశించింది. చట్టబద్ధ పాలన ఉన్న ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. కరీంనగర్​లోని జడ్జి ఇంట్లో ఆఫీసు సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ, జడ్జి కుమారుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవడంపై హైకోర్టులో అప్పీల్​ చేసింది.

Telangana HC on MLC Issue
High Court on Police Action to Woman Register Complaint

High Court on Police Action to Woman Register Complaint : ఓ మహిళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లో గడపటానికి అదేమీ పర్యాటక ప్రదేశం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదు ఇవ్వలేదు, కేసు నమోదు చేయలేదంటూ పోలీసు చర్యను ప్రభుత్వ న్యాయవాది సమర్ధించడం సరికాదంది. కరీంనగర్‌లో ఓ జడ్జి కుమారుడు వికాస్ కుతాడిపై ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వంగ రమ్య అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

'కాళేశ్వరం ప్రాజెక్టు' వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటి : హైకోర్టు

ఈ పిటిషన్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే(Justice Alok Aradhe), జస్టిస్ జె అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆఫీసు సబార్డినేట్‌గా జడ్జి ఇంట్లో విధులు నిర్వహిస్తున్న పిటిషనర్‌పై వికాస్ అనుచితంగా ప్రవర్తించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈనెల 13న పిటిషనర్ పోలీసు స్టేషన్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయలేదన్నారు.

ఎస్​హెచ్​ఓపై చర్యలకు ధర్మాసనం ఆదేశాలు : ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ అక్కడికి వెళ్లడం వాస్తవమేనంటున్నప్పుడు ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. జనరల్ డైరీలో అయినా నమోదు చేయాలి కదా అని నిలదీసింది. చట్టబద్ధ పాలన ఉన్న ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదంది.

కరీంనగర్ 2టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఓదెల వెంకట్‌పై శాఖాపరమైన చర్యలతో పాటు సస్పెన్షన్‌కు(Suspension) ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఓదెల వెంకట్‌ను రికార్డులతో పిలిపిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ను పిలిపించిన ధర్మాసనం పోలీసుల తీరును వివరించి ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది.

Telangana HC on MLC Issue : మరోవైపు గవర్నరు కోటా ఎమ్మెల్సీల పిటిషన్​పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నరు కోటా కింద తమ నామినేషన్లను, గవర్నరు(Governor) తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణను కొనసాగించింది. శ్రవణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది, న్యాయవాది వీ మురళీ మనోహర్ వాదనలు వినిపిస్తూ ఇటీవల గవర్నరు నామినేట్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం దాఖలు చేసిన కౌంటరులో తాను రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పేర్కొన్నారన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ రెండు వారాలకు వాయిదా - పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు

ప్రతివాదులందరికీ ధర్మాసనం ఆదేశాలు జారీ : గవర్నరు నిర్ణయంపై న్యాయసమీక్ష చేయవచ్చని తెలిపారు. ప్రతివాదులు పేర్కొన్న పలు తీర్పుల్లోని అంశాలు ఈ కేసుకు వర్తించవని పేర్కొన్నారు. కుర్రా సత్యానారాయణ తరఫు న్యాయవాది వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతేగాకుండా రాతపూర్వక వాదనలు గురువారంలోగా సమర్పించాలని పిటిషనర్లతో పాటు ప్రతివాదులైన గవర్నరు కార్యాలయం, ప్రభుత్వం, కోదండరాం(Prof Kodandaram), అమీర్ అలీఖాన్ తరపు న్యాయవాదులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ధోనీ పరువు నష్టం కేసు- IPS అధికారికి 15 రోజులు జైలు శిక్ష

High Court On Tree Cutting : మరో కేసులో హైదరాబాద్ మణికొండలో క్రికెట్ మైదానంలో అడ్డుగా ఉన్నాయంటూ 40 చెట్ల కొట్టివేతపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. చెట్ల నరికివేతపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర అటవీశాఖ ముఖ్యకార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్(GHMC Commissioner), మణికొండ మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

ఎలాంటి అనుమతుల్లేకుండా చెట్లను నరికి వేయడాన్ని సవాలు చేస్తూ వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి.ఉదయ కృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. క్రికెట్ మైదానం అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్నాయంటూ 40 చెట్లను తిరిగి కొట్టివేశారన్నారు. కనీసం సమాచారం ఇచ్చినట్లయితే ఉచితంగా మరోచోటికి తరలించడానికి అవకాశం ఉండేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

అఖిల భారత సర్వీస్‌ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

హైకోర్టుకు చేరిన అవిశ్వాస తీర్మానాల పంచాయితీ - ప్రభుత్వానికి నోటీసులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.