ETV Bharat / state

జగన్ బొమ్మలు కవర్ చేసేందుకు అవస్థలు- వైసీపీ ప్రచార పిచ్చితో ఉద్యోగుల పాట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 6:58 AM IST

Employees Problems with YSRCP Excessive Publicity: సీఎం జగన్ ఎప్పుడో కట్టిన ప్రభుత్వ భవనాలకూ వైసీపీ రంగులేసుకుని తన ప్రచార పిచ్చి తీర్చుకుంటున్నారు. అన్నింటిపైనా తన బొమ్మ అచ్చువేయించుకున్నారు.! ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వేళ జగన్‌ అడ్డగోలు ప్రచారాన్ని ఎలా కట్టడి చేయడం ఉద్యోగులకు పనిభారంగా, ప్రభుత్వానికి అదనపు ఖర్చుగా మారింది.

Employees_Problems_with_YSRCP_Excessive_Publicity
Employees_Problems_with_YSRCP_Excessive_Publicity

Employees Problems with YSRCP Excessive Publicity: కొందరు చేసే పనుల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటారు.! మరికొందరు ఎవరో చేసిన పనికీ తన ముద్ర వేసుకోవాలనుకుంటారు.! సీఎం జగన్‌ ఇందులో రెండో రకం.! ఎప్పుడో కట్టిన ప్రభుత్వ భవనాలకూ వైసీపీ రంగులేసుకుని తన ప్రచార యావ తీర్చుకున్న జగన్‌ చివరకు పిల్లలకు ఇచ్చే చిక్కీలు, పుస్తకాల బ్యాగులు, బాలింతలకిచ్చే పౌష్టికాహార ప్యాకెట్ల వంటి వాటినీ వదల్లేదు.

చిక్కిలను వదల్లేదు: గుంటూరు జిల్లా చిన్నపలకలూరు అంగన్వాడీ కేంద్రం(Anganwadi Center) సిబ్బందికి జగనన్న ప్రచార పిచ్చి తెచ్చిన పాట్లు! పిల్లలకు పంచాల్సిన ప్యాకెట్లకు కాగితాలు అంటించుకోవాల్సి వస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద సరఫరా చేసే ప్యాకెట్లపై జగన్‌ బొమ్మలు ముద్రించారు. ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి రావడంతో ఇప్పుడు వాటిపైన తెల్లకాగితాలు అంటిస్తున్నారు.! విసుగొచ్చి కొన్నింటినే కవర్‌ చేశారు. మిగతావాటిని వదిలేశారు. ఇవే కాదు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్లపైనా జగన్‌ ఫొటో ఉంది.

అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు

గుడ్డుపైన 'జగనన్న గోరుముద్ద' : ఇప్పటికే చాలా బడులకు 15 రోజులకు సరిపడా పంపిణీ చేశారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లపైనా 'జగనన్న గోరుముద్ద'అని స్టాంపులు వేశారు. ఇప్పుడు అవి బడుల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఏం చేస్తారో తెలియని పరిస్థితి. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ స్వామిభక్తి ప్రభుత్వ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు.

లక్షల్లో ఖర్చు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నోటు పుస్తకాలపై సీఎం జగన్‌(CM Jagan) ఫొటో ముద్రణకు ఆదేశించారు. దీన్ని ఓ అధికారి వ్యతిరేకించినా లెక్కచేయకుండా మొండింగా ముద్రింపజేశారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఇప్పుడు జగన్‌ ఫొటో కనిపించకుండా ఉండేందుకు నోటుపుస్తకాలకు అట్టలు వేయాలంటూ ప్రధానోపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.! ఉపాధ్యాయులు అనవసరమైన తలనొప్పి తెచ్చిపెట్టారని అసహనం వ్యక్తంచేస్తున్నారు.! చాలా బడుల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక ఇతరత్రా కార్యక్రమాలు, జగన్‌ ఫొటోలను పెయింట్లు వేశారు. ఇప్పుడు వాటిని మూసేసేందుకు లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ముస్లింలకు మేలు చేసేది టీడీపీనే - వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: చంద్రబాబు

బ్యాగులు, బెల్టులపైనా: ఇక విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బ్యాగులపైన 'జగనన్న విద్యాకానుక' అని రాయించారు. మరి వాటినేంచేద్దాం అని ఉపాధ్యాయులు అడిగితే బెల్టులు ధరించకుండా చూడాలని సమాధానం ఇస్తున్నారు. బ్యాగులపైనా జగనన్న పేరు అచ్చేయించారు. దాన్ని ఎలా కవర్‌ చేయించాలో ఉపాధ్యాయులకు అర్థంకావడం లేదు. బైజూస్‌ కంటెంట్‌తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లపైనా వేసిన స్టిక్కర్లను తొలగించాలా లేదా అనేదానిపైనా స్పష్టత లేదు.

విద్యార్థులకు అందించిన డిక్షనరీలపైనా, జగన్‌ బొమ్మతో నవరత్నాల వివరాలు ముద్రించారు. పదో తరగతి విద్యార్థులకు అందించే స్టడీ మెటీరియల్‌పైనా జగన్‌తోపాటు, మంత్రుల చిత్రాలు ముద్రించారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్‌ కళ్లకు కనిపించవా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో టేక్‌ హోం రేషన్‌ కింద ప్రతి నెలా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బెల్లం పొడి, రాగిపిండి, బియ్యం సంచులతో కూడిన పౌష్టికాహార ప్యాకెట్లు అందిస్తున్నారు.

ప్రజాక్షేత్రంలోకి జగన్ - మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర

అసలే అప్పులు, ఆపై అదనపు భారం: వాటన్నింటిపైనా ఉన్న సీఎం జగన్‌ బొమ్మలు కన్పించకుండా స్టిక్కర్‌ అంటించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. అసలే అప్పుల్లో కూరుకున్న పౌరసరఫరాల సంస్థకు ఇప్పుడు మళ్లీ అదనపు భారం కానుంది. ఇక రేషన్‌ పంపిణీ చేసే ఎండీయూ వాహనాలపైనా నవరత్నాలు, జగన్‌ స్టిక్కర్లను వాహన రంగు దెబ్బతినకుండా కవర్‌ చేయాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల(AP Elections 2024) నియమావళి అమల్లో అధికారులు చాలాచోట్ల పక్షపాతం చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను యుద్ధ ప్రాతిపదికన తొలగించిన యంత్రాంగం జగన్‌ ఫొటోతో ఉన్న సిద్ధం పోస్టర్లు చాలా వరకూ తొలగించలేదు. గుంటూరుజిల్లా పేరేచర్ల సచివాలయం 4, మందపాడు సచివాలయాల మీద సీఎం జగన్ బొమ్మలు అలాగే ఉన్నాయి. మేడికొండూరు రైతు భరోసా కేంద్రానికి ఉన్న వైసీపీ మూడు రంగులు తొలగించలేదు. పెదకూరపాడు నియోజకవర్గం నాగిరెడ్డి పాలెం సచివాలయంలో సీఎం జగన్ చిత్రాలు తొలగించలేదు. ధరణికోట ఒకటో సచివాలయం కార్యాలయం మీద జగన్ ఫోటో అలాగే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.