ETV Bharat / politics

అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 9:48 PM IST

Updated : Mar 18, 2024, 10:13 PM IST

YSRCP Leaders Violating Election Rules: ఎన్నికల సంఘం ఆదేశాలను వైసీపీ నేతలు బేఖాతరు చేస్తున్నా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు. చాలా చోట్ల స్వామిభక్తిలోనే మునిగి తేలుతూ ప్రతిపక్షాల బ్యానర్లను మాత్రమే తొలగిస్తోంది. వైసీపీ నేతలు డబ్బులు, చీరలు, గడియారాలంటూ ఓటర్లకు ఎర వేస్తున్నా వారిని పట్టించుకోవడం లేదు. ఇవాళ వైసీపీ నేతలు ఓటర్లకు తాయిలాలుగా ఇచ్చిన లిస్టులో నగదు, చీరలు, పరీక్ష రాసే అట్టలు.. ఇలా చాలా ఉన్నాయి.

ysrcp_campaign
ysrcp_campaign

YSRCP Leaders Violating Election Rules: రాష్ట్ర సచివాలయ అధికారులు యథేఛ్చగా ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను ఇంకా తొలగించ లేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అందించే ఏపీ స్టేట్ పోర్టల్​లో వైసీపీకు చెందిన నవరత్నాల పథకాల లోగో, సంక్షేమ పథకాల వివరాలు, లింకులు యథాతథంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన 48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలుంటాయని ఈసీ హెచ్చరించినా అధికార యంత్రాంగం ఖాతరు చేయట్లేదు.

ఎన్నికల కోడ్​ను పట్టించుకోని వైసీపీ నేతలు- ఏలూరులో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు

Chittoor District: వైసీపీ నేతల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన తారాస్థాయికి చేరింది. ఆఖరికి పదో తరగతి పిల్లలకు పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. చాలామంది విద్యార్థులు వాటితోనే పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. దీనిపై పలమనేరు ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా కచ్చితంగా అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రంలోనికి వాటిని అనుమతించరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీపీ మీడియా ప్రతినిధులు ఆర్డీవోకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని లేకుంటే మీ కథ చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.

కోడ్‌ అమలులో ఉన్నా నడిరోడ్డుపై వైసీపీ నేత ఎన్నికల ప్రచార సభ- వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

Nandyala: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా నంద్యాలలో పలుచోట్ల రాజకీయ నాయకుల చిత్రాలు, శిలాఫలకంపై పేర్లను మూసివేయలేదు. నంద్యాల సలీమ్ నగర్​లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఉన్న శిలాఫలకంపై పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, శాసన సభ్యులడు శిల్పా రవిచంద్ర కిషోర్​రెడ్డి ఇంటి పేర్లు అలానే వున్నాయి. రహదారి ప్రారంభ తరుణంలో వేసిన శిలాఫలకంపై ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల చిత్రాలను మూసివేయలేదు.

Sri Sathya Sai District: శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న శివకుమార్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే వైసీపీలో చేరారు. కదిరి వైసీపీ అభ్యర్థి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న శివకుమార్ రాజకీయ పార్టీలో ఎలా చేరుతారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులు స్పందించి వైసీపీలో చేరిన శివకుమార్​పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అప్రమ‌త్తమైన అధికారులు- ముమ్మరంగా ఫ్లెక్సీల తొలగింపు

YSR District: ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో నూర్ బాషా దూదేకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చీరలు పంపిణీ చేస్తామంటూ మహిళలను సభకు తరలించారు. గంటల తరబడి ఎండలో నిల్చోబెట్టి చీరలు ఇవ్వలేదు. టోకెన్లు ఉన్న మహిళలకు ఇళ్ల వద్దకే వచ్చి చీరలు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ నాయకుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి వైసీపీ నేతలకు వర్తించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు
Last Updated : Mar 18, 2024, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.