ETV Bharat / state

అజ్ఞాత హోర్డింగ్​లు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయొద్దు - రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు - EC INSTRUCTIONS ON POSTERS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 10:31 PM IST

EC_Gives_Some_Instructions_to_Political_Parties
EC_Gives_Some_Instructions_to_Political_Parties

EC Instructions to Political Parties : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు పేరు లేని, అజ్ఞాత హోర్డింగ్​లు, పోస్టర్​ల ద్వారా ప్రచారం చేసేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల సంబంధిత మెటీరియల్‌పైన ప్రింటర్, పబ్లిషర్‌ల స్పష్టమైన గుర్తింపు ఉండాలని స్పష్టం చేసింది. ప్రచారంలో పారదర్శకత నిర్ధారించేలా ఈసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

EC Instructions to Political Parties : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం పలు ఆదేశాలు జారీచేసింది. ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండటం కోసం, అలాగే ప్రచారంలో పారదర్శకత నిర్థారించేలా ఈసీ అన్ని రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. తద్వారా ప్రచారానికి అయ్యే వ్యయాన్ని నియంత్రించడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఉల్లంఘనలు లేకుండా చూసేందుకు అవకాశం ఉంటుందని ఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ నిఘా- రాష్ట్రంలో పరిస్థితులపై ప్రత్యేక పరిశీలకులు

పేరు లేని అజ్ఞాత హోర్డింగ్​లు, పోస్టర్​ల ద్వారా ప్రచారం చేసేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంబంధిత మెటీరియల్‌పై ప్రింటర్ పబ్లిషర్‌ల స్పష్టమైన గుర్తింపు ఉండాలని స్పష్టం చేసింది. ప్రచారంలో పారదర్శకత నిర్ధారించేలా భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

ప్రచారంలో పారదర్శకత కోసం ఈసీ ఆదేశాలు : మున్సిపల్ అధికారుల నియంత్రణలో ఉన్న హోర్డింగ్ స్థలాల్లో గుర్తింపు లేకుండా హోర్డింగ్‌లు ఉన్నాయని కమిషన్‌కు ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A ప్రకారం ప్రింటర్ లేదా ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు బ్యానర్‌లను ప్రదర్శించడం నిషేధిస్తున్నట్టు ఈసి ఆదేశాలు జారీ చేసింది.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తేదీని మార్చండి : నీట్ పరీక్ష దృష్ట్యా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ తేదీని మార్చాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ సీఈఓకి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు నిర్దేశించిన మే 5, 6 తేదీల్లో నీట్ పరీక్ష జరుగనున్న దృష్ట్యా పోస్టల్ బ్యాలెట్​ను వాయిదా వేయాలని కోరారు. పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్​ల కోసం కేటాయించిన మే 5 వ తేదీని మార్చాలన్నారు. మెప్మాలోని సీఎల్​ఆర్పీలు, ఆర్పీలపై ఓత్తిడి తెచ్చి పొదుపు సంఘాల మహిళలను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో నూతనంగా వచ్చిన ఓటర్ల జాబితాలోనూ తప్పులు దొర్లాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసారు.

హోంగార్డులు వైసీపీకు అనుకూలంగా పని చేస్తున్నారు : అలాగే ఉమ్మడి కడపజిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు వైసీపీకు అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో చాలామంది ప్రైవేటు వ్యక్తులను సెక్యూరిటీగా పెట్టుకున్నారన్నారు. వారందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డులుగా ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇపుడు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న హోంగార్డులు ఎన్నికల సందర్భంగా వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

వెంటనే ఉమ్మడి కడపజిల్లాలో ఉన్న హోంగార్డులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు అన్నమయ్యజిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు నాగ మునీంద్ర అనే వ్యక్తి పులివెందులలో నివాసం ఉంటూ వైఎస్సార్సీపీ తరపున ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలాగే నాగ మునీంద్ర అనే వ్యక్తి మార్చి 30వ తేదీన పులివెందుల రాజీవ్ నగర్ కాలనీలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలను ఎన్నికల సంఘానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పంపారు.

దొంగ ఓట్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు : తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసారు. అధికార వైఎస్సార్సీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే కుట్ర చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 36 వేల దొంగ ఓట్లు ఉన్నట్టు ఈసీకి ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలో అప్పటి రిటర్నింగ్ అధికారి గిరిషాను ఈసీ సస్పెండ్ చేసిందని గుర్తుచేసారు. కానీ ఆ దొంగ ఓట్లను మాత్రం జాబితా నుంచి తొలగించలేదని విమర్శించారు. వాటిని తక్షణం తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారినీ కోరామని బీజేపీ నేతలు వెల్లడంచారు.

ఎన్నికల వేళ నగదు​, బంగారాన్ని ఎంత తీసుకెళ్లొచ్చు? పోలీసుల సీజ్ చేస్తే ఏం చేయాలి?

ఎన్నికల విధులకు హాజరు కావాల్సిందే - ఇబ్బంది పెడుతున్నారంటున్న దివ్యాంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.