ఎన్నికల విధులకు హాజరు కావాల్సిందే - ఇబ్బంది పెడుతున్నారంటున్న దివ్యాంగులు - HANDICAPPED FIRE ON OFFICERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 3:47 PM IST
Disabled Persons Fire on Election Authorities: విభిన్న ప్రతిభావంతులమైన తాము ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరినప్పటికీ ఎన్నికల అధికారులు హాజరు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల విధులకు హాజరు అయ్యేందుకు శిక్షణ తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు ఇచ్చినట్టు వారు తెలిపారు. దీంతో వివిధ శాఖల్లో పని చేస్తున్న దివ్యాంగులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వేచి చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన దివ్యాంగుల సర్టిఫికెట్‌తోనే ఉద్యోగంలో చేరామని వారు చెబుతున్నారు. రెండు చేతులు లేకుండా ఒకరు సహాయం చేస్తే గానీ నడవలేని మమ్మల్ని ఎన్నికల విధుల్లో పాల్గొనాలని చెప్పటం చాలా బాధాకరమని దివ్యాంగులు పేర్కొన్నారు.
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సామన్య అసుపత్రి నుంచి దివ్యాంగ సర్టిఫికెట్ తీసుకురావాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ సర్టిఫికెట్‌ను అడగడం ఎంటో విడ్డురంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని మినహాయింపు ఇవ్వాలని దివ్యాంగులు కోరుతున్నారు.