ETV Bharat / state

విదేశీ వేదికలపై స్వదేశీ సంస్థలతో ఒప్పందాలు - పెట్టుబడులపై సీఎం జగన్‌ కట్టుకథలు - Foreign investments in Andhra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 7:27 AM IST

CM Jagan Government Lies on Foreign Investments: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పెట్టుబడులపై కట్టుకథలు చెబుతూ సీఎం జగన్‌ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టారు. విదేశీ వేదికలపై దేశీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వాటినే విదేశీ పెట్టుబడులుగా నమ్మించారు. వివిధ దేశాల్లో తిరిగి అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని డప్పు కొట్టారు. తీరా చూస్తే ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. జగన్‌ ప్రభుత్వం దెబ్బకి పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రావని అధఃపాతాళానికి జారిపోయింది. మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ సదస్సుల పేరిట ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం రూ. 50 కోట్లు నీటిపాలు చేసింది.

CM Jagan Government Lies on Foreign Investments
CM Jagan Government Lies on Foreign Investments

విదేశీ వేదికలపై స్వదేశీ సంస్థలతో ఒప్పందాలు - పెట్టుబడులపై సీఎం జగన్‌ కట్టుకథలు

CM Jagan Government Lies on Foreign Investments : రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల విషయంలో జగన్‌ ప్రభుత్వం కొత్త భాష్యం చెప్పింది. పెట్టుబడులకు సంబంధించి దేశీయ కంపెనీలైన అదానీ, అరబిందో, గ్రీన్‌కో సంస్థలతో రాష్ట్రంలోనే ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అలా కాకుండా వాటిని అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లి అక్కడ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకుని వాటినే దావోస్‌ నుంచి తెచ్చిన విదేశీ పెట్టుబడులు అంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు జగన్‌. తన అతితెలివి విధానాలతో జనాలను మోసం చేసి రాష్ట్రాన్ని నవ్వులపాలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులు వాకబు : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్‌తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. వివిధ రంగాలకు చెందిన 75 మందికి పైగా సీఈవోలు, రాయబారులతో భేటీ అయిందట. పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి వివరంగా చెప్పిందట. ప్రభుత్వం ఇంతగా శ్రమిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా రావాలి. పెట్టుబడిదారులు బారులుతీరాలి. కానీ, జగన్‌ సర్కారు ఇంతచేసినా రాష్ట్రానికి ఉత్సాహంగా వచ్చి పెట్టుబడులు పెట్టిన వారే లేరు.

ఎవరైనా రాష్ట్రానికి వచ్చినా పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వారికి లేదు. ప్రభుత్వం చెప్పిన చోటనే వాటిని ఏర్పాటు చేయాలి. లేదంటే వచ్చిన దారిలోనే వెళ్లిపోవాలి. పెట్టుబడుల కోసం ఇక్కడి దాకా వచ్చి బేరం కుదరక వెనక్కి వెళ్లిన పరిశ్రమలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఏం బాగోలేదంటగా అని అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులు వాకబు చేశారంటే వైసీపీ సర్కారు ఎంతటి అధమ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ చెప్పే విదేశీ పెట్టుబడుల కట్టుకథలకు ఇంతకంటే సాక్ష్యాలు కావాలా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెట్టుబడులకు జగన్ దెబ్బ - యువతకు శాపంగా మారిన వైసీపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ చతికిలబడితే - పొరుగు రాష్ట్రాలు పరుగులు : 2016-19 మధ్య దాదాపు 50 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ స్థాయీసంఘం పార్లమెంటుకు నివేదించింది. దేశంలోని 18 రాష్ట్రాలకు లక్షా 32 వేల 701 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. తర్వాతి నుంచి పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిందని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 అక్టోబరు నుంచి 2023 డిసెంబరు వరకు రాష్ట్రానికి వచ్చింది 6 వేల 743 కోట్ల 70 లక్షల రూపాయల విదేశీ పెట్టుబడులు మాత్రమే.

ఈ వ్యవధిలో దేశానికి 16 లక్షల 83 వేల 780 కోట్ల 24 లక్షల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ లెక్కన నాలుగేళ్లలో మన రాష్ట్రానికి వచ్చింది 0.40 శాతం మాత్రమే. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2023 సెప్టెంబరులో దేశంలో 13వ స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు నెలలు తిరిగేప్పటికి అంటే 2023 డిసెంబరు నాటికి మరో స్థానం దిగజారి 14వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విదేశీ పెట్టుబడుల సమీకరణలో ఆంధ్రప్రదేశ్‌ చతికిలబడితే మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, మహారాష్ట్ర పరుగులు తీస్తున్నాయి. తెలంగాణ 2019 అక్టోబరు నుంచి 2023 డిసెంబరు వరకు 55 వేల 672 కోట్ల 6 లక్షల పెట్టుబడులతో దేశంలో ఏడో స్థానంలో నిలిచింది.

పారిపోతున్న పరిశ్రమలు : రాష్ట్రం దాకా వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోతున్నా జగన్‌ సర్కార్ పట్టించుకోలేదు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించాలని అస్సలు ఆలోచించలేదు. ఒకటీ అరా వచ్చినా వాటినీ ప్రభుత్వమే దగ్గరుండీ వెళ్లగొట్టినంత పనిచేసింది. దుబాయ్‌కు చెందిన అలానా గ్రూప్‌ రాష్ట్రంలో రిటైల్‌ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు ఇక్కడకు వచ్చి స్థలాలను కూడా పరిశీలించింది. అనంతరం వెళ్లిన ఆ సంస్థ రాష్ట్రం వైపు కనీసం తొంగిచూడలేదు. గోల్డ్‌ ప్లస్‌ అనే సంస్థ 4 వేల కోట్ల పెట్టుబడితో నగరి ప్రాంతంలో అద్దాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని వచ్చింది. ఆ పరిశ్రమను పులివెందులలో గానీ, కొప్పర్తి పారిశ్రామిక హబ్‌లో గానీ ఏర్పాటు చేయాలంటూ అధికారులు కంపెనీ ప్రతినిధితో సంప్రదింపులు జరిపారు. అనంతరం సీఎంను కలవకుండానే వెళ్లిపోయారు. కేరళకు చెందిన కైటెక్స్‌ గార్మెంట్‌ పరిశ్రమ 3 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనతో వచ్చింది. దిల్లీలో పార్టీ వ్యవహారాలను చూసే ఓ నేత అడిగినంత కిక్‌ బ్యాగ్స్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అంతలోనే తెలంగాణ నుంచి ఆహ్వానం రావడంతో అక్కడికి వెళ్లిపోయింది.

ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం

జగన్‌ కట్టుకథలు : పెట్టుబడుల ఆకర్షణ కోసం వివిధ దేశాలు వెళ్లి అక్కడ సదస్సులు నిర్వహించిన జగన్‌ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడానికే పరిమితమైంది. గతంలో అనుమతులు ఇచ్చిన సంస్థలతో పదేపదే ఒప్పందాలు చేసుకుని భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రజలకు భ్రమలు కల్పించడానికే ప్రాధాన్యమిచ్చింది. విశాఖలో గతేడాది మార్చిలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ప్రభుత్వం వివిధ సంస్థలతో 13 లక్షల 12 వేల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది.

గతంలో అనుమతులు ఇచ్చిన అదానీ, అరబిందో, శిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్‌ సోలార్, గ్రీన్‌కో, జేఎస్‌డబ్ల్యూ సంస్థలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించింది. 2022 మే నెలలో దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొని లక్షా 26 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పింది. అందులో గ్రీన్‌కో 37 వేల కోట్లు, అరబిందో రియాల్టీ సంస్థ 28 వేల కోట్లు, అదాని సంస్థ 60 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. ఏస్‌ సంస్థ మచిలీపట్నంలో వెయ్యి కోట్లతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో ఏ ఒక్కటీ వాస్తవ రూపంలోకి రాలేదు.

ప్రచారాలకే పరిమితం : జర్మనీలోని హాన్‌ ఓవర్‌ మెస్సే ట్రేడ్‌ ఫెయిర్‌లో ఏబీబీ, ఎయిర్‌బస్, బోష్, జెస్సీ కర్ల్, ఫెస్టో, షెఫ్లర్‌ టెక్నాలజీస్‌ తదితర కంపెనీలతో సమావేశాలు జరిగాయి. ఈ కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన జాడే లేదు. రక్షణ రంగంలో వినియోగించే తూటాల తయారీ సంస్థ కంపెనీ ప్రతినిధులతో 2020 ఫిబ్రవరిలో లఖ్‌నవూలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ప్రభుత్వం చర్చలు జరిపింది. తర్వాత రాష్ట్రంలో దీని ఆనవాళ్లే కరవయ్యాయి. రక్షణ రంగ, ఏరోస్పేస్‌ క్లస్టర్‌పై విదేశీ కంపెనీలు ఆసక్తి చూపాయని బోయింగ్, ఎయిర్‌బస్, బీఏఈ సిస్టమ్స్, జాకబ్స్, లాక్‌హీద్‌ మార్టిన్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడిపై ఆసక్తి చూపాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. ఆ సంస్థలు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. మరెన్నో సంస్థలు తమ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయని అవి రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే పరిస్థితి నేతి బీర చందంగానే ఉంది.

డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌ : పరిశ్రమలు, సంస్థల్లో పెట్టుబడుల కోసం సీఎం జగన్‌ నేతృత్వంలోని అధికారుల బృందం దావోస్‌లో పర్యటించింది. అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, కుటుంబ యాజమాన్య పరిధిలోని ఫండింగ్‌ సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, తెలుగు ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం సీఎం జగన్‌ నేతృత్వంలో 2019 ఆగస్టులో డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. 34 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్‌ జనరల్స్‌ పాల్గొన్నారు.

యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌, యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థలతో సమావేశాలు నిర్వహించింది. యూకే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, తైవాన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా దేశాలకు చెందిన ఉన్నతస్థాయి విదేశీ ప్రతినిధులు వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించింది. ఇవే కాకుండా ప్రభుత్వం తరఫున పలువురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ దేశాల్లో పర్యటించి ప్రసిద్ధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వాటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చిన దాఖలా లేదు.

అధికారులు, ప్రజాప్రతినిధుల విహార యాత్రలు : పెట్టుబడుల ఆకర్షణ పేరిట నిర్వహించిన సమావేశాలు, పర్యటనలకు ప్రభుత్వం భారీగానే ప్రజాధనాన్ని వెచ్చించింది. ఐదేళ్లలో సుమారు 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఒక్క దావోస్‌ పర్యటనకే సుమారు 14 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం ఖర్చు చేసి పెట్టుబడులు తీసుకొచ్చారా? అంటే అదీ లేదు. ఈ పర్యటనలు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల విహార యాత్రలుగా మారాయి. పెట్టుబడుల ఆకర్షణ కోసం తలపెట్టిన పర్యటనలు, సమావేశాల్లో మరికొన్ని విచిత్ర సంఘటనలూ చోటుచేసుకున్నాయి.

తనను దావోస్‌ పర్యటనకు తీసుకెళ్లలేదని అలకబూనిన ఒక ఉన్నతాధికారిని అధికారుల బృందం జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వం తరఫున పంపి సంతృప్తి పరిచింది. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొనడానికి వెళ్లిన ఒక ఉన్నతాధికారి పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల కంటే బోటు పార్టీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దావోస్‌ వెళ్లిన బృందంలో ఓ అధికారి ఐటీసీ నుంచి టీ ఎందుకు తీసుకురాలేదని నానా యాగీ చేశారు. బంకర్‌ బెడ్‌ విషయంలో పైబెర్తు కావాలంటూ కొందరు అలిగినట్లు సమాచారం. దావోస్‌కు వెళ్లాల్సిన ప్రత్యేక విమానం ముంబై, ఇటలీ, లండన్‌ నగరాలను చుడుతూ ఎందుకు వెళ్లిందో సమాధానం దొరకని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.

జగన్‌ వైఫల్యం రాష్ట్రానికి శాపం - విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో వైఫల్యం: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.