ETV Bharat / sports

ఐపీఎల్‌ 2024 @10 డేస్​ - హిట్ ఫ్లాప్​​ ప్రదర్శనలు ఇవే! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 12:24 PM IST

ఐపీఎల్‌ 2024 @10 డేస్​ -  హిట్ ఫ్లాప్​​ ప్రదర్శనలు ఇవే!
ఐపీఎల్‌ 2024 @10 డేస్​ - హిట్ ఫ్లాప్​​ ప్రదర్శనలు ఇవే!

IPL 2024 Highlights : ధోనీ మాస్‌, కోహ్లీ క్లాస్‌, మయాంక్‌ బుల్లెట్‌ స్పీడ్​తో ఇలా ఐపీఎల్‌ సందడి కొనసాగుతోంది. ఐపీఎల్‌ ఫీవర్‌తో క్రికెట్ ప్రేమికులు ఊగిపోతున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ పేర్లతో స్టేడియాలు దద్దరిల్లిపోతున్నాయి. ఐపీఎల్ 2024 ప్రారంభమై పది రోజులు అవుతున్న సందర్భంగా ఇప్పటివరకు మ్యాచుల్లో టాప్ 5 ప్రదర్శన చేసిన హిట్, ఫ్లాప్ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.

IPL 2024 Highlights : ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమై పది రోజులైంది. క్రమంగా మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారిపోతున్నాయి. ఐపీఎల్‌ నుంచి క్రికెట్‌ ప్రేమికులకు ఫుల్‌ మజా అందుతోంది. ఊహించినట్లుగానే ఒక పక్క పరుగులు వరదతో మరోపక్క వికెట్ల వేటతో క్రికెట్‌ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఈ సందర్భంగా ఈ సీజన్​లో ఇప్పటివరకూ మెరిసిన ఆటగాళ్లు, తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దామా?

1‌) మయాంక్ యాదవ్ - అరంగేట్రం మ్యాచ్‌లోనే గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిని ఆకర్షించాడు నయా సంచలనం మయాంక్ యాదవ్‌(Mayank Yadav) . ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో బయటపడిన కొత్త పేసర్. 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను బంబేలెత్తించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్‌-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 12వ ఓవర్ తొలి బంతికి 155.8 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు.

2) విరాట్ కోహ్లీ - ఐపీఎల్ 2024ను విరాట్ కోహ్లీ అద్భుతంగా ప్రారంభించాడు. కింగ్‌ కోహ్లీ ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడి 181 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. పంజాబ్‌, కోల్‌కత్తాపై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. RCB మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయినప్పటికీ కోహ్లీ మాత్రం తన ఆటతీరుతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తున్నాడు.

3‌‌) రియాన్ పరాగ్ - రాజస్థాన్‌ తరపున ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ ఈ ఐపీఎల్‌లో భిన్నమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. మొదటి మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన పరాగ్‌ దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో రాయల్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరాగ్ ఫామ్‌లో ఉండటం రాజస్థాన్‌కు పెద్ద సానుకూలాంశం.

4) మహేంద్ర సింగ్ ధోనీ - చెన్నై సూపర్ కింగ్స్ , దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరిలో వచ్చిన ధోనీ సిక్సర్ల మోత మోగించాడు. సీఎస్కే జట్టు బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్న కొద్ది విశాఖ స్టేడియం ధోనీ ధోనీ అంటూ దద్దరిల్లిపోయింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ధోనీ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని తన వింటేజ్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. మొత్తం 16 బంతులు ఆడిన ధోనీ నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో 37 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. మ్యాచ్ ఓడినా ధోనీ ఎప్పటిలా మనసులు గెలుచుకున్నాడు.

5) రిషభ్‌ పంత్‌ - ఘోర రోడ్డు జరిగి దాదాపు ఏడాదిన్నర తర్వాత మైదానంలోకి అడుగు పెట్టి అదరగొట్టాడు రిషభ్‌ పంత్‌. మొదటి రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించిన అతడు తాజా మ్యాచ్​లో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడంతో మునుపటి పంత్‌ను గుర్తుకు తెచ్చాడు.

ఫ్లాప్స్‌
1‌)మిచెల్ స్టార్క్ - మిచెల్ స్టార్క్‌‌ను రికార్డు ధరకు కోల్‌కతా సొంతం చేసుకుంది. ఈ ఆస్ట్రేలియా పేసర్ కోసం రూ.24.75 కోట్లు కుమ్మరించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి పలికిన అత్యంత గరిష్ఠ ధర ఇదే. కానీ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేదు. కనీసం పొదుపుగా కూడా బౌలింగ్ చేయలేదు. ఎనిమిది ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకుని సెంచరీ కొట్టేశాడు. మొదటి రెండు మ్యాచుల్లో ఓవర్‌కు 12.50 పరుగుల ఎకానమీతో భారీగా పరుగులు ఇచ్చేశాడు.

2‌) హార్దిక్ పాండ్యా - గుజరాత్‌ సారథ్యం వద్దనుకుని హార్దిక్‌ పాండ్యా ముంబయి కెప్టెన్‌గా వచ్చాడు. పాండ్యా సారథ్యంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబయి ఓడిపోయింది. పాండ్యాపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి మళ్లీ గాడిన పడితే తప్ప హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు ఆగేటట్టు కనిపించడం లేదు. లేకపోతే పాండ్యాపై విమర్శల జడివాన మరింత పెరుగుతుంది.

3‌) ఫాఫ్ డు ప్లెసిస్‌ - బెంగళూరు అభిమానులు, మేనేజ్‌మెంట్‌ ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్‌ ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాడు. RCB మూడు మ్యాచ్‌లు ఆడింది, ఈ మ్యాచుల్లో డుప్లెసిస్ చేసింది మొత్తం కలిపి 46 పరుగులు మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన ఫాఫ్‌ తర్వాత రెండు మ్యాచుల్లో మరింత దారుణంగా విఫలమయ్యాడు.

4)అల్జారీ - వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను ఆర్సీబీ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది. అల్జారీ జోసెఫ్‌ పరుగుల సమర్పణ తెలిసి అతడి కోసం భారీగా వెచ్చించడంపై వేలం తర్వాత బెంగళూరు యాజమాన్యంపై కొన్ని విమర్శలు వచ్చాయి. అల్జారీ జోసెఫ్‌ కూడా ఆ మాటలు మరోసారి నిజం చేశాడు. పంజాబ్ పోరులో 4 ఓవర్లకు 43పరుగులు, సీఎస్‌కే మ్యాచ్‌లో 3.4 ఓవర్లలో 38 పరుగులు, కేకేఆర్ మ్యాచ్‌లో 24 బంతులకు ఏకంగా 34 పరుగులు అల్జారీ సమర్పించుకున్నాడు.

5 ) హర్షల్ పటేల్ - భారత ఆటగాడు హర్షల్ పటేల్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లు కుమ్మరించింది. కానీ హర్షల్ దిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 47 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్ వేసి 6 పరుగులకు ఏకంగా హర్షల్ 25 పరుగులు ఇచ్చాడు. ఇక ఆర్సీబీ, లఖ్​నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ల్లో చెరో 45పరుగులు ఇచ్చాడు. బెంగళూరుపై మాత్రం ఓ వికెట్ సాధించాడు. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు సాధించినప్పటికీ 10 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేస్తున్నాడు హర్షల్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.