ETV Bharat / sports

'రోహిత్‌ నాకు అండగా ఉంటాడు'- హిట్​మ్యాన్​ రిలేషన్‌పై హార్దిక్‌ కామెంట్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 9:26 PM IST

Hardik Pandya Rohit Sharma IPL
Hardik Pandya Rohit Sharma IPL

Hardik Pandya Rohit Sharma IPL: 2024 ఐపీఎల్​ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య సోమవారం ప్రెస్​మీట్​లో పాల్గొన్నాడు. ఈ మీట్​లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Hardik Pandya Rohit Sharma IPL: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ హిస్టరీలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని ఖాతాలో వేసుకుంది. మరోసారి ఫేవరెట్‌ టీమ్‌గా ఐపీఎల్ 2024లో బరిలో దిగనుంది. అయితే ప్రతిసారి ఐపీఎల్‌ కోసం ఆనందంగా, ఉత్సాహంగా ఎదురుచూసే ముంబయి ఇండియన్స్‌ అభిమానుల్లో ఏదో వెలితి. అదేంటంటే ఈ సీజన్‌లో ముంబయిని కెప్టెన్ హోదాలో నడిపించేది రోహిత్‌ శర్మ కాదు.

ఇటీవల ముంబయి మేనేజ్​మెంట్ రోహిత్‌ని కాదని పాండ్యాకి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. దీన్ని రోహిత్ ఫ్యాన్స్​ జీర్ణించుకోలేకపోయారు. ఇక గుజరాత్ టైటాన్స్‌కి రెండు సీజన్‌లు కెప్టెన్‌గా ఉన్న పాండ్యా ఈసారి ముంబకి సారథ్యం వహించనున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల, ప్రీ- సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాండ్యా పాల్గొన్నాడు. అక్కడ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

'మీరు ముంబై కెప్టెన్‌ కావడం వల్ల, రోహిత్‌ శర్మతో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఏదైనా ఛేంజ్‌ వస్తుందా?' అని మీడియా అడిగిన ప్రశ్నకు పాండ్యా సమాధానం ఇచ్చాడు. 'నాకు ఏ సమయంలో, ఏ సాయం చేయడానికైనా రోహిత్‌ సిద్ధంగా ఉంటాడు, అతడి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తా' అని చెప్పాడు.

అది సమస్యే కాదు: 'రోహిత్‌ భారత జట్టుకు కెప్టెన్ అని మీరు పేర్కొన్నారు. ఇది కూడా నాకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ జట్టు ఏది సాధించినా, అది రోహిత్‌ ఆధ్వర్యంలో సాధించినట్లే అవుతుంది.’ అని అన్నాడు. మీరు పేర్కొన్నది పెద్ద సమస్య కాదని, సీజన్‌ మొత్తం నా భుజాలపై చేతులు వేసి రోహిత్‌ నడిపిస్తాడు' అని పాండ్యా పేర్కొన్నాడు.

నా కెరీర్‌ అంతా రోహిత్‌ కెప్టెన్సీలోనే: 'ఇక నుంచి, ఏది సాధించినా అది అతడు ఇప్పటికే సాధించిన విషయం అవుతుంది. నేను దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి, ఏదైనా ఇబ్బంది కరంగా ఉంటుందని, భిన్నంగా ఉంటుందని నేను అనుకోను. మేం పదేళ్లుగా కలిసి ఆడుతున్నాం. నా కెరీర్ మొత్తం నేను రోహిత్‌ కెప్టెన్సీలోనే ఆడాను' అని చెప్పాడు.

2015-2021 మధ్యలో MIతోనే: 2015లో పాండ్య ముంబయి ఇండియన్స్​తోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముంబయి గెలిచిన 5 ఫైనల్స్​లో 4సార్లు పాండ్య జట్టులో సభ్యుడు. అయితే 2022 మెగా వేలానికి ముందు ముంబయి పాండ్యను వదులుకుంది. 30 ఏళ్ల పాండ్యని 2022 సీజన్‌కి గుజరాత్ టైటాన్స్‌ కొనుగోలు చేసింది. గుజరాత్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్య తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచాడు. 2023లోనూ వరుసగా రెండో సారి గుజరాత్‌ని ఫైనల్‌కి చేర్చాడు. కానీ దురదృష్టవశాత్తు చెన్నై సూపర్ కింగ్స్‌ కప్పు ఎగరేసుకుపోయింది.

పదేళ్ల తర్వాత రోహిత్‌! మరోవైపు, 2013లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ జట్టను విజయవంతంగా నడిపాడు. ఏకంగా ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచి, అత్యధిక సార్లు జట్టును ఛాంపియన్​గా నిలిపిన తొలి కెప్టెన్​గా రికార్డు కొట్టాడు. ఫైనల్‌లో అడుగుపెట్టిన ప్రతిసారి టైటిల్‌ గెలిచాడు. దాదాపు పదేళ్లు తర్వాత రోహిత్‌ కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా బరిలో దిగనున్నాడు.

IPLకు ముందే చెన్నైకి వరుస షాక్​లు- మరో స్టార్ ప్లేయర్ దూరం!

WPL 2024 శెభాష్ స్మృతి - వీడియో కాల్​లో కోహ్లీ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.