ETV Bharat / politics

పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాకు బీజేపీ కసరత్తు- ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 10:05 PM IST

BJP MP Candidates Second List : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ, అన్ని పార్టీల కంటే ముందుగానే 9 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల రాష్ట్ర పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఈనేపథ్యంలో రెండో జాబితా కోసం ఆశావహులు వెయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Telangana BJP Parliament Candidates
BJP MP Candidates Second List

BJP MP Candidates Second List : రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలకు గానూ ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ(BJP), రెండో విడుతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా? లేక కొన్ని స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాలా? అనే సందిగ్ధంలో పడింది. కొన్ని లోక్​సభ స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది.

అయితే ఈ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా చేరికలు పూర్తయితే మిగిలిన 8 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్​లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది.

Telangana BJP Parliament Candidates : ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. చేరిన ఒకట్రెండు రోజుల్లోనే ఇద్దరు నేతలు టికెట్ దక్కించుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? లేక పాత వారికి అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచివేస్తోంది. జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలె భాస్కర్ మెదక్(MEDAK) నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు.

భాష్కర్‌ తండ్రి ఆలె నరేంద్ర మెదక్ ఎంపీగా పనిచేశారు. దీంతో వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం కారణంగా ఆలె భాస్కర్ మెదక్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావు(Raghunandan Rao), అంజిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మిట్టపల్లి సురేందర్​కు పెద్దపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.పెద్దపల్లి టికెట్​ను పార్టీ సీనియర్ నేత, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ సైతం ఆశిస్తున్నారు.

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​ పోటీ

ఈపరిస్థితుల్లో రెండో జాబితాలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు చేరాక ఖమ్మం, మహాబూబాబాద్‌, నల్గొండ, పెద్ధపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది. అధిష్టానం పార్టీ సీనియర్లకు పెద్దపీట వేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​- వారణాసి నుంచి మోదీ పోటీ

రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వేలా నిలుస్తుంది : మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.