ETV Bharat / politics

అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 6:26 PM IST

Updated : Mar 17, 2024, 10:12 PM IST

PM_Narendra_Modi_Speech_in_Boppudi
PM_Narendra_Modi_Speech_in_Boppudi

PM Narendra Modi Speech in Boppudi: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

PM Narendra Modi Speech in Boppudi: ఎన్నికల శంఖారావం మోగాక తన తొలి సభ ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. "నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు.

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి ముందడుగు : దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలని, అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏను గెలిపించాలని కోరారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.

ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చాం: ఎన్డీఏ అంటే పేదల గురించి ఆలోచించేదని, పేదల కోసం పనిచేసేదని మోదీ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చామన్న మోదీ, పల్నాడు జిల్లాలో 5 వేల గృహాలు ఇచ్చామని తెలిపారు. జలజీవన్ మిషన్ కింద కోటి గృహాలకు ఇంటింటికీ నీరు ఇచ్చామని, ఆయుష్మాన్ భారత్ కింద కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు అందించామని మోదీ వెల్లడించారు.

శాండ్‌, ల్యాండ్‌, వైన్‌, మైన్‌, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు

ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేదే లక్ష్యం: ఎన్డీఏలో ఉన్న ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారని ప్రధాని మోదీ కొనియాడారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారన్న మోదీ, ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేది తమ లక్ష్యమన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌ నిర్మించామని, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామని మోదీ గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యాసంస్థలు స్థాపించామని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించామని అన్నారు.

ఇండియా కూటమి అంటే స్వార్థపరుల బృందం: ఇండియా కూటమి, దానిలోని పార్టీలు పరస్పర విరుద్ధంగా పనిచేస్తుంటాయని, కేరళలో కాంగ్రెస్‌, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతారని, దిల్లీలో కలిసిపోతారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి పరస్పర విశ్వాసాల ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మిత్రులను వాడుకుని వదిలేస్తుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి అంటే అవసరాలకు అనుగుణంగా పరస్పరం సహకరించుకునే స్వార్థపరుల బృందం అని దుయ్యబట్టారు.

రామాలయాన్ని జాతికి అంకితం చేసిన రోజున తెలుగు ప్రజలు ఇంటింటా రాముడికి స్వాగతం పలికారని మోదీ గుర్తు చేసుకున్నారు. అవతార పురుషులు రాముడు, కృష్ణుడిని తెలుగు సమాజంలో సజీవంగా ఎన్టీఆర్ ఉంచారని కొనియాడారు. ఎన్టీఆర్ పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి చేసిన అవమానంతోనే టీడీపీ పుట్టిందని తెలిపారు.

రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్‌

కాంగ్రెస్‌ను మట్టికరిపించిన చరిత్ర ఎన్టీఆర్‌ది: తెలుగుజాతిని అవమానాలు చేసిన కాంగ్రెస్‌ను మట్టికరిపించిన చరిత్ర ఎన్టీఆర్‌ది అని పేర్కొన్నారు. పీవీ విషయంలోనూ కాంగ్రెస్‌ అవమానకరంగా ప్రవర్తించిందని, పీవీని పార్టీలకు అతీతంగా ఎన్డీఏ గౌరవించి, గుర్తించిందన్నారు. దేశానికి సేవ చేసిన మహనీయుల విషయంలో ఎన్డీఏకు పార్టీలు, వైరుధ్యాలు ఉండవని, జాతి గర్వించదగిన ప్రతి మహా నాయకుడికి ఎన్డీఏ తలవంచి నమస్కరిస్తుందని తెలిపారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించామని, ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వెండి నాణెం విడుదల చేశామన్నారు.

రాష్ట్ర మంత్రులు ఒకరిని మించి ఒకరు: ఈ రాష్ట్రంలోని మంత్రులు అవినీతి, అక్రమాల్లో పరస్పరం పోటీపడుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర మంత్రులు ఒకరిని మించి ఒకరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారని భావిస్తున్నామని, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయడం ఒకటి అయితే, రెండోది ఈ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటం అని తెలిపారు. ఈ రెండు సంకల్పాలను మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలునిచ్చారు.

జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు: రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదని, రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతోందని మోదీ విమర్శించారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. జగన్ పార్టీ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, రెండు పార్టీల ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏకే అందరూ ఓటేయాలని కోరారు. వచ్చే ఐదేళ్లు డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు, ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి ముందడుగు పడుతుందని హామీ ఇచ్చారు. ఏపీలోని నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్రంలోని మహిళలకు, యువతకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు ప్రణాళికలు ఏర్పడతాయని భరోసా ఇచ్చారు.

ఎన్నికల పండుగ నిన్నటి నుంచి మొదలైందని, సభకు హాజరైన వారంతా మొబైల్​లో టార్చి లైటు వెలిగించి ప్రజాస్వామ్య పండుగకు స్వాగతం పలకాలని మోది కోరారు. ఈ వెలుగులు భారత అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధికి సూచికలుగా మారాలన్నారు. మరోవైపు అంతకుముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్​ మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న మోదీ, లైటు స్తంభాల నుంచి దిగిపోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాణాలు ఎంతో విలువైనవని, కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ప్రమాదాలు తమకు చాలా బాధ కలిగిస్తాయని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మాట్లాడుతుండగా పదేపదే మైక్ వ్యవస్థ పని చేయకపోవడంతో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఉత్సాహవంతులైన యువకులు మైక్ వ్యవస్థకు దూరంగా ఉండాలని కోరారు. మరోమారు మైక్ వ్యవస్థ ఆగిపోవడంతో గడచిన ఐదేళ్లలో ఏపీలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం లేకుండా పోయినట్టు తెలుస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

జనజాతరలా బొప్పూడి సభ - దారులన్నీ ప్రజాగళం వైపే

అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ
Last Updated :Mar 17, 2024, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.