ETV Bharat / politics

కేంద్ర ప్రాజెక్టులు వద్దు, మన ప్రాజెక్టులే ముద్దు- ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 12:52 PM IST

Jagan neglected central projects : రాష్ట్రం కోసం తపించడం అంటే ఎలా ఉండాలి? కేంద్రం నుంచి అదనంగా నిధులు రాబట్టాలి. ఇప్పటికే పట్టాలపై ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తిచేయాలి. కొత్త ప్రాజెక్టులు కావాలని వెంటపడి మరీ కేంద్రం నుంచి సాధించుకోవాలి. I.P.Sలు కావాలనో, నవోదయ విద్యాలయాలు ఇవ్వాలనో, ప్రత్యేక హోదా కల్పించాలనో హస్తినలో మంత్రాంగం నడపాలి. మరి జగన్‌ సర్కార్‌ ఏం చేస్తోంది? కొత్త ప్రాజెక్టుల మాటేమోగానీ తెలుగుదేశం హయాంలో పట్టాలెక్కించిన వాటినీ అడుగు ముందుకు కదల్చలేదు. రాష్ట్రానికి మేలు చేయడంలో విఫలమైంది. ఉద్యోగ, ఉపాధి అంశాల్లో వైఎస్సార్సీపీ సర్కార్‌ తీరని అన్యాయం చేసింది.

jagan_neglected_central_projects
jagan_neglected_central_projects

Jagan neglected central projects : కేంద్రం పథకాలను సద్వినియోగం చేసుకోవడం, కొత్త పథకాలకు నిధులు రాబట్టడం రాష్ట్ర పాలకులకు ఓ మైలురాయి లాంటిది. ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఐదేళ్లలో ఏం చేశారు? ‘'దేవుడు వరమిచ్చినా' అన్న చందంగా ఉంది వైసీపీ సర్కార్‌ తీరు. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడంలోనూ విఫలమైంది. నిధుల భారం అసలే లేదు. అనుమతుల విషయంలో ఇబ్బందులూ లేవు. కావాల్సిందల్లా చొరవ. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవడమనేది ముఖ్యం. జగన్‌ సర్కారులో ఇవే లోపించాయి. కేంద్రం పచ్చజెండా ఊపిన ప్రాజెక్టులతో రాష్ట్రానికి భారీగా లబ్ధి జరగనుంది. స్థానికులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్ర ఖజానాకు ఆదాయమూ సమకూరనుంది. భారీ మేలు చేకూర్చే ఇలాంటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. నిత్యం సమీక్షలు, పనుల పర్యవేక్షణతో అధికారులకు దిశానిర్దేశం చేయాలి. ఎప్పటికప్పుడు యుటిలిటీ బిల్స్‌-UCలను కేంద్రానికి పంపుతూ నిధులు రాబట్టుకోవాలి. ఇలాంటి చర్యలు పాలనాదక్షతకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ మాత్రం పనులు కూడా సీఎం జగన్‌ ఈ ఐదేళ్లలో చేయలేకపోయారు. కేంద్ర ప్రాజెక్టులపై ఆయన ఒక్కసారి కూడా సమీక్షించింది లేదు. ఫలితంగా రాష్ట్రంలో కీలకమైన పనుల్లో కొన్ని పడకేస్తే, మరికొన్ని ఒక్క అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు ఆగుతూ సాగుతూ ఉన్నాయి.

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

కేంద్ర ప్రాజెక్టుల విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న జగన్‌ సర్కారు రాష్ట్రంలోని వనరులను అస్మదీయులకు దోచిపెట్టే ప్రాజెక్టులకు మాత్రం ఆగమేఘాల మీద అనుమతులు ఇస్తోంది. నిబంధనలు అడ్డుగా ఉంటే వాటిని కూడా మార్చేస్తోంది. క్వారీలు, స్మార్ట్‌ మీటర్లు, బొగ్గు టెండర్లు, విద్యుత్‌ ప్రాజెక్టులు ఇలా కమీషన్లు, భారీగా ముడుపులు, వాటాలు వచ్చే వాటిని అడ్డగోలుగా కావాల్సిన వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారు. వాటిపై ఉన్న శ్రద్ధలో కొంత కూడా కేంద్ర ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో జగన్‌ చూపలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల టెండరు విధివిధానాలు, పనుల కేటాయింపు, నిధుల వినియోగం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. అలాంటప్పుడు సొంత ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయి మరి? ఏ పనిలో అయినా సొంత ప్రయోజనాన్ని వెతుక్కోడానికి అలవాటు పడిన జగన్‌ కేంద్ర ప్రాజెక్టులను పక్కనపెట్టారు. అవి పూర్తయితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను పక్కనబెట్టారు. వస్తే రానీ.. పోతే పోనీ అనే రీతిలో వ్యవహరించారు. తమ హయాంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం ఎలాగూ చేతకాదు. కనీసం గత ప్రభుత్వం తంటాలు పడి తెచ్చిన ప్రాజెక్టులనూ జగన్‌ సర్కార్‌ ముందుకు తీసుకెళ్లలేకపోయింది.

అభివృద్ధి కోసం అయితే అప్పు వద్దు - జగన్‌ సర్కార్ తీరుపై అధికారుల విస్మయం

సీఎం హోదాలో సొంత జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్కు (Integrated Textile Park)ను సాధించడం ముఖ్యమంత్రి జగన్‌కు చేతకాలేదు. ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి మంజూరు చేసేలా కేంద్రాన్ని ఒప్పించలేకపోయారు. టెక్స్‌టైల్‌ పార్కు కోసం.. రాష్ట్రం తరఫున అధికారుల బృందం దిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందించింది. కేంద్రం సానుకూలంగా స్పందించిందని, రాష్ట్రానికి ప్రాజెక్టు వస్తుందని హడావుడి చేశారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కులో 1,186 ఎకరాలు అందుబాటులో ఉన్నాయంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన హడావుడి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడంతో నిజమేనని పారిశ్రామికవేత్తలూ నమ్మారు. రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించిందన్న విషయాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదు. ఇంకా టెక్స్‌టైల్‌ పార్కు వస్తుందన్న భ్రమల్లోనే ప్రజలను ఉంచింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలోనూ ఇదే తరహా హడావుడి చేసిన జగన్​ స్వయంగా తానే రెండుసార్లు శంకుస్థాపన చేసిన పరిశ్రమకే ఇప్పటికీ అతీగతీ లేదు.

సీఎం జగన్ అయిదేళ్ల పాలన ఎలా ఉంది? - చెప్పింది చేశారా?

కేంద్రం అనుమతించిన బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు ప్రతిపాదనా ముందుకు కదల్లేదు. ఈ ప్రాజెక్టును తొలుత కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు అవసరమైన అన్ని అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నారు. బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల(Bulk drug industry) ఏర్పాటులో ఇప్పటికీ ఎలాంటి కదలిక లేదు. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌- నిమ్జ్‌ ఏర్పాటుకు గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తెచ్చింది. భూములనూ సేకరించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సుమారు 4 లక్షల 37 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. సుమారు రెండున్నర లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని డీపీఆర్‌ తయారుచేసిన వాయంట్స్‌(Viants) సంస్థ పేర్కొంది. నిమ్జ్‌ కోసం సుమారు 14 వేల 346 ఎకరాలు అవసరమని పేర్కొంది. అందులో 7 వేల735 ఎకరాలను గత ప్రభుత్వమే సేకరించింది. మాస్టర్‌ ప్లాన్‌ తయారీని పూర్తిచేసింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైంది. ఐదేళ్లలో ప్రాజెక్టు ఒక్క అడుగూ ముందుకు కదల్లేదు.

సిద్ధం సభల కోసం వైసీపీ వందల కోట్ల వ్యయం- అధికార దుర్వినియోగంపై విమర్శల వెల్లువ

సీబీఐసీ ప్రాజెక్టులో భాగంగా నెల్లూరు జిల్లాలో క్రిస్‌ సిటి ప్రాజెక్టును 5 ఏళ్లలో పట్టాలెక్కించడం జగన్‌ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దశల వారీగా వచ్చే 20 ఏళ్లలో 4.68 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఇంత పెద్దమొత్తంలో ఉపాధి వచ్చే ప్రాజెక్టులను ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం చేస్తుందా? జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తీరిగ్గా కూర్చుని ఎన్నికలకు ముందు టెండర్లు ఖరారు చేయడానికి హడావుడి పడుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రిస్‌ సిటి అభివృద్ధికి టెండర్లు ఖరారు చేసి కొద్ది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెబుతోంది. ఎన్నికల ప్రకటన విడుదలైతే పనులు కేటాయించే అవకాశం ఉంటుందా? ఈ విషయం ఘనత వహించిన జగన్‌ సర్కారుకే తెలియాలి.

కేంద్ర ప్రాజెక్టులు వద్దు, మన ప్రాజెక్టులే ముద్దు- ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీరని అన్యాయం చేసిన జగన్​ సర్కార్​

జాతీయ ప్రాజెక్టులపై జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం- అటకెక్కిన రైల్వే ప్రాజెక్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.