ETV Bharat / politics

'చేనేత' ఇక గతమేనా?- మగ్గం నేసిన చేతులు మట్టి పనుల్లో! - Handloom workers Problems

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 1:48 PM IST

Handloom workers Problems : చేనేత అంటే ఆంధ్రప్రదేశ్‌కు తలమానికం. వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం ఇలా ఊరేదైనా ప్రతీచోటా మగ్గాలపై నేసే చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అలాంటి చేనేత రంగాన్ని సీఎం జగన్‌ ఛిద్రం చేశారు. మహర్దశ తెస్తానంటూ మగ్గాన్నే విరిచేశారు. రాయితీలు నిలిపివేసి, పింఛన్లకు కోతలు వేసి జగన్‌ చేసిన నమ్మకద్రోహానికి మగ్గాలు నడిపిన చేతులు ఆటోలు నడుపుతున్నాయి. పట్టుచీరలు నేసిన హస్తాలు మట్టి పనిచేస్తున్నాయి.

handloom_workers_problems
handloom_workers_problems

Handloom workers Problems : రాష్ట్రంలోని చేనేత కుటుంబాల్ని పలకరిస్తే ఇలాంటి వాళ్లు ఇంటికొకరు కనిపిస్తారు! కొందరు హోటళ్లలో పనికి వెళ్తుంటే ఇంకొందరు పొట్టకూటి కోసం కూలికి పోతున్నారు. ఈ కళ తమతోనే అంతరించిపోతుందేమో అన్నది నేతన్నల ఆందోళన.

మగ్గానికి మహర్దశ తెస్తామంటూ మభ్యపెట్టిన జగన్‌ అధికారంలోకి రాగానే నేతన్నల వెన్నువిరవడమే ఈ దుస్థితికి కారణం! పట్టు మగ్గాలకు ఇస్తున్న రాయితీని ఎత్తేశారు. నేత చీరలకు మార్కెటింగ్‌ సహకారం అందకుండా చేశారు. ముడి సరకు ధరలు పైపైకి ఎగబాకుతున్నా కట్టడి చేయలేదు. గత ఎన్నికల్లో వడ్డీలేని రుణాలు అందిస్తామన్న హామీపైనా జగన్‌ నాలుక మడతేశారు. ఆఖరుకు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే వారికి కొత్తగా పింఛన్‌ మంజూరు చేసేందుకూ నిబంధనల కొర్రీలు వేశారు. సొంత మగ్గాలున్న వారికి ఏడాదికి ఒకసారి నేతన్న నేస్తమంటూ బటన్‌ నొక్కడమే తప్ప వృత్తి రీత్యా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు.

మరోసారి పెద్ద మనసును చాటుకున్న చంద్రబాబు- చేనేత ఆత్మహత్య కుటుంబానికి అన్నీ తానై ఉంటానని భరోసా - CBN Support to suicide Family

రాష్ట్రవ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాల్లో మూడున్నర లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరంతా 800కిపైగా చేనేత సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఒక్కోదానిలో వంద నుంచి వెయ్యి మంది వరకూ ఉన్నారు. చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్‌ ఇన్సెంటివ్‌ పథకాన్ని అమలు చేశాయి. చేనేత సొసైటీ ద్వారా జరిగే అమ్మకాల ప్రాతిపదికగా దీన్ని కొనసాగించారు. మూడేళ్ల సరాసరి అమ్మకాలను తీసుకుని దానిపై 10శాతం రాయితీ ఇచ్చేవారు. ఫలితంగా ఒక్కో సంఘానికి 8 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకూ లబ్ధి చేకూరేది. జగన్‌ దీన్ని పూర్తిగా నిలిపేసి కార్మికుల ఉపాధికి గండికొట్టారు. ఆ పథకాన్ని పునరుద్ధరించాలని చేనేత సంఘాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించలేదు.

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తాం - మంగళగిరిలో లోకేశ్‌ హామీ - Lokesh Meet Handloom Weavers

పట్టు చీరల కార్మికులకు ముడిసరకు రాయితీ అత్యంత కీలకం. దీనిని కూడా జగన్‌ నిలిపేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మొదట్లో ఒక్కో కార్మికునికి నెలకు కిలోకు 200 చొప్పున ఆరు కిలోలపై 1200 రూపాయలు రాయితీగా ఇచ్చింది. అంటే ఏడాదికి 14 వేల400 అందించినట్టే. ఆ తర్వాత ముడిసరకు ధరలు పెరిగాయని గుర్తించి 2018-19లో నెలకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని 2వేల రూపాయలకు పెంచింది. అంటే ఏడాదికి మగ్గం నేసే కార్మికుడికి 24 వేల రూపాయలు రాయితీగా ఇచ్చింది. ముడిసరకు రాయితీ పథకాన్ని అమలు చేస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్‌ వారి ఓట్లతో గెలిచాక మడమ తిప్పేశారు.

చేనేత కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు గతంలో త్రిఫ్ట్‌ పథకం అమలైంది. నేత కార్మికుడు తన నెలవారీ ఆదాయంలో 8శాతం పొదుపు చేసుకుంటే, ప్రభుత్వం దానికి సమానంగా 8శాతం చెల్లిస్తుంది. మొదట్లో ఈ ఎనిమిది శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 4శాతం చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 8% తానే భరిస్తానని హామీ ఇచ్చింది. ఇది నేతన్నలకు మేలు చేసేదే అయినప్పటికీ జగన్‌ దీన్ని అమలు చేయలేదు. ఇవన్నీ నిలిపేసిన జగన్‌ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్తున్నారు. ఐతే ఆ పథకాన్నీ సొంత మగ్గం ఉన్న వారికే పరిమితం చేశారు. అర్హులైన కూలి మగ్గం నేసే వారికి వర్తింపచేయలేదు. ఫలితంగా నేతన్నలు లక్షల సంఖ్యలో ఉంటే లబ్ధిదారుల సంఖ్య వేలల్లోనే ఉండిపోయింది.

ఇక చేనేత వృత్తికి GST పెద్ద గుదిబండగా మారింది. నూలుపై 5%, రంగుపై 18%, రసాయనాలపై 18% జీఎస్టీ అమలవుతోంది. డిజైన్‌ పంచింగ్‌ కార్డులు, రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ విధిస్తున్నారు. ఫలితంగా చేనేతలో ఉత్పత్తి ఖర్చు అమాంతం పెరిగి అమ్మకాలు తగ్గాయి. మాస్టర్‌ వీవర్లు కూలీలకు పని ఇవ్వడాన్ని తగ్గించారు. నెలలో 10 నుంచి 15 రోజులు కూడా ఉపాధి దొరకక చాలామంది నేతన్నలు కుటుంబ పోషణ కోసం ఇతర పనుల బాట పడుతున్నారు.

సుబ్బారావు కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: టీడీపీ - Subbarao Family Suicide Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.