ETV Bharat / politics

వాలంటీర్లను తొలగించం- వివేక హత్యపై పూటకోమాట! చర్చకు సిద్దమా ?: చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 8:26 PM IST

Chandrababu Raa Kadali Ra Meeting: అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించమని చంద్రబాబు ప్రకటించారు. వారు వైసీపీకి సేవ చేయొద్దని సూచించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలి రా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టీడీపీ కార్యకర్తలను వేధించిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేక హత్యపై తాను చర్చకు సిద్దమని, పూటకోమాట మారుస్తూ పిల్లిమొగ్గలేస్తోంది ఎవరని చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu_Raa_Kadali_Ra_Meeting
Chandrababu_Raa_Kadali_Ra_Meeting

Penukonda Chandrababu Raa Kadali Ra Meeting: టీడీపీ-జనసేన కలిసింది స్వార్థం కోసం కాదని, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు అని చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలి రా బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని బాబు పేర్కొన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాకి కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించామని, 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందని ప్రశ్నించారు. కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయని, కియా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామన్న చంద్రబాబు, అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టం అని అన్నారు. అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు. అనంతపురంలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు, సాగునీరు ఇస్తే చాలని రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని తెలిపారు. బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలని, అనంతపురం జిల్లాలో పళ్లు, కూరగాయలు బాగా పండుతాయని అన్నారు. తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేదని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్‌ వ్యవస్థను ధ్వంసం చేయడం జగన్ మార్కు అని ధ్వజమెత్తారు.

సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్

స్కీమ్‌ల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్‌: స్కీమ్‌ల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు విమర్శించారు. తాము ఉన్నప్పుడు మెగా సోలార్ ప్రాజెక్టును తెచ్చామని, అనంతపురం జిల్లాలో సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచామని అన్నారు. తాము వచ్చాక రైతులకు ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తాము ఎప్పుడూ భావితరాల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తానన్న చంద్రబాబు, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా చేయాలనేది తన సంకల్పం అని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని, మన యువత ఎంతో తెలివైనవాళ్లు అని, వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే, జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు: రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్ చెప్పాలని, ఈ ఐదేళ్లలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా అని ప్రశ్నించారు. రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలని, వృద్ధులకు పింఛను ఇవ్వడం ప్రారంభించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. హైదరాబాద్, బెంగళూరు వెళ్లిన వారికి పింఛన్లు కట్ చేస్తున్నారన్న చంద్రబాబు, తాము అధికారంలోకి వస్తే ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లిన వారికీ పింఛను ఇస్తామని అన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించిన చంద్రబాబు, తాను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు అని, జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు అని ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు - మాలో విభేదాలు సృష్టించలేరు : చంద్రబాబు

ఎవరు చంపారో చెప్పాల్సిన బాధ్యత జగన్‌కు లేదా: అభివృద్ధిలో తమ పార్టీతో పోల్చుకోవద్దని జగన్‌ను కోరుతున్నానన్నారు. వివేకా హత్య కేసులో అనేక పిల్లిమొగ్గలు వేసింది ఎవరు అని ప్రశ్నించారు. వివేకాను ఎవరు చంపారో చెప్పాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని నిలదీశారు. తమ కార్యకర్తలను వేధించేవారిపై చర్యలు తప్పవన్న చంద్రబాబు, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి దందాలు, దౌర్జన్యాలు పెరిగాయని మండిపడ్డారు. తోపుదుర్తి లెక్కలన్నీ తన వద్ద ఉన్నాయని, అకౌంట్స్ సెటిల్ చేస్తానని హెచ్చరించారు. జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని, కారకులు ఎవరని ధ్వజమెత్తారు. ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు, ఎర్రగుట్టను మింగేసిన వ్యక్తి కేతిరెడ్డి అని విమర్శించారు.

వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది: తాము అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, ఎవరి ఉద్యోగం తీసేయం అని చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చెత్తపన్ను, ఇంటిపన్ను, మద్యం ధరలు పెంచారని మండిపడ్డారు.

ఉప్పలపాడు రీచ్‌ నుంచి బెంగళూరు, చెన్నైకు ఇసుక తరలిస్తున్నారన్న చంద్రబాబు, లేఅవుట్ వేస్తే చాలు ఇక్కడి నేతలకు రూ.10 లక్షలు కప్పం కట్టాలని ఆరోపించారు. బెంగళూరు-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ తీసుకువస్తామని, పేరూరు ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాకు అనేక అనుబంధ పరిశ్రమలు తెస్తామని, రాష్ట్రాభివృద్ధికి మీరు 10 అడుగులు వేస్తే మేం వంద అడుగులు వేస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.

'సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- క్విట్‌ జగన్‌'! 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు

Balakrishna Speech at Raa Kaldali Ra Meeting: రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పరిపాలన నడుస్తోందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పింది దివంగత ఎన్టీ రామరావు అని కొనియాడారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ అంటూ యువతను సీఎం జగన్‌ మోసం చేశారన్నారు. సిద్ధం పేరుతో రాష్ట్రంలో ఆరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద బలం అని స్పష్టం చేశారు. అప్పులు చేయకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్న బాలకృష్ణ, వైసీపీ పాలనలో భూకబ్జాలు, ఇసుక మాఫియా పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తేలేకపోయారని, కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు. తల్లి, చెల్లెలికి సమాధానం చెప్పేందుకే జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు.

టీడీపీ-జనసేన విన్నింగ్‌ టీమ్‌ - వైఎస్సార్సీపీ చీటింగ్‌ టీమ్‌: చంద్రబాబు

వాలంటీర్లను తొలగించం - పెనుకొండ రా కదలి రా సభలో చంద్రబాబు హామీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.