ETV Bharat / politics

చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం - అభ్యర్థిని నిలిపే అంశంపై సందర్భానుసారం నిర్ణయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 9:28 AM IST

Chandrababu Chairs TDP Legislative Party Meeting: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉంది. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిద్దామన్న చంద్రబాబు సందర్భానుసారం నిర్ణయం తీసుకుందామని నేతలతో అన్నట్లు సమాచారం. పాదయాత్ర, ఎన్నికల మ్యానిఫెస్టోలో మొత్తం 730 హామీలిచ్చిన జగన్‌ వాటిలో 621 అసలు అమలే చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

tdp_meeting
tdp_meeting

చంద్రబాబు అధ్యక్షకన టీడీఎల్పీ సమావేశం - అభ్యర్థిని నిలిపే అంశంపై సందర్భానుసారం నిర్ణయం

Chandrababu Chairs TDP Legislative Party Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. నేటి నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంపైనా చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పరిణామాల్ని నిశితంగా గమనిద్దామని, పార్టీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టే అంశంపై సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నట్లు సమాచారం.

డీఎస్పీల బదిలీలు అందుకే - లక్షీశపై మాకు నమ్మకం లేదు : సీఈసీకి అచ్చెన్న లేఖ

జగనన్న కాలనీలు, సెంటు భూమి పేరుతో పేదల్ని జగన్‌ మోసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక పేదలకు మెరుగైన సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడదామని చంద్రబాబు తెలిపారు. ఆ సందర్భంగానే ఆయన రెండు సెంట్ల ప్రతిపాదన చేశారు. దీని సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి మేనిఫెస్టోలో చేరుద్దామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే మూడు రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి మేనిఫెస్టో కమిటీతో కూర్చుని సూచనలు, సలహాలు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేద్దామని, ప్రజలకు మెరుగైన సేవలందించేలా తీర్చిదిద్దుదామని ఆయన అన్నట్లు తెలిసింది.

శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జగన్‌ ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగం ద్వారా ప్రజలకు అవాస్తవాలు చెబుతుందని, వాటిని తీవ్రంగా ఖండించాలని సూచించారు. ఈ సమావేశాలే చివరివి కాబట్టి ప్రభుత్వాన్ని సభలోను, బయట గట్టిగా నిలదీయాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ముందు నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు.

రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్ పోవాలి: చంద్రబాబు

జగన్‌ మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామంటూ అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్నారని, రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విఫల ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేస్తున్న జగన్‌కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ‘ప్రజాకోర్టు’ పేరుతో జగన్‌ నెరవేర్చని హామీలపై టీడీపీ తయారుచేసిన ఛార్జిషీట్‌ను ఆయన విడుదల చేశారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీపై ఇప్పుడు జగన్‌ ఒక్క మాటా మాట్లాడటం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచబోనని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ సీఎం అయ్యాక మడమ తిప్పేశారు. ప్రజలపై 64 వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు.

సింహపురి స్త్రీ శక్తి వేదికపై గళమెత్తిన తెలుగు మహిళ - జగన్ నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు

జగన్ అధికారంలోకి రాకముందు మద్య నిషేధమని హామీ ఇచ్చి, మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్ల రుణం తెచ్చారని అన్నారు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన జగన్‌ దాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపారని విమర్శించారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పి, అప్పట్లో తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నారన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలును గాలికొదిలేశారని తూర్పారబట్టారు. హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.