పాతకాలం నాటి "వట్టి తునకల కూర" - ఇలా చేస్తే గరం మసాలా అవసరం లేదు - బాలింతలు, పెద్దలకు చాలా మంచిది!
- ఆరోగ్యానికి బలాన్నిచ్చే వట్టి తునకల కూర - అద్దిరిపోయే రుచితో చాలా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్!

Published : May 14, 2025 at 2:08 PM IST
Tasty Vatti Tunakala Kura: నేటి జనరేషన్లో చికెన్, మటన్, ఫిష్‌ను ఎలా తినేవారో, అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు ఓ కూరను చాలా ఇష్టంగా తినేవారు. అదే "వట్టి తునకల కూర". పూర్వం ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు మిగిలిన పచ్చి మటన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటికి ఉప్పు, పసుపు పట్టించి ఎండలో ఎండబెట్టేవారు. లేదంటే కూర వండిన తర్వాత అది మిగిలిపోతే శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేవారు. సుమారు వారం రోజుల తర్వాత ముక్కల కరకరలాడేలా ఎండుతాయి. అప్పుడు వాటిని తీసి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం వరకు వచ్చేవి. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా, దోసకాయ వంటి ఇతర కూరగాయలు ఉపయోగించి ఈ వట్టి తునకల కూర చేసుకునే వారు. ఈ కూర కేవలం రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పట్లో బాలింతల శరీరం గట్టిపడడానికి, వారు త్వరగా కోలుకోవడానికి, పాలు బాగా పట్టడం కోసం ఈ కూరను పెట్టేవారు. మరి లేట్ చేయకుండా ఈ వట్టి తునకల కూర ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు : ఒకవేళ మీ దగ్గర వట్టి తునకలు ఉంటే డైరెక్ట్ కూర చేసుకోవచ్చు. మీ దగ్గర ఇవి లేకపోతే మటన్‌ను ఎండబెట్టుకోవాలి. అది ఎలాగంటే,
మటన్ ఎండబెట్టుకోవడానికి:
- బోన్‌లెస్ మటన్ ముక్కలు - కేజీ
- ఉప్పు - టేబుల్ స్పూన్
- పసుపు - టీస్పూన్
తయారీ విధానం :
- మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి వడకట్టాలి. నీళ్లు పూర్తిగా వడకట్టిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఓ పెద్ద ప్లేట్లోకి మారినేట్ చేసిన మటన్ ముక్కలను విడివిడిగా ఉంచి బాగా ఎండేంతవరకు ఎండలో ఉంచాలి. మటన్ ముక్కలు పూర్తిగా ఎండడానికి దాదాపు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది.
- ఇలా పూర్తిగా ఎండిపోయిన మటన్ ముక్కలను ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వట్టి తునకలు రెడీ. ఇక ఇవి ఏడాది వరకు నిల్వ ఉంటాయి. ఈ ముక్కలతో కూర చేసుకోవాలి.
కూర కోసం :
- వట్టి తునకలు - కప్పు
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు - 3
- పచ్చిమిర్చి - 8
- కరివేపాకు - 2 రెమ్మలు
- టమాటాలు - 3
- రుచికి సరిపడా - ఉప్పు
- మామిడి తురుము - పావు కప్పు
- కారం - తగినంత
- పసుపు- పావు టీస్పూన్
- ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్
- దంచిన వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- నీరు - 1 కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి వట్టి తునకలు తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి అర గంట సేపు నానబెట్టాలి.
- ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి నానిన వట్టి తునకలను నీళ్లతో సహా వేయాలి. ఆ తర్వాత ముక్కలు మునిగేంతవరకు నీళ్లు పోసి మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి.
- ఇవి ఉడికే లోపు కూరకు అవసరమైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
- ముక్కలు ఉడికి కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిగ్గా కుక్ అవ్వకపోతే మరో రెండు విజిల్స్ ఉడికించుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి లో ఫ్లేమ్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.
- టమాటాలు ఉడికిన తర్వాత మామిడి తురుము వేసి మరో 5 నిమిషాలు కలుపుతూ మగ్గించాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా కారం, పసుపు వేసి ఉడికించిన వట్టి తునకలను నీళ్లు లేకుండా వేసి కలుపుతూ సుమారు 5 నిమిషాల పాటు మగ్గించాలి.
- వట్టి తునకలు నూనెలో మగ్గిన తర్వాత ధనియాల పొడి, వెల్లుల్లి తురుము వేసుకుని మరో 5 నిమిషాలు మగ్గించి మటన్‌ను ఉడికించిన నీళ్లు, మరో కప్పు మామూలు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి.
- 5 నిమిషాల తర్వాత మంటను సిమ్‌లో పెట్టి మరో 10 నిమిషాలు అంటే కూర కాస్త దగ్గరపడేవరకు ఉడికించాలి.
- కూర కాస్త చిక్కగా మారిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ వట్టి తునకల కూర రెడీ.
చిట్కాలు:
- మటన్ ముక్కలు బాగా ఎండితేనే కూర వండినప్పుడు రుచిగా ఉంటుంది.
- ఈ కూరకు కాస్త నూనె ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి.
- ఇందులో మామిడి తురుము వేసుకున్నాం. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే వంకాయలు కూడా ఇందులో వేసి వండుకోవచ్చు.
నీచు వాసన లేకుండా "చేపల ఇగురు" - ఈ పద్ధతిలో చేస్తే చిక్కటి గ్రేవీ - చింతపండు అవసరమే లేదు!

