No Onion No Tomato Curry in Telugu : నార్మల్‌గా మనం ఏ కూర చేసుకున్నా అందులో ఉల్లిగడ్డ, టమాటా తప్పనిసరిగా వేస్తుంటాం. అవి వేయడం ద్వారా కర్రీకి గ్రేవీ, మంచి టేస్ట్ వస్తుంది. కానీ, మీకు తెలుసా? అవేమి లేకుండానూ అద్దిరిపోయే రుచితో సింపుల్‌గా చేసుకునే ఒక సూపర్ రెసిపీ ఉంది. అలాగే, అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు. కూరగాయలు లేనప్పుడు, రెగ్యులర్ కూరలు తిని బోర్ కొట్టినప్పుడు స్పైసీగా, ఎంతో రుచికరంగా ఈ మసాలా కర్రీని చేసుకోవచ్చు. అన్నంతో పాటు చపాతీ, జొన్న రొట్టెలు వంటి వాటిల్లోకి ఇది సూపర్‌గా ఉంటుంది. మరి, ఆ కర్రీ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
టిప్స్ :
- మసాలాలన్ని చక్కగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాన్ వేడికి ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా ఉండాలంటే అవి చల్లారే వరకు కాసేపు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మసాలా దినుసులు మాడిపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది.
- ఈ రెసిపీ కోసం కారం తక్కువగా ఉండే లావు పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాకాకుండా సన్న మిరపకాయలు తీసుకుంటే మాత్రం స్పైసీనెస్ ఎక్కువై కర్రీ తినడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు.
- ఈ కర్రీలో పెరుగు వేసుకోవడం ద్వారా చిక్కటి గ్రేవీ రావడంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
మసాలా పౌడర్ కోసం :
- మెంతులు - పావుటీస్పూన్
- పచ్చిశనగపప్పు - పావు కప్పు
- దాల్చినచెక్క - చిన్న ముక్క
- లవంగాలు - రెండు
- యాలకులు - రెండు
- మిరియాలు - ఒక టీస్పూన్
- ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు
- సోంపు - అరటీస్పూన్
- ఆవాలు - ఒకటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- తెల్ల నువ్వులు - పావు కప్పు
- ఎండుకొబ్బరి పొడి - పావు కప్పు
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్రత్యేకమైన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద కడాయిలో మెంతులను వేసి సన్నని సెగ మీద దోరగా వేయించాలి.
- అవి వేగాక అందులో పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్‌లోనే రెండుమూడు నిమిషాల పాటు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి.
- శనగపప్పు సగం పైన వేగిన తర్వాత దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఆవాలు వేసుకొని సన్నని సెగ మీద కలుపుతూ వేయించాలి.
- ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని 90% వరకు వేగాక తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని వాటిని రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.
- నువ్వులూ కొద్దిగా వేగిన తర్వాత ఎండుకొబ్బరి పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి. అనంతరం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి.

కర్రీ కోసం :
- లావు పచ్చిమిర్చి - 300 గ్రాములు
- నూనె - నాలుగైదు టేబుల్‌స్పూన్లు(తగినంత)
- ఇంగువ - పావుటీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- కారం - ఒకటీస్పూన్(ఆప్షనల్)
- పెరుగు - పావు కప్పు
- ఇప్పుడు కర్రీ తయారీ కోసం కారం తక్కువగా ఉండి లావుగా, బోలుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తొడిమెలు తీసేసుకోవాలి.

- ఆ తర్వాత వాటిని అర అంగుళం పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా(పై ఫొటోలో కనిపిస్తున్న విధంగా) కట్ చేసుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద కూర కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి ఒకసారి కలపాలి.
- ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అయితే, పచ్చిమిర్చి వేయగానే ఇల్లంతా ఘాటైన వాసన రాకుండా అవి వేసిన వెంటనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- అంతేకానీ, మరీ ఎక్కువగా వేయించుకోవద్దు. అలా వేయిస్తే అవి పేస్ట్‌లా అయిపోతాయని గుర్తుంచుకోవాలి.

- పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, పసుపు, కారం వేసుకొని అవి ముక్కలకు పట్టేలా మరో రెండుమూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
- అయితే, ఇక్కడ పచ్చిమిర్చి కాస్త కారాన్ని ఇస్తాయి. కానీ, అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ మసాలా చప్పగా ఉండకుండా కొద్దిగా కారాన్ని(మీ రుచికి తగినంత) వేసుకోవాలి.
- అనంతరం కర్రీలో గ్రేవీ కోసం కాస్త పుల్లగా ఉన్న పెరుగుని ఉండలు లేకుండా విస్క్ చేసుకొని వేసి కలుపుకోవాలి.
- ఆపై పావుకప్పు వరకు నీళ్లు పోసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్‌లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కమ్మని "పచ్చిమిర్చి గ్రేవీ కర్రీ" రెడీ!
- అయితే, కూర కాస్త పుల్లగా ఉంటే ఇష్టపడే వారు చివర్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవచ్చు.

ఇది ఒక్క చెంచా వేసి "టమాటా పప్పు" చేయండి - కమ్మటి రుచితో చాలా బాగుంటుంది!
స్టఫ్ఫింగ్ లేకుండా "గుత్తి వంకాయ మసాలా" - కూరలో ఇది ఒక్కటి కలిపితే ఫంక్షన్ స్టైల్ టేస్ట్ పక్కా!