ETV Bharat / international

ప్రపంచ కుబేరుల జాబితాలో డొనాల్డ్​ ట్రంప్- ఒక్కసారిగా సంపద అంత పెరిగిందా! - donald trump net worth

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 1:12 PM IST

Donald Trump Net Worth 2024
Donald Trump Net Worth 2024

Donald Trump Net Worth : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కాలం ఒక్కసారిగా కలిసొచ్చింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 6.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. మరోవైపు తన సంపదకు సంబంధించి గతంలో చెప్పిన అబద్ధాల కేసులో ఇటీవలే ట్రంప్​కు పై కోర్టులో ఉపశమనం దొరికింది.

Donald Trump Net Worth : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. తాజా అంచనాల ప్రకారం ట్రంప్‌ సంపద విలువ 4 బిలియన్‌ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి తాజాగా పూర్తయింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. కాగా, గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదని యూఎస్‌ఏ టుడే పేర్కొంది.

​ఆరు నెలలు ట్రంప్​ ఆ పని చేయకూడదు!
ట్రంప్‌నకు చెందిన సామాజిక మాధ్యమం 'ట్రూత్‌ సోషల్‌' సంస్థ డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌(డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ దాదాపు 29 నెలలు కొనసాగింది. ఇక మార్కెట్​లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ చేశాయి. దీనితో ట్రంప్‌ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నేటి నుంచి నాస్‌డాక్‌లో డీజేటీ పేరుతో ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. అయితే నిబంధనల ప్రకారం ఈ కొత్త కంపెనీలోని షేర్​లను ట్రంప్‌ కనీసం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ట్రంప్​కు ఇటీవలే ఊరట లభించింది. తన సంపద గురించి గతంలో అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌ అప్పీల్స్‌ కోర్టును ఇటీవలే ఆశ్రయించారు. అయితే, దిగువ కోర్టు ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయటానికి అప్పీల్స్‌ న్యాయస్థానం ట్రంప్​నకు ఓ షరతు విధించింది. పది రోజుల్లో రూ.1,460 కోట్ల(17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేసినట్లయితే రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

అధ్యక్ష రేసులో బైడెన్, ట్రంప్ జోరు- మరో 4రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో విజయం

'అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే'- డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.