ETV Bharat / health

నో స్మోకింగ్​ డే - ఈ టిప్స్​ పాటిస్తే సిగరెట్​ అస్సలు ముట్టుకోరు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 2:17 PM IST

No Smoking Day 2024
No Smoking Day 2024

No Smoking Day 2024: స్మోకింగ్​.. సరదాగా మొదలై క్రమంగా వ్యసనంగా మారుతుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు.. ఏవైనా గానీ తాగిన మరుక్షణం నుంచే శరీరంలోని అన్ని అవయవాల మీద విపరీత ప్రభావం చూపటం మొదలెడతాయి. ఏటా కొన్ని లక్షల మంది ధూమపానం కారణంగా చనిపోతున్నారు. అందుకే ధూమపానం గురించి అవగాహన కల్పించడానికి ఏటా నో స్మోకింగ్ డేను జరుపుకుంటున్నారు. అసలు నో స్మోకింగ్​ డే అంటే ఏమిటి? దాని హిస్టరీ ఏంటి? స్మోకింగ్​ మానేయడానికి పాటించాల్సిన టిప్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

No Smoking Day 2024: "స్మోకింగ్​ ఈజ్​ ఇంజూరియస్​ టు హెల్త్​".. ఈ పదం చాలా సార్లు వినే ఉంటాం. అయినా కానీ స్మోకింగ్​ మాత్రం మానేయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ధూమపానం కారణంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. వీరిలో 13 లక్షల మంది సిగరెట్ పొగను పీల్చిన వారే ఉంటున్నారు. అందుకే ధూమపానం గురించి అవగాహన కల్పించడానికి, ధూమపానం మానే విధంగా ప్రజలను ప్రేరేపించడానికి ఏటా నో స్మోకింగ్ డేను జరుపుకుంటున్నారు. అసలు నో స్మోకింగ్​ డే అంటే ఏమిటి? దాని హిస్టరీ ఏంటి? స్మోకింగ్​ మానేయడానికి పాటించాల్సిన టిప్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

నో స్మోకింగ్​ డే ఎప్పుడు: ప్రతి సంవత్సరం మార్చి రెండో బుధవారం రోజు నో స్మోకింగ్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 13న నో స్మోకింగ్​ డే వచ్చింది.

చరిత్ర: మొదట 1984లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో 'నో స్మోకింగ్ డే'ని పాటించే ఆచారం వచ్చింది. అప్పుడే ప్రతి ఏటా మార్చిలో రెండవ బుధవారం నో స్మోకింగ్ డే జరుపుకోవాలని నిర్ణయించారు. ధూమపానం మానేయాలనుకునేవారికి సహాయం చేయడానికి ఉద్దేశించిన నో స్మోకింగ్ డేని ఇప్పుడు వార్షిక ఆరోగ్య అవగాహన దినంగా పాటిస్తున్నారు.

నో స్మోకింగ్​ డే 2024 థీమ్​: ప్రతి సంవత్సరం, నో స్మోకింగ్ డే ను ఒక వినూత్న థీమ్‌తో ప్రచారం చేస్తారు. ఈ సంవత్సరం నో స్మోకింగ్ డే 2024 థీమ్ " ప్రొటెక్టింగ్​ చిల్డ్రన్​ ఫ్రమ్​ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్​ఫియరెన్స్​(Protecting Children From Tobacco Industry Interference).

సిగరెట్​ తాగడం వల్ల నష్టాలు: స్మోకింగ్​ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఎంఫిసెమా, బ్రోన్కైటిస్, గుండె జబ్బులతో సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా గొంతు, నోరు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ క్రమంలోనే స్మోకింగ్​ మానేసేందుకు ఈ టిప్స్​ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..

స్మోకింగ్​ మానేసేందుకు టిప్స్​:

  • సిగరెట్‌ తాగాలని అనిపించినప్పుడల్లా ఆరోగ్యకరమైన స్నాక్స్​ తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చచ్చిపోతుందని అంటున్నారు. అలాగే సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా చూయింగ్ గమ్‌ నమలడం, చాక్లెట్‌ తినండి లాంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • చాలా మంది ఒకేసారి ధూమపానం మానేయాలని అనుకుంటారు. కానీ అలాంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దని నిపుణులు అంటున్నారు. అందుకోసం ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే, ఈ రోజు స్మోక్‌ చేయకూడదు అని మనసులో గట్టిగా అనుకోవాలి. పొగ మానేయడానికి సంకల్పం చాలా ముఖ్యం. కాబట్టి ధూమపానం చేయకుండా ఒక వారం, ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే వరకు ఇలా రోజూ చేయాలి.
  • పొగ తాగటాన్ని ప్రేరేపించే సందర్భాలనూ గుర్తించాలి. అంటే కొందరికి కారు నడుపుతున్నప్పుడు సిగరెట్‌ కాల్చాలని అనిపిస్తుంది. మరికొందరికి టీ తాగుతున్నప్పుడు సిగరెట్​ తాగాలని అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఏదో ఒక పని చేస్తున్నప్పుడో, ఒత్తిడిలో ఉన్నప్పుడో స్మోకింగ్‌ చేయాలని అనిపిస్తుంది. ఇలాంటి ట్రిగ్గర్‌ పాయింట్స్‌ గుర్తించి, వాటికి పూర్తిగా దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
  • మీరు సిగరెట్ తాగడం మానేయాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్​కు చెప్పండి. ఇలా చేస్తే వారికి భయపడి పొగతాగడం మానేసే అవకాశం ఉంది. మీరు స్మోకింగ్‌ మానేయడానికి ప్రోత్సహించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు తమతో పాటు పొగ మానేసేవారిని సెలెక్ట్​ చేసుకోవాలి.
  • ఒక వ్యక్తికి ప్రతి గంటకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుంటే ఇకపై అలా కాకుండా ఆ సమయాన్ని 5 నిమిషాలకు పెంచాలి. అంటే ఉదాహరణకు మీరు గంట క్రితం సిగరేట్ తాగితే మరో గంట కాగానే స్మోక్ చేయకుండా ఐదు నిమిషాలు వెయిట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా స్మోకింగ్ సెషన్ల మధ్య విరామాన్ని పెంచుకుంటూ పోతే ఈ వ్యసనాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ స్మాల్ ఛేంజ్ బిగ్ రిజల్ట్​ను అందిస్తుందంటున్నారు నిపుణులు.
  • స్మోకింగ్ మానాలంటే దాని నుంచి మైండ్ డైవర్ట్ చేయాలి. అలా చేయాలనుకుంటే నికొటిన్ రిప్లేస్​మెంట్ థెరపీ (ఎన్​ఆర్​టి) ప్రయత్నించాలి. అందుకోసం మీ డాక్టర్​ను సంప్రదించి వారు సూచించే టిప్స్​ ఫాలో అవ్వడం మంచిది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.