నలభై దాటిన మహిళలు బరువు పెరగకూడదంటే - రోజూ ఇవి తినాలట!
-జీవనశైలి, ఆహారపు అలవాట్లతోనే 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యం -ఇవి తింటే మంచిదని నిపుణుల సూచన!

Published : December 28, 2024 at 2:07 PM IST
Menopause Diet and Nutrition : మెనోపాజ్ వల్ల కావచ్చు.. జీవన విధానంలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువమంది మహిళలు బరువు పెరుగుతుంటారు. దీనికి తోడు శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ వయసులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ వయసులో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. మరి 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
పండ్లు, కూరగాయలు :
మెనోపాజ్‌కి 5 నుంచి 7 సంవత్సరాలకు ముందే శరీరంలో కొన్ని మార్పులు ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఆ టైమ్‌లో పిట్యూటరీ గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ లాంటి హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతాయి. దాంతో మెనోపాజ్ స్టేజ్‌కు చేరుకుంటారు. నార్మల్‌గా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈ సమయంలో మహిళలకు చెమటలు కారిపోతూ ఉంటాయి. వీటిని 'హాట్ ఫ్లషెస్' అంటారు. నిద్రలో కూడా చెమటలు పట్టి, పక్కంతా తడిసిపోయి ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తుంది. ఇలా తరచూ జరగడం వల్ల దాని ప్రభావం దినచర్యపై పడి చిరాకు, కోపం, అసహనం లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. అయితే, మెనోపాజ్‌కు దగ్గరవుతోన్న మహిళలు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లషెస్ వంటి లక్షణాలు తగ్గుతాయని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
అలాగే, నారింజ, ద్రాక్ష, నిమ్మ.. వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్-సి తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర బరువును నియంత్రణలో ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. అంతేకాదు.. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యంగా ఉండడంలో సహాయం చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికీ ఈ పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.
సబ్జా గింజలు :
నల్లగా.. నువ్వుల్లా ఉండే సబ్జా గింజలు మెనోపాజ్‌కు దగ్గరవుతోన్న మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సబ్జా గింజలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో గ్లూటెన్ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. నిండి ఉన్న సబ్జా గింజలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడతాయి. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు భావన కలిగిస్తుంది. అదేవిధంగా ఇందులోని ప్రొటీన్లు ఆహారపు కోరికల్ని నియంత్రిస్తాయి. డైలీ సబ్జా గింజలను నీటిలో నానబెట్టుకుని తినచ్చు. లేకపోతే సలాడ్లు, స్మూతీలలో కలుపుకొని తీసుకున్నా ఫలితం ఉంటుంది.
ఎగ్స్ :
మెనోపాజ్‌కు దగ్గరవుతోన్న మహిళల్లో విటమిన్-డి, ఐరన్ స్థాయులు క్రమంగా తగ్గిపోతుంటాయి. ఇలాంటప్పుడు ఈ రెండు పోషకాలు పుష్కలంగా లభించే కోడిగుడ్లు తప్పనిసరిగా డైట్ చేర్చుకోవాలి. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఎగ్స్‌లోని ప్రొటీన్లు మెనోపాజ్ కారణంగా స్త్రీలలో పెరిగే చెడు కొవ్వును కరిగిస్తాయట! ఫలితంగా భవిష్యత్తులో గుండె సమస్యలు, స్థూలకాయం.. లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
"కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? - ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి!"
బాడీ పెయిన్స్ తీవ్రంగా ఉన్నాయా? ట్యాబ్లెట్స్ వేయకుండా కారణాలు తెలుసుకోండి!

