ETV Bharat / education-and-career

'రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకండి' - గూగుల్ మాజీ రిక్రూటర్​ - Resume Writing Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 10:27 AM IST

Resume Preparation Tips
Resume Writing Tips

Resume Writing Tips : మీరు మొదటిసారిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నారా? లేదా ఇప్పటికే మీ రెజ్యూమ్ చాలా సార్లు తిరస్కరణకు గురైందా? అయితే ఇది మీ కోసమే. గూగుల్‌ మాజీ రిక్రూటర్‌ నోలన్‌ చర్చ్‌ 'రెజ్యూమ్' రాసేటప్పుడు అభ్యర్థులు చేస్తున్న 3 ప్రధానమైన తప్పులు గురించి చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.​

Resume Writing Tips : ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైపోయింది. అందువల్ల మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవాలంటే ప్రతీ విషయంలోనూ బాగా ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెజ్యూమ్ (Resume) రాసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

వాస్తవానికి మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేటప్పుడు, ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు, రిక్రూటర్లు ముందుగా చూసేది మీ రెజ్యూమ్​నే. అయితే హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ప్రతి రోజూ వందలాది రెజ్యూమ్​లు పరిశీలించాల్సి ఉంటుంది. కనుక వారిని ఆకట్టుకునేలా రెజ్యూమ్​ను రూపొందించుకోవాలి. రెజ్యూమ్​లో మీ అర్హతలు, నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఫెయిర్‌ కాంప్ సీఈఓ, గూగుల్‌ మాజీ రిక్రూటర్‌ నోలన్‌ చర్చ్‌ సూచించారు. అంతేకాదు అభ్యర్థులు రెజ్యూమ్​ను ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేస్తున్న 3 ప్రధానమైన తప్పులు గురించి వివరించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1. వాక్యాలు చిన్నగా ఉండాలి!
చాలా మంది రెజ్యూమ్​లో చాాలా పెద్ద పెద్ద వాక్యాలు రాస్తూ ఉంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. రెజ్యూమ్​లోని వాక్యాలు వీలైనంత చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక వాక్యం గరిష్ఠంగా 25 పదాలకు మించకుండా ఉండేలా చూసుకోవాలి. రిక్రూటర్‌లు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరి రెజ్యూమ్​లను పరిశీలించాల్సి ఉంటుంది. కనుక ఒక్కో దాన్ని పరిశీలించడానికి కేవలం 3 నుంచి 5 సెకన్లు మాత్రమే సమయం ఉంటుంది. ఈ తక్కువ సమయంలోనే రిక్రూటర్లను ఆకర్షించే విధంగా రెజ్యూమ్​ను రూపొందించుకోవాలి. ఇందుకోసం సులభంగా అర్థమయ్యేలా చిన్న చిన్న వాక్యాలతో రెజ్యూమ్ రూపొందించాలి.

2. అతిగా కీవర్డ్స్​ వాడకూడదు!
రెజ్యూమ్​లో కీవర్డ్స్ ఉపయోగించడం మంచిదే. కానీ అతిగా కీవర్డ్స్​ ఉపయోగించడం మాత్రం సరైన పద్ధతి కాదని నోలన్‌ చర్చ్‌ స్పష్టం చేశారు. సాధారణంగా కెరీర్‌ ఎక్స్‌పర్ట్‌లు జాబ్‌ డిస్క్రిప్షన్‌కు అనుగుణంగా కీవర్డ్స్​ ఉపయోగించాలని చెబుతుంటారు. దీనిని మనస్సులో పెట్టుకొని కొందరు అభ్యర్థులు చాలా ఎక్కువగా కీవర్డ్స్​ వినియోగిస్తుంటారు. అలా ఎక్కువ కీవర్డ్స్​ వాడటం మంచిది కాదంటారు చర్చ్‌. మరీ ముఖ్యంగా జాబ్‌ డిస్క్రిప్షన్‌లో బుల్లెట్‌ పాయింట్స్‌ రాసేటప్పుడు, ఏ వాక్యంలోనూ ఒకటి కంటే ఎక్కువ కీవర్డ్స్‌ వాడకూడదని ఆయన సూచిస్తున్నారు.

3. లక్ష్యాల గురించి అతిగా చెప్పకూడదు !
ఉద్యోగంలో భాగంగా పై అధికారులకు ఇ-మెయిల్‌ చేస్తుంటాం. అలాగే ప్రతీ త్రైమాసికానికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి రొటీన్‌ అంశాలను రెజ్యూమ్​లో పొందుపరచకూడదని నోలన్ చర్చ్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇలాంటి రొటీన్​ విషయాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే వీటికి బదులుగా, ఒక వ్యాపారానికి నిర్దిష్టంగా తామెలా ఉపయోగపడిందీ వివరంగా చెప్పాలి. కొత్త కస్టమర్లను తీసుకురావడం, సేల్స్‌ టార్గెట్‌ను అధిగమించడం లాంటి అంశాలను రెజ్యూమ్​లో పేర్కొనాలి. మీ పనితీరును, సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేసేలా గణాంకాలు కూడా పేర్కొనాలి. అప్పుడే రిక్రూటర్లకు మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్!

కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్​ మాత్రం సేఫ్​! - Jobs That Are Safe From AI

ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - How To Success In Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.