ETV Bharat / bharat

'73% ఉన్న బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారు'- బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 4:29 PM IST

Updated : Mar 3, 2024, 5:08 PM IST

Rahul Gandhi On BJP
Rahul Gandhi On BJP

Rahul Gandhi On BJP : కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో 73శాతం ఉన్న బలహీన వర్గాల ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆదివారం బిహార్ రాజధాని పట్నా​లో ఆర్​జేడీ ఏర్పాటు చేసిన జన్​ విశ్వాస్​ ర్యాలీలో రాహుల్​ మాట్లాడారు.

Rahul Gandhi On BJP : దేశంలో 73శాతం ఉన్న బలహీన వర్గాల ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆదివారం బిహార్ రాజధాని పట్నా​లో ఆర్​జేడీ ఏర్పాటు చేసిన జన్​ విశ్వాస్​ ర్యాలీలో పాల్గొన్న రాహుల్​, బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఒక పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని, కానీ తాము విద్వేషపు మార్కెట్​లో ప్రేమ దుకాణం తెరుస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరికీ అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

"దేశంలో ఏదైనా మార్పు జరుగుతుంటే, అది మొదటగా బిహార్​లోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తుంది. బిహార్​ దేశ రాజకీయాలకు ప్రధానమైంది. ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ద్వేషం, హింస, అహంకారం ఉంటే, మరోవైపు ప్రేమ, గౌరవం, సోదరభావం ఉంది. ఇండియా కూటమి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, విద్వేషపు మార్కెట్​లో ప్రేమ దుకాణం."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

"ప్రధానమంత్రి ఇద్దరు, ముగ్గురు కుబేరుల కోసమే పనిచేస్తారు. వారికి గత పదేళ్లలో రూ.16లక్షల కోట్ల మేర రుణమాఫీ చేశారు. కానీ దేశంలో రైతులు, కార్మికులకు ఎంత రుణమాఫీ చేశారు? అందుకే దేశంలో అసహనం పెరిగిపోతోంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశంలో వెనుకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 50 శాతం. దళితులు ఎంతమంది ఉన్నారో తెలుసా? 15శాతం, గిరిజనులు 8 శాతం ఉన్నారు. మొత్తం 73 శాతం మంది. దేశంలోని పెద్ద కంపెనీల యజమానుల జాబితా తీసుకుంటే అందులో ఈ 73 శాతానికి చెందిన వారు ఒక్కరు కూడా ఉండరు. ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల యజమానుల జాబితా తీసినా, ఈ 73శాతానికి చెందిన వారు ఒక్కరూ ఉండరు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి రూ.100 ఖర్చు చేస్తే, ఈ 73 శాతానికి 6 రూపాయలు మాత్రం దక్కుతోంది. ఈ 73శాతానికి అగ్రవర్ణ పేదలను కూడా కలిపితే వారికి ఈ దేశంలో ఎలాంటి అవకాశాలు లేవు." అని రాహుల్ గాంధీ అన్నారు.

'కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్షాలకు బెదిరింపులు'
బీజేపీ సర్కారు సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను విపక్షాలపైకి సంధించి భయపెట్టాలని చూస్తోందని RJD నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. ప్రతిగా అవినీతిపరులను బీజేపీలో చేర్చుకుంటూ, వారు సచ్చీలురు అనే సర్టిఫికెట్‌ ఇస్తోందని మండిపడ్డారు.

"మీరు (బీజేపీ) ఎంతగా భయపెట్టాలని చూసినా, ఎంతగా అణగదొక్కాలని చూసినా మా తండ్రి ఏమాత్రం వెనకడుగు వేయలేదు, భయపడలేదు. లాలూ భయపడనప్పుడు, ఆయన కుమారుడు భయపడతాడా? చివరి శ్వాస వరకు పోరాడతాం. గతంలో రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు ఇచ్చారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో మా పొత్తులు ఖరారు కాగానే, అఖిలేశ్‌ యాదవ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చారు. మాకైతే కుటుంబసభ్యులందరికీ సమన్లు పంపారు. కానీ భయపడే వ్యక్తులం కాదు. మీరు వాషింగ్‌ మెషిన్‌ను చూశారు కదా. అవినీతిపరులంతా బీజేపీలోకి వెళ్లగానే వారంతా మంచివారు అయిపోతారు. బీజేపీ వాషింగ్‌ మెషిన్‌తోపాటు చెత్తబుట్ట పార్టీగానూ మారిపోయింది. ఎందుకంటే మిగతా పార్టీల్లో చెత్త అంతా వెళ్లి బీజేపీలో చేరుతోంది."

--తేజశ్వీ యాదవ్‌, ఆర్​జేడీ నేత

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు ప్రతిపక్ష నేతలు భయపడరని తెలిపారు. ఈ ర్యాలీకి ఆర్​జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్​తో పాటు తేజశ్వీ యాదవ్​, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఎస్​పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ హాజరయ్యారు.

Jan Vishwas Rally In Patna
జన్​ విశ్వాస్ ర్యాలీకి హాజరైన ప్రజలు
Jan Vishwas Rally In Patna
జన్​ విశ్వాస్ ర్యాలీకి హాజరైన ప్రజలు
Jan Vishwas Rally In Patna
జన్​ విశ్వాస్ ర్యాలీకి హాజరైన ప్రజలు
Last Updated :Mar 3, 2024, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.