ETV Bharat / bharat

'యూపీ సీటు కాపాడుకోలేక కేరళకు రాహుల్​!'- 'బీజేపీ ఆలోచన దేశ ప్రజలకు అవమానం' - Kerala Loksabha Polls Modi Rahul

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 1:45 PM IST

kerala loksabha polls modi rahul
kerala loksabha polls modi rahul

Kerala Loksabha Polls Modi Rahul : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో కేరళలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. యూపీలో కుటుంబ సీటును కాపాడుకోవడం కష్టంగా భావించి కేరళలో తన కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని రాహుల్​ను ఉద్దేశించి మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, కాంగ్రెస్‌ భావజాలానికి మధ్య ప్రధాన పోరు జరుగుతోందని అన్నారు రాహుల్.

Kerala Loksabha Polls Modi Rahul : దక్షిణాది రాష్ట్రం కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటాపోటీగా పర్యటిస్తున్నారు. కేరళలోని పాలక్కడ్‌లో జరిగిన ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొనగా, రాహుల్ గాంధీ వయనాడ్​లో భారీ రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసుకున్నారు.

'యూపీ సీటు కాపాడుకోవడం కష్టంగా భావించి!'
కాంగ్రెస్‌కు చెందిన ఓ అగ్రనేత ఉత్తర్‌ప్రదేశ్‌లో తన కుటుంబ సీటును కాపాడుకోవడం కష్టంగా భావించి, కేరళలో తన కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి దేశంలో నిషేధించిన ఓ సంస్థతో కాంగ్రెస్‌ రహస్యం ఒప్పందం చేసుకుందని మోదీ ఆరోపించారు.

ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్‌ రైళ్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని మోదీ హామీ ఇచ్చారు. కేరళలోని పాలక్కడ్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని, తమ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుందన్నారు. గత పదేళ్లలో జరిగింది, మీరు చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, దేశానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భారత్‌ను బలహీన దేశంగా మార్చితే, బీజేపీ బలమైన దేశంగా మార్చిందని తెలిపారు. గత పదేళ్లలో భారత విశ్వసనీయతను తమ ప్రభుత్వం ఎలా పెంచిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు మోదీ.

"నేడు దేశంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. పశ్చిమ భారత దేశంలోని అహ్మదాబాద్, ముంబయి మధ్య బుల్లెట్‌ రైలు పనులు జరుగుతున్నాయని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించాం. రానున్న రోజుల్లో అది పూర్తయిన వెంటనే దేశంలో మొట్టమొదటి బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుంది. దాని అనుభవాన్ని చూసి, ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్‌ రైళ్ల కోసం సర్వే ప్రారంభిస్తాం."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

బీజేపీ ఆలోచన దేశ ప్రజలకు అవమానం: రాహుల్
మరోవైపు, దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే బీజేపీ ఆలోచన దేశ ప్రజలకు అవమానకరమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడుతోందని తెలిపారు. దేశ ప్రజల మాట వినాలని, వారి విశ్వాసాలు, భాష, సంస్కృతిని ప్రేమించాలని, గౌరవించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. బీజేపీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే నాయకుడు అంటోందని, అది దేశంలో ప్రతి ఒక్క యువకుడికి అవమానమని రాహుల్‌ అన్నారు.

"ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, కాంగ్రెస్‌ భావజాలానికి మధ్య నేడు ప్రధాన పోరు జరుగుతోంది. ఒకే దేశం, ఒకే ప్రజలు, ఒకే భాష, ఒకే నాయకుడని బీజేపీ నేతలు, ప్రధానమంత్రి అంటున్నారు. భాష అనేది పైనుంచి విధించేది కాదు, భాష అనేది వ్యక్తి లోపల నుంచి, వ్యక్తి హృదయం లోపల నుంచి బయటకు వచ్చేది. దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్క భారతీయ యువకుడికి అవమానం" అని రాహుల్ విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.