ETV Bharat / bharat

కేంద్రంతో చర్చలకు రైతులు 'నో'- శుక్రవారం 'బ్లాక్​ డే'గా పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 10:15 PM IST

Govt Farmers Talks
Govt Farmers Talks

Farmers Govt Talks : కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు రైతులు సంఘాలు నిరాకరించాయి. అలాగే, నిరసనల్లో పాల్గొన్న యువరైతు శుభకరణ్ సింగ్​ మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.

Farmers Govt Talks : కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కర్షకులతో కేంద్రం మరో విడత చర్చలు జరిపేందుకు ఆహ్వానించినప్పటికీ రైతు సంఘాలు నిరాకరించాయి. ఓ వైపు రైతులు బుల్లెట్లను ఎదుర్కొంటుండగా, మరో వైపు కేంద్రం చర్చలకు పిలుస్తోందని రైతు సంఘం నేత అభిమన్యు కొహిర్ ఆరోపించారు. అందుకే కేంద్రంతో చర్చలకు సిద్ధంగా లేమని ఆయన తెలిపారు.

నిరసనల్లో పాల్గొన్న యువరైతు శుభకరణ్ సింగ్​ మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. రైతు మరణానికి కారణమైన హరియాణ సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్​, ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని కోరింది. రైతు మృతికి సంతాపంగా దేశంలో శుక్రవారం 'బ్లాక్ డే' పాటిస్తామని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 26న రైతులు హైవేలపై ట్రాక్టర్‌ మార్చ్‌లు నిర్వహిస్తారని, మార్చి 14న దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆల్‌ ఇండియా ఆల్‌ కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ను నిర్వహిస్తారని పేర్కొంది.

బీజేపీపై కాంగ్రెస్ ఫైర్​
రైతుల సమస్యలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతుల ఆందోళనలపై చర్చించేందుకు పంజాబ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరింది. 'రైతులు మన దేశానికి వెన్నెముక. అన్నదాత బలంతోనే హరిత విప్లవం, శ్వేత విప్లవం తీసుకురాగలిగాం. వారి కృషి వల్లే భారతదేశం వ్యవసాయ రంగంలో మంచి పురోగతి సాధించింది. ప్రస్తుతం అదే రైతులు ఎంఎస్‌పీ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ వారికి 'బుల్లెట్‌ గ్యారెంటీ' ఇస్తున్నారు. రైతులపై టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించడం, కాల్పులు జరపడం అన్యాయం.' అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.

ఉపాధి కల్పించాలని కోరినప్పుడు యువకులను లాఠీలతో కొట్టారని జైరాం రమేశ్ ఆరోపించారు. అగ్నిపథ్ లాంటి పథకాలతో యువత భవిష్యత్ నాశనం అవుతుందని బీజేపీ సర్కార్​పై మండిపడ్డారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.