ఒడిశా రైలు ప్రమాద మృతులకు నివాళులు.. పదో రోజు గుండు గీయించుకున్న గ్రామస్థులు!
Odisha Train Accident : యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదం జరిగి పది రోజులైన నేపథ్యంలో బహనగా గ్రామస్థులు.. మృతులకు సామూహిక నివాళులు అర్పించారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. హిందూ ఆచారాల ప్రకారం.. గ్రామానికి చెందిన పురుషులు గుండు గీయించుకున్నారు. అనంతరం పసుపు రాసుకుని చెరువులో స్నానాలు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆదివారం ఉదయం.. బహనగా ప్రాంతంలో జరిగిన సంస్మరణ సభకు గ్రామస్థులు హాజరయ్యారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. అంతా కలిసి మృతులకు సామూహికంగా నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి భోజనం పెట్టారు. రైలు ప్రమాదం జరిగి 11వ రోజైన సోమవారం ఉదయం 11.00 గంటలకు 101 మంది బ్రాహ్మణులు.. విశ్వశాంతి మహా యజ్ఞం చేపట్టనున్నారు. ఆ తర్వాత అఖండ గాయత్రీ మంత్రం జపించే కార్యక్రమం జరగనుంది.
మంగళవారం నాడు సత్సంగంతో పాటు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించే కార్యక్రమం జరగనుంది. జూన్ 2వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో బహనగాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారు.