కరోనా వేళ ఈ ఏడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు పూర్తిగా కళ తప్పాయి. విగ్రహాలు సైతం సగానికి సగం తగ్గగా.. ఉన్న చోటా అంతగా సందడి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో వినూత్న వినాయక విగ్రహాలు వెలిశాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులు చాలాచోట్ల పర్యావరణహిత విగ్రహాలను ప్రతిష్ఠించారు. శరీరం కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకునే శొంఠి, మిరియాలు, పసుపు వంటి పదార్థాలతోపాటు... తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు వంటి వాటితో విగ్రహాలు తయారు చేశారు. మరికొందరు వినాయక విగ్రహాల చిత్రాలను బ్యానర్లను మాత్రమే మండపాలలో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి వినూత్న విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
40 ఏళ్లుగా వినూత్నంగా
నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తాలో 40 ఏళ్లుగా వినూత్నంగా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఈ ఏడాది మిరియాలు, ముత్యాలు, అల్లంతో తయారు చేసిన ఐదు అడుగుల మేర మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బురుగుగల్లీలో ఈ ఏడాది.... కరోనాకు విరుగుడుగా వాడే వస్తువులతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. కషాయంలో వాడే నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు, సాబుదాన, పసుపు కొమ్ములు, శొంఠి, వామ, మిరియాలు, ఇలాచ్చి, దాల్చిన చెక్క వంటి పదార్థాలను ఉపయోగించి వినాయకుడ్ని తయారు చేశారు.