TRS and BJP Leaders Complaint to CEO: మునుగోడులో ఓ వైపు పోలింగ్ కొనసాగుతుండగా... ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ తెరాస, భాజపా నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసుకున్నారు. సీఈవో వికాస్‌రాజ్‌తో మాట్లాడిన మంత్రి జగదీశ్‌రెడ్డి... భాజపా మద్యం, నగదు పంపిణీ చేస్తోందని వివరించారు.
చౌటుప్పల్, జనగామ, చండూరు, తుమ్మలపల్లిలో పంపిణీ జరుగుతున్నట్లు చెప్పిన ఆయన.... నిబంధనలకు విరుద్ధంగా నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... సీఈవో వికాస్‌రాజ్‌కు ఫోన్ చేశారు. మునుగోడులో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ దృష్టికి 28 ఫిర్యాదులు రాగా.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సైతం ఈసీని ఆశ్రయించారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వారిపై చట్టపరంగా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.